The Musings Of A Policeman About His Service On The Eve Of Retirement Will Make You Emotional!

Updated on
The Musings Of A Policeman About His Service On The Eve Of Retirement Will Make You Emotional!

కొన్ని ప్రయాణాలు దూరాల్ని దగ్గర చేస్తాయి, కానీ ఈ పావుగంట ప్రయాణం నా మనసుకి అతి దగ్గరైన నా వృత్తిని నాకు దూరం చేయబోతుంది,ఈ పోలీస్ జీపులో నాకిదే ఆఖరి ప్రయాణం. పాతికేళ్ల వయసులో ఈ ఒంటిమీదకి ఖాకి చొక్కా వొచ్చింది, అప్పుడు నేను ఉడుకురక్తం తో ఉన్న యువకుడిని, ఇప్పుడు తల నెరసి షుగర్, బీపీ ఉన్న 58 ఏళ్ల మనిషిని. ఒక సాదాసీదా కానిస్టేబుల్ గా మొదలై 3 జిల్లాలు మారి 10 ట్రాన్ఫర్ల తర్వాత ఈరోజు హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్ అవ్వబోతున్నా. మొదటిరోజు కానిస్టేబుల్ రాజు గా నేను ఎవరికీ తెలీదు, ఈరోజు హెడ్ కానిస్టేబుల్ రాఘవరాజంటే డిపార్ట్మెంట్ లో అందరికి తెలుసు,నమ్ముకున్న నిజాయితీ తోనే ఇన్నేళ్లు నడిచాను,అందుకే ఈరోజు రిటైర్మెంట్ రోజున స్వయంగా మా ఎస్పీ సారే నన్ను దగ్గరుండి మరీ తీసుకెళుతున్నారు. ఇంతకుమించిన గౌరవం ఇంకేముంటుంది. 33 సంవత్సరాలు, మొదట నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వొచ్చిందంటే మా అమ్మ నాయన భయపడ్డారు,అసలే రోజులు బాలేవు అని,బంధువులు ఈర్షపడ్డారు,ఇంకేమి త్వరలోనే లక్షాధికారివి అయిపోతావు,రెండు చేతులా సంపాదిస్తావు అంటూ. మిత్రులు సంతోషపడ్డారు, మనలో ఒకడు పోలీస్ ఉద్యోగం లో చేరాడని. ఈ ఖాకి చొక్కాని తాకట్టు పెట్టి ఏనాడూ నేను సుఖపడలేదు, వొచ్చే జీతం తోనే తృప్తి పడ్డాను.

నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పోలీస్ అంటే అందరికి ఎందుకో ఒక విపరీత భావం. మొదటి సారి 1989 ఎన్నికలప్పుడు డ్యూటీ మీద మంథని వెళ్ళడానికి నాతో పాటు మరో పది మందిమి ఆర్టీసీ బస్సు ఎక్కగానే బస్సులో ఉన్నవాళ్ళందరూ దిగి వేరే బస్సు ఎక్కారు,పోలీసులున్నారని బస్సు మీద దాడి చేస్తారేమో అని, అది నా మొదటి చేదు అనుభవం. ఇలాంటివి ఎన్నెన్నో జరిగాయి. మేము లాఠీ పట్టుకునేది శాంతి కోసం. మా చేతిలో తుపాకీ సమాజ భద్రత కోసం ,ప్రజల రక్షణ కోసం . పోలీస్ అంటే ఆపదలో ఆసరా, కష్టం లో మేమున్నాం అనే నమ్మకం. అందరికి జాబ్ సెక్యూరిటీ కనిపిస్తుంది కానీ, ఇందులో లైఫ్ కి మాత్రం సెక్యూరిటీ ఉండదు. ఖాకి చొక్కా ఉంది కదా, సకల సుఖాలు అనుభవిస్తుంటారు అని అనుకుంటారు,.... ఎక్కడో ఢిల్లీలో పాలకుల మీద కోపానికి పగిలే తలలు మావే, ఉన్మాదుల ప్రతీకారం మాపైనే, ఉద్యమకారుల ఆవేశాలు ఆగ్రహాలు మా మీదే. ప్రతీ పోరాటంలో మొదట చిందే నెత్తుటి బొట్టు మాదే. అదెవరికి పట్టదు, అసలు పోలీస్ అంటేనే పడదు. పొరపాటునో గ్రహపాటో ఒక చిన్న చీడపురుగు చేసే తప్పు మాత్రం అందరికి ఆపాదిస్తారు. ఎన్ని కష్టాలుంటాయో ఈ వృత్తిలో నేరస్తులతో ఖైదీలతో సహజీవనం చేయాలి....ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాలి...సమస్యని వెత్తుకుంటూ వెళ్లి దానికి ఎదురునిలవాలి.... ఓ చేత్తో సంసారం ఓ చేత్తో ఉద్యోగం ప్రతికూలతల మధ్య ఎదురీదాలి.

ఎడాపెడా సంపాదించి తెగ తినేసి పొట్ట పెంచేశారని అందరూ జోకులేసుకుంటారు,కానీ ఆదో వ్యాధి అని ఎవరికి తెలుసు,టైం కి తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. కంచం ముందు కూర్చున్నాక కూడా మెతుకు ముట్టని రోజులు ఎన్నో, ఎండకి ఏండీ వానకి తడిసి. పడిపోతూ పరిగెడుతూ ఒళ్ళు హూనం అవుతున్నా , మా భాదలు ఎవరికీ చెప్పుకోము. విధుల్లో ఉన్నపుడు చస్తే రెండు నిముషాల సంతాపం, ఒక మాట తో సానుభూతి. తండ్రిగా ,భర్తగా ఫెయిల్ అయినా ఉద్యోగంలో మాత్రం డిస్టిన్షన్ తో మొదటి ర్యాంక్ మాది. ఎవరు ఎన్ని అన్నా,ఏమనుకున్నా, దేశం కోసం,సమాజం కోసం పనిచేస్తున్నాం అనే గర్వం చాలు అదే అతిపెద్ద కిరీటం. సేవ, రక్షణ, స్ఫూర్తి ఈ మూడింటి కలయికే పోలీస్.

ఊరంతా కుటుంబాలతో పండుగల రోజులలో సంతోషంగా ఉంటుంటే ఆ సంతోషానికి మేము భరోసా,మా పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉంటూ.కష్టాలు తీర్చమని అందరూ మొక్కే ఆ దేవుడికీ ఆయన గుడికి కూడా ఈ పోలీసోడె కాపలా. నా కొడుకు క్లాస్ ఫస్ట్ వొచ్చి ప్రైజ్ తీసుకునేప్పుడు నేనెప్పుడూ వెళ్లలేకపోయా . తండ్రిగా ప్రతీసారి ఓడిపోయిన నన్ను ,నువ్వు నాకు ఆదర్శం నాన్న,నేను నీలానే పోలీస్ అవుతా అని చెప్పి ఈ రోజు , నా రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఒక ఐపీఎస్ అధికారి హోదాలో లాల్ బత్తి కార్ లో వొస్తున్నాడు, మా రాఘవరాజు కొడుకు ఇప్పుడు ఎస్పీ అంటూ మా వాళ్ళందరూ గొప్పగా చెబుతుంటే , ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది . ఈరోజుతో ఈ హెడ్ కానిస్టేబుల్ రాఘవరాజు కి నాకు అమ్మఒడి లాంటి ఈ పోలీస్ స్టేషన్ కి అనుభందం తీరిపోనుంది . నమ్మిన నీతి నిజాయితీ తో ఎక్కడా చేయి చాచకుండా,నోరుజారకుండా ఇన్నేళ్లు ఒక కట్టుబాటు తో విలువలతో బతికినందుకు ఒకింత గర్వంగా కూడా ఉంది.

PS – Chai Bisket Salutes the Brave Police who had Dedicated their Lives for the Service Of Nation. We Owe You A lot………!