జైలు జీవితం అంటే అది బంధించి, బాధింపబడే ప్రదేశంలా ఉండకూడదు ఖైదీలలో మానసిక పరివర్తనను చేకూర్చే ఆధ్యాత్మిక కేంద్రంలా ఉండాలి. కిరణ్ బేడీ గారి దగ్గరి నుండి ఇలా ఎందరో జైళ్ల శాఖ అధికారులు తమ శక్తిమేరకు ఖైదీల ఆలోచన సరళిలో మార్పులు తీసుకువస్తున్నారు. ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవడం, జైళ్లలో లైబ్రెరీలను ఏర్పాటుచేయడం, యోగా, మెడిటేషన్ లాంటి ఏర్పాట్లు ఖైదీల మార్పునకు కృషిచేస్తున్నాయి..
ఐదు వందలమంది ఖైదీల సామర్ధ్యం ఉన్న చంచల్ గూడా జైలుకు 140 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు రాష్టాలలోనే అతిపెద్ద కారాగారాలలో ఇది ఒకటి. అందుకే జైళ్లలో మార్పులకొరకు మొదట చంచల్ గూడాను ఎంచుకుంటుంటారు. జైలులోనే బతకడానికి పని నేర్పిస్తే రేపు విడుదల అయ్యాక ఆ పనితనంతో వారి కాళ్ళమీద వారు బ్రతికేలా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ లక్ష్యంలో భాగంగానే My Nation Food Court పేరుతో జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ గారు దీనిని ప్రారంభించారు.
ఈ ఫుడ్ కోర్ట్ లో ప్రస్తుతం 12 మంది ఖైదీలు పనిచేస్తున్నారు. వీరికి వంట విషయంలో సహాయం అందించడానికి, నేర్పించడానికి ఇద్దరు చెఫ్స్ ఉంటారు. కస్టమర్స్ ఎవ్వరూ కూడా జాలితో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు.. బయట ఉన్న ధరల కన్నా ఇక్కడ చాలా తక్కువ. ఉదయం ఆరు గంటల నుండి టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ తో రాత్రి 8 గంటల వరకు కూడా క్వాలిటీ ఫుడ్ మనకు లభిస్తుంది.
ఈ ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తున్న ఖైదీలందరూ కూడా జీవితకాల శిక్ష పడినవారే. 14 నుండి 20 సంవత్సరాల శిక్ష పడిన ఖైదీలు మిగిలిన వారి కన్నా ఎక్కువ జీవితం జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఇలా ఫుడ్ కోర్ట్ లో పనిచేయడం వల్ల వారికి కూడా కాస్త స్వేచ్ఛ లభిస్తుంది.. మారడానికి, కొత్త పనినేర్చుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది. ఫుడ్ రుచికరంగా ఉందంటే ఎక్కడో దూరంలో ఉన్నా కాని జర్నీ చేసి మరి టేస్ట్ చేస్తుంటాం, ఎన్నో ట్రై చేశాం ఇక్కడి ఫుడ్ ను కూడా ట్రై చేస్తే పోలా..