కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంటుంది.. "ఇలాంటి వ్యక్తి ఊరికి ఒక్కడున్నా చాలు దేశం మారిపోతుంది" అలాంటి మనలో ఒకడి గురించే మనం ఈరోజు చెప్పుకోబోయేది..
ఆ ఊరికి సూర్యుడు: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన సూర్యచంద్ర(ప్రస్తుత సర్పంచ్) గారి అమ్మ గారు కూడా ఆ గ్రామ సర్పంచ్(2001). ఎక్కడైనా గాని కేవలం వారసత్వం వల్ల విజయాలు రావు, మన పనిని నిబద్ధతను బట్టే గుర్తింపు, గౌరవం దక్కుతుంది. నిజానికి సూర్యచంద్ర గారు రాక ముందు ఆ ఊరిలో రకరకాల సమస్యలుండేవి. ప్రతి ఒక్కరూ మాకెందుకులే అని వదిలేసి అదే ప్రాంతంలో, అదే పరిస్థితులతో సహవాసం చేస్తుండేవారు. సూర్యచంద్ర గారు వచ్చాక తానొక్కడు మాత్రమే కాకుండా మిగిలిన గ్రామస్థులను కలుపుకుని తెలుగు రాష్ట్రాలలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దారు.
లాస్ట్ నుండి ఫస్ట్ కు.. 2006లో సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్నాక స్కూల్ లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 54%. మండలంలోనే ఆ సంవత్సరం అతి తక్కువ రిజల్ట్స్ వచ్చిన స్కూల్ అది. పటిష్టమైన ప్రణాళికలు, ఇంకా సూర్యచంద్ర గారు నెలలో కొన్నిరోజులు విద్యార్ధులను మోటివేట్ చేయడంతో ఈ సంవత్సరం రిజల్ట్స్ 100% వచ్చింది. ఇప్పుడు మండలంలోనే బూరుగుపూడి ది బెస్ట్ స్కూల్.
స్వచ్ఛ బూరుగుపూడి: ఈ గ్రామం చెత్తతో అపరిశుభ్రంగా ఉండేది. 6,000 గ్రామస్థుల సంపూర్ణ సహకారంతో గ్రామాన్నంత శుభ్రం చేసి అదే పరిశుభ్రతను ప్రతిరోజు కొనసాగిస్తున్నారు. సూర్యచంద్ర గారి ఆద్వర్యంలో 10,000 చెట్లు (వాటికి పేర్లు కూడా పెట్టి) నాటి ఆ ఊరిని నందనవనం చేశారు.
రేపటి అమ్మ కోసం: పుట్టిన తర్వాత కాదు గర్భంలోకి శిశువు ఎదిగే క్రమం నుండే మంచి న్యూట్రిషియన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన చోట పాలు, ఒక పూట భోజనం, ఒక ఎగ్ మాత్రమే ఇస్తుంటే, బూరుగుపూడి గ్రామంలో మాత్రం ఖార్జుర, పండ్లు, ఎగ్స్, పాలు, పళ్ళ రసాలు, ఇంకా డాక్టర్లు సూచించిన ఫుడ్ గర్భిని మహిళలకు అందిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ సహకారంతో కాకుండా సూర్యచంద్ర గారు ఇంకా గ్రామస్థుల ఆర్ధిక సహాయంతో జరుగుతున్నది.
ఇలా కేవలం మూడు, నాలుగు విభాగాలలో మాత్రమే కాదు "ఆర్గానిక్ ఫార్మింగ్, మధ్యనిషేదం, శ్రమదానం, సిమెంట్ రోడ్డు నిర్మాణం, పిల్లలకు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పడం, చెత్త నుండి డబ్బు సంపాదించి తిరిగి ఆ డబ్బును గ్రామ అభివృద్ధికే ఉపయోగించడం" ఇలా అన్ని రకాలుగా సర్పంచ్ ఆ గ్రామ ఇంటికి పెద్ద కొడుకులా ఊరిని బాగుచేశారు. సూర్యచంద్ర గారు(9959978899) 2006 నుండి వరుసగా సర్పంచ్ గా ఎన్నికవుతూ ప్రభుత్వం నుండి రికార్డ్ స్థాయిలో నాలుగు సార్లు ఉత్తమ సర్పంచ్ గా కూడా అవార్డ్ తీసుకున్నారు.