(Contributed by Sri Venkatesh Grandhi)
-మొదటి నెల-
ఒక వీర్యపు చుక్కను నేను
పరిచయం లేని నన్ను
నీ పేగుకు పెనవేసుకున్నావ్
అప్పటికి నాకు ఒక రూపం సంతరించలేదు
నీకు కూడా నేనోస్తున్నట్టు తెలీదు..
-రెండో నెల-
నీ గర్భకోశానికి
నేనొక పిండంగా పరిచయమయ్యాను
నీ ఉత్పత్తి స్థానంలోకి మెల్లమెల్లగా అమరాను
ఇప్పటికీ, నువ్వు నేను అపరిచితులమే సుమీ..
-మూడోనెల-
నాకు ఆహ్వానమొచ్చింది
పెరుగుదలనిచ్చే పోషకాల విందుకు రమ్మని హమ్మయ్యా,
ఇక నేను మనిషినైపోతున్నాను అనే
విశ్వాసంతో ఆనందంతో
పేగుల పూదోటలో
రక్తకణాల మిత్రులతో ఆడుకున్నాను..
-నాలుగోనెల-
గర్భసంచికి నాకు చెడింది
సరుకు ఇవ్వను పో అని నాతో వారించింది
నాకు కోపమొచ్చింది
వెంటనే నా బొడ్డు గిలకతో
నీ శరీరానికి ముడి వేసాను
నువ్వూ నాకు సహకరిస్తూ
నాకే ఆహరం మంచిదో తెలుసుకుని
అది చేదైనా కూడ చక్కరలా పుచ్చుకున్నావ్..
-ఐదోనెల-
నా అవయవాలన్ని వృద్ధి చెందుతున్నాయ్
కళ్ళైతే ఇంకా మూసుకునే ఉన్నా కాని
నన్ను నేను తడుముకోగలుగుతున్నాను
నీ అరచేతిలో సగమంత పాదాలతో
నీ కడుపుపై తన్నుతూ
నీ శరీరాన్ని స్పృశించగలుగుతున్నాను..
-ఆరోనెల-
నా శ్వాసకోశము తప్ప
సర్వం సంసిద్ధమయ్యింది
నా కంటికి కూడ ప్రాణమొచ్చేసింది,
అమ్మ కడుపు అనే అద్భుతాన్ని అవి చూడగలుగుతున్నాయ్,
నేనైతే నా బుల్లి బుల్లి వేళ్ళను
నోటితో చనుగుడుచూ
నన్ను నేను ఆశ్వాదిస్తున్నాను..
-ఏడోనెల-
నేను ఇంకా భ్రూణం అయిన కారణం వలననేమో
ఎక్కువ నిద్రపోతూనే ఉన్నాను,
కలలెన్నో వస్తున్నాయ్
రాబోవు రెండు నెలలు ఎన్ని రోజులలో గడుస్తాయో
తెలియక నా చిన్ని మెదడు తెగ చిరాకు పడుతుంది..
-ఎనిమిదోనెల-
తెల్లని మైదానం లాంటి నా తలపై
నల్లని రోమాలు కొత్తగా మొలకెత్తాయ్
నా చేతితో వాటికి కరచాలనం చేసాను
అబ్బ ఎంత మెత్తని కురులు
నా చర్మానికన్నా మృధువుగా!!
మరో భారమైన నెల
నీ ఒడికి నా మేనుకి మధ్య
దోబూచులాడుతుంది అమ్మా..
-తొమ్మిదోనెల-
నిన్ను చూసేందుకు నేను అనుభవించిన
నాకు జన్మనిచ్చేందుకు నువ్వు మోసినా
ఈ తొమ్మిదినెలల గర్భవాసం
ఇక ఈ నెలతో ముగియనుందని అనుకుంటుంటేనే
"అమ్మ ఒడి" అనే చోటును తలుచుకుంటుంటేనే
ఏదో ఉత్సాహం,
మాటలు రాని సంతోషం..
ఎప్పుడెప్పుడు నీ పిలుపుల అరుపులు వింటానో
ఎప్పుడెప్పుడు నీ అరుపుల అలికిడికి
నా కంఠం అడ్డేసిన కట్టెలను తెంచుకుని
ఏడుపు రాగం ఆలపిస్తుందో అనుకుంటూ
మగతలోకెళ్ళిన నాకు కళ్ళు తెరచి చూడగానే
నీ చల్లని చేతుల దేవాలయంలో
అప్పటివరకు ఎముకలిరిగి పోతున్న భాధను
బయటకు వదిలిని పెదాలు
కొంచెం చిరునవ్వును విదిలిస్తూ
నన్ను చూసిన నీ కళ్ళు ఆనందభాష్పాలను రాలుస్తుంటే
అందులోనుంచి ఒక చుక్క నా నుదుటి నరమును తాకిన క్షణములో
నాకర్ధమయ్యింది నేను జన్మెత్తాను అని
అదీ ఒక దేవత పుణ్యఫలమని.....
తొమ్మిది నెలల నీ కష్టాన్ని నూరేళ్ళు మర్చిపోనమ్మా.....