ప్రకృతి వాస్తవం తెలియజేస్తున్న సమయం!! అప్పటికి జయశ్రీ ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టి 18 నెలలు కావస్తోంది.. బొమ్మలతో పాటు జయశ్రీ తో ఆడుకోవడానికి చుట్టూ పక్కలింటి పిల్లలు వచ్చేశారు. అమ్మ నాన్న ఇంట్లోనే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండిపోయారు. దుందుడుకు స్వభావం గల ఒక పిల్లోడు హీరోలా పోజ్ ఇస్తూ బొమ్మ తుపాకీతో గాల్లోకి కాల్చాడు. భయంకరమైన శబ్ధం!! ఆ వెంటనే దారి పట్టుకుని పిల్లల ఏడుపులు. ఎదో పెద్ద విషాదమే చూడబోతున్నామని తల్లిదండ్రులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. పిల్లలందరూ గుక్క పెట్టి ఏడుస్తున్నారు thank god!! అందరికి ఏ గాయాలు అవ్వలేదు. జయశ్రీ మాత్రం ఏడవకుండా బొమ్మలతో మామూలుగానే ఆడుకుంటుంది. అసహజ పరిస్థితులలో సహజంగా ఉందేంటని కాస్త జాగ్రత్తగా పరిశీలించి డాక్టర్లకు చూపిస్తే అప్పుడు పూర్తి వాస్తవం తెలిసింది. జయశ్రీ వినలేదు మాట్లాడలేదని.

పెదాలు, కొండనాలుక చీలి గ్రహణమొర్రితో ఒక ప్రాణానికి జన్మనిచ్చినందుకు కృష్ణ రాధిక గార్లు బాధపడేవారు. పాపకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం రష్యా నుండి ఇండియాకు తిరిగి వచ్చారు. బెటర్ ట్రీట్మెంట్ కోసం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టుగా హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. స్పీచ్ థెరపీ, రకరకాల ట్రీట్మెంట్ కానీ ప్రయోజనం లేదు వాస్తవం మాత్రం తెలిసింది ఇక ఎప్పటికి జయశ్రీ మాట్లాడలేదు అని.

విజయాన్ని లోపం అడ్డుకుంటుందా.!! లేనివి, ఇక రాని వాటి గురుంచి జయశ్రీ, ఇంకా తన పేరెంట్స్ ఆలోచించలేదు. జయశ్రీ ప్రస్తుతం అంతర్జాతీయ షట్లర్. 2015 నుండి టోర్నమెంట్స్ ఆడడం మొదలుపెట్టి "నేషనల్ గేమ్స్, టర్కీ లో జరిగిన ఇంటర్నేషనల్ డెఫ్ ఒలింపిక్స్, ఆసియా డెఫ్ చాంపియన్ షిప్" మొదలైన టోర్నీలలో ఇప్పటికి ఎన్నో పతకాలు గెలుచుకుంది. ఈ గెలుపు ఒక పేరా నుండి మరో పేరాకు వచ్చినంత సులభంగా జరగలేదు. అదొక ఆశ నిరాశల మధ్య ప్రయాణం, ఆకాశంలో మిణుకు మిణుకు మనే వెలుగును చూస్తూ గెలుపు కోసం కటిక చీకటిలో సాగిన ప్రయాణం.

పిటీ మాస్టర్ గారి సజేషన్.. జయశ్రీ ఎడ్యుకేషన్ కోసం సొంతూరు ఆంధ్రప్రదేశ్ చీరాలకు వచ్చేశారు. శారీరక లోపం ఉన్న పిల్లల కోసం రన్ చేస్తున్న స్కూల్ లో జయశ్రీ ని చేర్పించారు. అమ్మ నాన్నలు ప్రత్యేకంగా జయశ్రీకి అర్ధమయ్యే విధంగా చదువులో హెల్ప్ చేసేవారు. ఆ తర్వాత పదవతరగతి కోసం వెదురుపల్లిలో ఇలాంటి మరో స్కూల్ లో చేర్పించారు. ఇలా చదువుకుంటూనే నాన్న కృష్ణతో, అక్కతో జయశ్రీ బ్యాడ్మింటన్ బాగా ఆడేది. కోచింగ్ ఇప్పిస్తే ఇంకా బాగుంటుందని పిటీ మాస్టర్ గారిని అడిగారు. తప్పకుండా అని మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. కొంతకాలానికి పిటీ మాస్టర్ కృష్ణ గారిని పిలిపించుకుని జయశ్రీ మిగిలిన వారందరి కన్నా బ్యాడ్మింటన్ బాగా ఆడుతుంది, మంచి అకాడెమీలో కోచింగ్ ఇప్పిస్తే కనుక దేశానికి ఎన్నో పతకాలు తీసుకువస్తుంది, అంత క్యాలిబర్ ఉంది తనలో.. అని చెప్పారు.

తణుకు గోపిచంద్ అకాడెమీలో చేరిన తర్వాత జయశ్రీలో అనుమానాలన్ని తొలగిపోయాయి తన పుట్టుకకు అర్ధం తెలిసింది. (ప్రస్తుతం నెల్లూరు సుబ్బారెడ్డి అకాడెమీలో సుధాకర్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటుంది) మొదట్లో కోచ్ కు తనకు కమ్యూనికేషన్ విషయంలో సమస్యలు ఎదురయ్యేవి ఐతే వీటిని త్వరగానే అధిగమించారు. గంటల తరబడి కోచింగ్ తీసుకుని కోర్ట్ పక్కన కూర్చుని ఉన్న మిగిలిన వారి ఆటతీరును నిశితంగా తను పరిశీలించేది. ఒక పక్క జయశ్రీ ఒక్కో సమస్యను ఎదుర్కొని, ఒక్కో టెక్నిక్ ను అవపోసన పట్టి బ్యాడ్మింటన్ లో రాణిస్తూ ఉంటే మరో పక్క అమ్మ నాన్నలు టోర్నీకి అవసరం అయ్యే అన్ని అవసరాల బాధ్యతలను చూసుకుంటున్నారు.

20 ఏళ్ల జయశ్రీ డిస్టన్స్ లో డిగ్రీ చదువుతుంది. ప్రస్తుతం తన లక్ష్యమంతా 2021 ఒలింపిక్స్ పైనే. గొప్పలు చెప్పుకుని బ్రతికే నేటి సమాజంలో చేతలకు పరిమితమైన జయశ్రీ అందరికీ ఆదర్శం. శారీరక లోపం తన బిడ్డ జీవితాన్ని ఛిద్రం చేస్తుందని భయపడిన తల్లిదండ్రులు ప్రస్తుతం జయశ్రీ ఎదుగుదలకు గర్వపడుతున్నాను. జయశ్రీ ఇంటికి వెళితే తను మాట్లాడలేదు, తన అవార్డ్స్ మెడల్స్ మాట్లాడుతాయి. అమ్మ నాన్నల వంక బంధువులు, ఇరుగుపొరుగు వారు జాలితో చూడరు గర్వంగా చూస్తారు.
