2012 డిసెంబర్ నెల – సురాజ్య ఉద్యమ దీక్ష – ధర్నా చౌక్ ప్రాంగణం.
స్వరాజ్యం సాదించుకున్నా అది స్వాహారాజ్యంగా మారిపోయిందనే భాదతో ,స్వపరిపాలన వచ్చినా అది సుపరిపాలనగా ప్రజలకి అందకుండా ఉన్నదనే ఆవేదనతో మూడు రోజుల ఉపవాస దీక్షకి ఉపక్రమించారు . పౌర సమాజంలోని పెద్దలు,మేధావి వర్గం,దేశం పట్ల భాద్యత కలిగిన యువత,రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థులు ఎందరో స్వచ్చందంగా ఆ మూడు రోజుల ఆ దీక్షలో పాల్గొన్నారు .దాదాపుగా ఇవన్నీ రాజకీయంలో మాములుగా జరిగేవే,కాని సిద్దాంత పరమైన విభేదాలున్న రాజకీయ పార్టీలలోని నాయకులు కూడా స్వచ్చందంగా ముందుకొచ్చి ఆ వ్యక్తి చేస్తున్న ఉద్యమానికి నైతిక మద్దతు తెలిపి మేము సైతం సురాజ్యం కోసం పాటుపడతాం అంటూ జెండాలన్నీ పక్కపెట్టి చేయి కలిపారు అధికార పక్షం,ప్రతిపక్షం అనే తేడా లేకుండా. ఒక సమున్నతమైన లక్ష్యంతో ముందుకెళుతున్న ఆ వ్యక్తి ఒంటరి వాడు కాదని రుజువు చేసారు.
2014 జనవరి – ఆంధ్రప్రదేశ్ శాసన సభ – ఆంద్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పై చర్చ జరుగుతున్న సందర్భం.
తెలంగాణా,సీమంధ్ర ప్రాంతాలు భావోద్వేగాలతో ఆట్టుడుకుతున్న సమయమది,పార్లమెంట్ లో కూడా సవ్యంగా చర్చ జరపలేని స్థితి,ఉద్రేకాలు ఆవేశాలతోనే సభా సమయం గడిచిపోతుంది,అలాంటి వాతావరణంలో ఒక్కడు,ఒకే ఒక్కడు ఏక ధాటిగా గంటన్నరకి పైగా సుదీర్గమైన ఉపన్యాసం ఇస్తూ వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ,తగు సూచనలిస్తుంటే సభ్యులందరూ శ్రద్దగా ఆలకిస్తూ ఉండిపోయారు,ఆ సూచనలను కేంద్ర ప్రభుత్వం సైతం విభజన చట్టంలో పొందుపరిచింది.ఎలాంటి సంక్లిష్ట పరిస్తితులలో అయినా ప్రజలకి నష్టం జరగకుండా చిత్తశుద్ది తో పోరాడే తత్వమే మిగతా రాజకీయ నాయకుల నుండి ఆయన్ని వేరు చేసింది .
పైన పేర్కొన్న రెండు ఉదాహరణలు చాలు ఆ వ్యక్తి Caliber,Character ఏమిటో తెలుసుకోడానికి.
నాగ భైరవ జయప్రకాశ్ నారాయణ్ , దేశంలోనే అతి క్లిష్టమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో జాతీయ స్థాయిలో నాలుగవ ర్యాంకు సాదించి,పరిపాలనాదికారిగా విశేష సేవలందించి,మరికొన్నాళ్ళు అదే సర్వీసులో ఉండి ఉంటే అత్యున్నతమైన పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ,వ్యవస్థలో పేరుకుపోయిన కుల్లుని శుభ్రం చేసేందుకు తన పదవికి రాజీనామా చేసి ,లోక్ సత్తా అనే ఒక ఉద్యమ సంస్థని స్థాపించి పౌర సమాజాన్ని జాగృతం చేసి, మేధావులందరితో కలిసి ఒక Think Tankగా ఏర్పర్చి వ్యవస్థలో భాగమై పోయిన ఎన్నో లోటుపాట్లను సవరించారు మరెన్నో సంస్కరణలను తీసుకొచ్చారు . రాజకీయ పార్టీగా రూపాంతరం చెందక ముందే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఉద్యమ సంస్థ గా లోక్ సత్తాకి ఘనమైన చరిత్ర ఉన్నది . (ఈ సుధీర్గ ప్రయాణంలో జేపీ గారు సాదించిన విజయాలు)
అవకాశవాద రాజకీయాలు చేస్తూ సమాజాన్ని విచ్చిన్నం చేసే కుల తత్వ రాజకీయ నాయకులు,నేరస్తులు శాసన వ్యవస్థలో భాగమై దోపిడీని చట్టబద్దం చేస్తూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న సందర్భంలో ఉద్యమ సంస్థని రాజకీయ పార్టీగా మార్చి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు వేసారు,రాజకీయాలంటే ఒక ప్రహసనంగా మారిన కాలంలో కూడా విలువలతో కూడిన రాజకీయం చేసిన వారిలో జేపీ గారు ముందు వరుసలో ఉంటారు .
సాంప్రదాయ రాజకీయాలకి భిన్నంగా ఒక శాసన సభ్యుడు తలుచుంటే ఏ స్థాయిలో అభివృద్ధి చేయగలరో నిరూపించారు,ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతటి కృషి చేయొచ్చో చేసి చూపించారు .ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకుడంటే అవతలి వారిని విమర్శించడం,సమస్యల్ని ఎత్తి చూపడం,లేదా సమస్యలు సృష్టించడం,అధికారం కోసం అనవసర హామీలు ఇవ్వడం,అర చేతిలో వైకుంఠo చూపడం.కాని జెపి గారు సమస్య మూలాల్ని కనుగొని Rational, Logical, Comprehensive approach తో సామరస్య పూరితమైన పరిష్కారాలను చూపుతూ సమూలంగా,శాశ్వతంగా ఆ సమస్యని దూరం చేసేందుకు కృషి చేసారు. అందుకే అధికారంలో ఉన్నా,లేకున్నా,పదవులు ఉన్నా లేకపోయినా ఆయనెప్పుడూ ప్రజాపక్షమే వహించారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరున్నా ఆయనిచ్చే సలహాలు సూచనలు స్వీకరించేవారు.
అధికారమే లక్ష్యంగా పదవులే పరమావధిగా సాగే నేటి రాజకీయానికి జెపి గారు తగిన వారు కాకపోవోచ్చు, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సంఖ్యా బలంతో ఎదగకపోవోచ్చు. రాజకీయం అంటే వ్యాపారం,యువ రాజకీయ నాయకులంటే వారసులే అనే అభిప్రాయం ఉన్న నేటి సమాజంలో, రాజకీయాల పట్ల ,రాజకీయ నాయకుల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయి రాజకీయాలనే అసహ్యించుకునే దశలో ఉన్నప్పుడు కూడా నీతి నిజాయితీ తో అవినీతికి ఏ మాత్రం తావివ్వకుండా విలువలతో కూడిన రాజకీయం చేస్తూ జెపి గారు ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.ఆయన ప్రభావం కూడా ఎంతో మంది యువత పై బలంగా ఉంది . మార్పుని మరోతరానికి వాయిదా వేయకండి అని ఆయన చెప్పిన మాటలు ఎంతో మందికి స్ఫూర్తి మంత్రం ,రాజకీయం అంటే అదో పవిత్రమైన భాద్యత అని భావించి రాజకీయాలలోకి వస్తున్న యువతకి ఆయనే ఆదర్శం.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా,పదవుల కోసమో వోట్ల కోసమో కాకుండా,దేశ అభ్యున్నతి సమాజ శ్రేయస్సు కోసం ఆరు పదుల వయసులో కూడా రోజుకి 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేస్తూ,వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ, సెమినార్లతో,విద్యార్థులతో ముఖాముఖితో,బహిరంగ సభలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చేసే తప్పులని ఎత్తి చూపుతూ సమాజాన్ని చైతన్య పరుస్తూ,యువతని జాగృతం చేస్తూ ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యం.
అవగాహన,ఆలోచన,ఆవేదన ఈ మూడింటి కలయికే జేపి గారు. ఆయన లక్ష్యం పదవులు కాదు,ఆయన కోరిక ఆదికారం కాదు,సురాజ్యం కోసం,సుపరిపాలన కోసం,సమాజంలో మార్పు కోసం,వ్యవస్థలో మార్పు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం,కుల మత ప్రాంత వర్ణ వర్గ లింగ భేదాలు లేని సమాజం కోసం.ఆయన ఒక్కరి వల్లనే సమూల మార్పు రాకపోవోచ్చు,కాని రాబోయే ఆ మార్పుకి ఆయన చేసిన కృషే పునాది .
ఎంతో మంది విద్యార్దులకి ఆయన స్ఫూర్తి ,ఎంతో మందికి యువతకి ఆయన మార్గదర్శి.
చిరు దివ్వెలా మొదలై నేడు ఓ చైతన్య కాగడాలా ప్రకాశిస్తున్న జయ ప్రకాష్ నారాయణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Happy Birth Day To Leader Jai Prakash Narayana Garu