These Brutal Honest Lines About IT Employees Will Hit Every Struggling Youngster

Updated on
These Brutal Honest Lines About IT Employees Will Hit Every Struggling Youngster

Contributed By Nag Writes

ఎక్కడ నీ చిరునామా ఓ ఐటీ కుర్రోడా | ఇంకెందాక నీ పయనం ఓ హైటెక్ కుర్రోడా

అత్తరు పూసుకుని సక్కగ ముస్తాబయినావు | బిత్తరు సూపులతో ఆయాసపడతావు | సత్తా చాటుకుంటూ సాగరాలు దాటుతావు | పత్తా లేకుండా ఉరుకుతావు ఊగుతావు

హడావుడిగ సందుల గొందుల్లో రయ్యిమంటూ దూసుకెళ్లు బుల్లెట్ కుర్రోడా | ఆడాఈడా కస్సుబుస్సు మనుకుంటు కయ్యాలు పెట్టుకుంటూ బుసలుకొట్టు కుర్రోడా | వడివడిగా తడబడతు కయ్యికయ్యిమనుకుంటు కోపాల కుర్రోడా | కుడిఎడమల తికమకతో నీతీ నియమాలు లేని కక్కుర్తి హైటెక్ సన్నాసి

రోడ్డెక్కితె రోదన అంతులేని వేదన | బండెనక బండి కట్టి బారులుతీరి | నడిరోడ్డున దిక్కులేని నరకయాతన | గడిపేవు గంటలు గంటలు వృథా వృథా

కూర్చుంటే లేవలేవు తీరిగ్గా తినలేవు | చర్చలు ఎన్నెన్నో తిన్నదేమో అరగదు అరిగింది అలిగి బుంగమూతి పెడుతుంది | కూర్చునే మరి సల్లని గదిలో కష్టపడుతు ఆరోగ్యం అటకెక్కితె | ఖర్చులుపెట్టి మరీ బరువులెత్తి వంగివంగి గెంతులేసేవు

అంతులేని ఆవేదన దాచుకుని లోలోన మరి నవ్వేవు పైపైన | క్షణమానందం క్షణమావేశం | క్షణికావేశపు నిర్ణయాలు క్షణక్షణ ఘర్షణలు | అలుపెరుగని అంతర్మథనం గమ్యమెరుగని పయనం | తీరానికి చేరేదెపుడో నీకైనా తెలుసా ఓ ఐటీ కుర్రోడా

చిన్ననాటి స్నేహాలు గుర్తొస్తే కన్నీళ్లు తుడుచుకుంటావు | ఆనాటి అనుబందాలు అలనాటి ఆప్యాయతలు తలచుకుని కుమిలేవు | అమ్మానాన్నల అక్కచెల్లెళ్ల ప్రేమ దూరమయ్యి రోదించేవు | మట్టివాసన మరిచావు పచ్చని ప్రకృతికి దూరమయ్యి సొంతూరుని మరిచావు ఓ ఐటీ కుర్రోడా

ఎక్కడ నీ చిరునామా ఓ ఐటీ కుర్రోడా... ఇంకెందాక నీ పయనం ఓ హైటెక్ కుర్రోడా..