You Must Read This Story of a Farmer Who is Becoming an Inspiration Worldwide!
Srikanth Kashetti
Updated on
బురద నుండి బువ్వ తీసే అన్నదాతకు అడుగడుగునా కష్టాలే.. పంట పెట్టుబడి కోసం అప్పులు, సరైన సమయంలో వర్షాల దగ్గర నుండి నాణ్యమైన విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చులు, పంటను ఆశించే చీడపీడల నుండి రక్షణ కోసం పురుగు మందుల కొనుగోళ్ళు ఇలా సవాలక్ష సమస్యలు దాటి పంట చేతికొచ్చాకా మార్కెట్ లో గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు ఒక రైతు ఎదుర్కుంటాడు. ఓ సొంతబిడ్డను పెంచి పెద్దచేసి మంచి ప్రయోజికుడిని చేసి ఉద్యోగం పొందేవరకు తండ్రి ఎన్ని కష్టాలు పడతాడో అంతకన్నా ఎక్కువ కష్టాలు కొన్ని నెలల కాలంలోనే మన రైతు అనుభవిస్తాడు. ఇప్పటికి భారతదేశంలో రోజుకు ఎంతో మంది రైతులు వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చేంత శక్తిలేక మానసికంగా, శారీరకంగా, ఆర్ధికంగా చితికిపోయి తమని తాము చంపుకుంటున్నారు.
వ్యవసాయం అంటే ఓ దండగా అన్న ఏవగింపు నుండి వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని ఊరడింపు నిస్తూ దేశ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మన నాగరత్నం గారు. రసాయనాల ఎరువుల కన్నా సాంప్రదాయకమైన ఎరువులే శక్తివంతమైనవి వాటి ద్వారా పండిన పంటలే ఆరోగ్యానికి మంచిది. అని బలంగా నమ్మి వ్యవసాయం చేస్తు జాతీయ స్థాయిలో ఉత్తమ రైతుగా మాత్రమే కాదు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నుండి అభినందనలు అందుకున్న "ఓ రైతు విజయ కథ" ఇది...
ఒక దేశానికి భద్రతగా సైనికుడు ఉంటే ఆ దేశ ప్రజల ఆహార భద్రత కోసం రైతు అండగా ఉంటాడని బలంగా నమ్ముతారు నాగరత్నం గారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మండలం తారామతి గూడెం అనే గ్రామంలో ఈయన వ్యవసాయ క్షేత్రం ఉంది. ప్రారంభదశలో(1990) 12 ఎకరాల బంజరు భూమిని కొనుగోలు చేసి ఒక్కో ఎకరం బాగుచేసుకుంటూ సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దుకున్నారు.. సేద్యానికి అత్యంత అనుకూలమైన భూమిగా తయారుచేశారు. శ్రీవరి సాగులో ఎకరాకు 92 బస్తాల ధాన్యాన్ని సేంద్రీయ ఎరువులతో పండించి తోటి రైతులు మాత్రమే కాదు వ్యవసాయ శాస్త్రవేత్తలను సైతం సంబ్రమశ్ఛర్యాలకు లోను చేస్తున్నారు. పండ్లు, పూలు కూరగాయలు, ఆకుకూరలు వరి, వివిధ ధాన్యాలు, ఆయిల్ సంబంధిత మొక్కలు, ఔషద మొక్కలు లాంటి 30రకాల పంటలను పండిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వాతావరణం మూలంగా జీవిత కాలం పెరుగుతుంది అని నిరూపిస్తూ నాగరత్నం గారి అమ్మ(వయసు 93 సంవత్సరాలు) ఇప్పటికి అదే పొలంలో పనిచేస్తుంటుంది ఇద్దరు మనుషులు చేసే పనులను తనొక్కరే చేస్తున్నానని గర్వంగా చెబుతారు.
ఒక రైతు తలుచుకుంటే తన భూమిని సంపూర్ణంగా ఉపయోగించుకునేదుంటే సంవత్సరంలో, నెలలో మాత్రమే కాదు ప్రతిరోజు ఆదాయం ఉంటుందని నిరుపిస్తున్నారు నాగరత్నం గారు. ఒక నటుడి కొడుకు నటుడు అవుతున్నాడు.. ఒక డాక్టర్ కొడుకు మరో డాక్టర్.. ఒక ఇంజనీర్ కొడుకు మరో ఉన్నత ఉద్యోగిగా లక్ష్యం చేరుకుంటున్నారు.. కాని రైతు కొడుకు మాత్రం మరో రైతు కావడం లేదు కారణం ఇందులో ఉన్న రిస్క్. నాగరత్నం గారు మాత్రం తాను ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాడో అదే పద్దతులను మిగిలిన రైతులకు వివరిస్తూ వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. కేవలం తన దగ్గరి ప్రాంతం వారు మాత్రమే కాదు శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, మలేషియా, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్, రష్యా వంటి దేశ ప్రభుత్వ అధికారులు ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి వ్యవసాయంలో విలువైన పద్దతులను తెలుసుకుంటున్నారు
గుడివాడ నాగరత్నం గారి కోరిక ఒక్కటే.. "దేశానికి అన్నం పెట్టె రైతు బిచ్చగాడు కాకూడదు.. నేను నాగరత్నం, రైతుని అని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నానో నాలాగే ప్రతి రైతు గర్వంగా, సంతోషంగా చెప్పుకునే రోజు రావాలి".
Article source : HMTV
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.