జవహర్ లాల్ నెహ్రు, దేశ స్వాతంత్రోద్యమంలో ముందు వరుసలో ఉండి అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అతడు, స్వాతంత్రానంతరం దేశనిర్మాణంలో కీలక భాద్యతలను భుజస్కందాల పై వేస్కొని అహర్నిశలు పాటుపడిన మహనీయుడు అతను. నవ భారత నిర్మాణంలో అతని సేవలు చిరస్మరణీయం. ఈనాడు భారతదేశం ప్రపంచ యవనికపై ఒక సుస్థిర స్థానం సంపాదించుకుంది అంటే అది ఆయన వేసిన పునాదుల వల్లే. అన్ని రంగాలలో దేశం దూసుకుపోతోందంటే అది ఆయన మార్గనిర్దేశనం వల్లే. నవ భారత నిర్మాతగా నేటికీ నెహ్రు గారు ఎందుకు కీర్తింపబడుతున్నారో తెలుసుకోవాలంటే ఆయన చేపట్టిన చర్యలు, రూపొందించిన విధి విధానాలు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
1.పంచవర్ష ప్రణాళికల రూపకల్పన - దేశ ప్రగతికి కావాల్సింది ప్రణాళికబద్దమైన అభివృద్ధి. స్వల్ప,దీర్ఘ కాల ప్రణాళికలను రూపొందించి, లక్ష్యాలను నిర్దేశించుకొని ఒక పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళితేనే ప్రయోజనాలు చేకూరుతాయని పంచ వర్ష ప్రణాలికలను రూపొందించారు నెహ్రు. పంచ వర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయం, సాగునీటి పథకాలు,నీటి పారుదల ప్రాజెక్టులు, బహుళార్ధ సాధక ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పాదక సంస్థలెన్నో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
2.సమాన ఓటు హక్కు - అమెరికా, ఐరోపా దేశాలలో కూడా అందరికి సమాన ఓటు హక్కు సాదించడానికి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తే కాని లబించలేదు,అటువంటిది భారతదేశానికి మాత్రం ఎటువంటి కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ, భాషా, లింగ, ఆర్ధిక,సామజిక,రాజకీయ అసమానతలు లేకుండా 21 ఏళ్ళు పైబడిన వారందరికి వోటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనే మాటకి సార్ధకత చేకూర్చారు.
3.ఆధునిక దేవాలయాలు – ప్రజల అవసరాలు, కష్టాలు తీర్చి, వారిని స్వావలంబన దిశగా అడుగులు వేయించే ప్రభుత్వ రంగ సంస్థలు, బహులార్ధసాదక ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు, స్టీల్ ప్లాంట్లు, ఐఐటిలు వంటి వాటికి రూపకల్పన చేసి వాటిని దేశం నలుమూలలా స్థాపించారు.
4. అలీనోద్యమం (Non – Alignment Movement) - భారత దేశం స్వతంత్రం సాదించేనాటికి ప్రపంచ దేశాలు రెండు కూటములుగా విడిపోయి ఉన్నాయి. ఒకటి అమెరికా నాయకత్వంలో,మరొకటి సోవియెట్ రష్యా నాయకత్వంలో, చిన్న దేశాలు,అప్పుడే స్వతంత్రం పొందిన దేశాలు ఎదో ఒక కూటమిలో చేరక తప్పని పరిస్థితి. అటువంటి సమయంలో భారత్ రెండు కూటములకి దూరంగా ఉంటూ అలీనోద్యమం మొదలెట్టారు నెహ్రు. ఒక నూతనంగా ఆవిర్భవించిన దేశం ఇంతటి పెద్ద నిర్ణయం తెసుకోవడం అదీ రెండు ప్రపంచ శక్తులని ఎదురించి మిగతా దేశాలకు నాయకత్వం వహించడం పెను సాహసం.
5. సామ్రాజ్యవాదానికి వ్యకిరేకత - 200 వందల సంవత్సరాల పాటు సామ్రాజ్య వాద కబంద హస్తాలలో చిక్కుకొని ఉన్న భారత దేశానికి సామ్రాజవాదం వల్ల కలిగే నష్టాలు భాదలు ఏమిటో తెలుసు, అందుకే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత్ గొంతుకని బలంగా వినిపించారు నెహ్రు. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల పట్ల జరుగుతున్న వివక్షని వివిధ సదస్సులలో నిర్ద్వందంగా వ్యతిరేకించారు, ప్రపంచ దేశాలు సైతం భారత్ తో గొంతు కలిపాయి.
6. పంచశీల ఒప్పందం, చైనాతో సంబందాలు - భారత్ తో పోలిస్తే అప్పటికి చైనా అన్ని విధాలుగా శక్తివంతమైన దేశం,అటువంటి చైనా తో భవిష్యత్ లో కూడా ఎటువంటి తగాదాలు రాకుండా ఉండేందుకు పంచశీల ఒప్పందం చేయించారు, హిందీ-చీనీ భాయి భాయి అనే నినాదం ఇచ్చారు. ( చైనా తో ప్రస్తుతం ఉన్న దోక్లం సమస్య లో చైనా కాస్త వెనక్కి తగ్గడానికి ఆనాడు చైనా చేసిన పంచశీల ఒపందం కూడా ఓ కారణమే )
7.శాంతి దూత – అహింసా పోరాటంతోనే భారత్ స్వాతంత్రాన్ని సాదించింది, అటువంటి భారత దేశానికి ప్రధాని అయిన నెహ్రు కూడా శాంతి, అహింసా మార్గాన్నే అవలంబించారు. ప్రపంచ శాంతి కేవలం అహింస వల్లనే సాద్యం అని ఐక్య రాజ్య సమితిలో భారతదేశ విదానాన్ని స్పష్టం చేసారు. అహింస మార్గాన్నే అవలంబిస్తున్నా, దేశ రక్షణ విషయంలో ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు. అణ్వాయుధాలు సైతం కలిగి ఉండగల రక్షణ వ్యవస్థని రూపొందించారు నెహ్రు.
8. విదేశి విధానం - నెహ్రు కేవలం దేశ ప్రధానిగా భారత్ కే పరిమితం కాలేదు, విదేశి వ్యవహారాల మంత్రిగా ప్రపంచ దేశాలతో సత్సంబందాలు నెలకొల్పేందుకు ఎంతగానో కృషి చేసారు, ఆ కృషి ఫలితమే ఆనాటి అమెరికా అద్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మొదలు ఫిడేల్ కాస్ట్రో వరకు వివిధ దేశాదినేతలు భారత్ ని సందర్శించి భారతదేశానికి స్నేహహస్తం అందించారు. నాడు నెహ్రు అవలంబించిన విదేశీవిధానమే నేటికీ ఆచరింపబడుతుంది.
నెహ్రు కేవలం ఒక పార్టి నాయకుడో, ఉద్యమ నాయకుడో, దేశ ప్రధానో మాత్రమే కాదు,ప్రపంచ మేధావులలో ఒకరు. తన రచనలతో కోట్లాది మందిని ప్రభావితం చేసిన వ్యక్తి, దశాబ్దాల తరువాత రాబోయే పరిస్థితులను అంచనా వేసి వాటికి ముందే పరిష్కారాలను రూపొందించగలిగిన దార్శనికుడు. దేశ స్వావలంబన కోసం, బలమైన శక్తిగా ప్రపంచ పటంలో భారత్ ని నిలిపేందుకు నెహ్రు అహర్నిశలు పాటు పడ్డారు. ఆ మహనీయుడి పుట్టిన రోజున ఆయన చేసిన సేవలకి కృతజ్ఞతలు చెప్పుకుందాం.