ఇంట్లో ఓ మల్లెచెట్టు ఉంటే అది చుట్టూ సువాసనలను వెదజల్లుతుంది.. ఇంట్లో ఓ రెండు రకాల పూల మొక్కలు ఉంటే ఆ ఇల్లు ఎంతో అందంగా కనిపిస్తుంది.. ఒక్కసారి ఊహించండి అదే ఒక ఊరు ఊరంతా వేల రకాల పూలు, పండ్ల చెట్లతో నిండిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! ఆ ఊహ నిజంగా నిజం. కడియం మరియు వారి చుట్టు ప్రక్కల గ్రామాలలో పూలు, పండ్ల మొక్కలతో నిండి ఉంది. పది కాదు 20 కాదు ఏకంగా ఇక్కడ దాదాపు 1100కు పైగా రిజిస్టర్డ్ (ఇంకా రిజిస్టర్ కాని నర్సరీలు 2,000) నర్సరీలున్నాయి. మన తెలుగు రాష్ట్రలలోనే కాదు, భారతదేశంలోనే అత్యధికంగా మొక్కలను ఎగుమతి చేస్తున్న ప్రాంతం మన కడియం. రాజమండ్రి నుండి సుమారు 12కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం.
ఇక్కడే నర్సరీలు ఇంత అత్యధికంగా ఉండడానికి గల బలమైన కారణం ఇక్కడి ప్రకృతి. మొక్కలు పెంచడానికి అవసరమయ్యే నల్లరేగడి భూమితో పాటు, వాటికి నీటిని అందించడానికి గోదావరి, చిన్న మొక్కలు ఎండకు మాడిపోకుండా ఉండడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ వాతావరణం చల్లగా ఉండడం.. ఇవన్నీ కూడా ఇన్ని నర్సరీలు ఉండడానికి గల కారణాలు. ఇందువల్లనే ఇక్కడ సుమారు 15,000 ఎకరాలకు పైగా ఈ నర్సరీలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ఆనందాన్ని ఎంతో మంది జీవితాలలో పూయిస్తుంది. కడియం దాని చుట్టు ప్రక్కల గ్రామాలలోని సుమారు 40,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నర్సరీల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు.
మొదట్లో ఇక్కడ కొన్ని రకాల మొక్కలను మాత్రమే పెంచేవారు, కాని కాంపిటీషన్ పెరిగిపోతుండడం, రకరకాల మొక్కలు కావాల్సిన వారు పెరగడంతో వారు కూడా అన్ని రకాల మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇక్కడ లేని మొక్క అంటూ లేదు అని చెప్పుకోవచ్చు. భారతదేశంలోని అన్ని రకాల మొక్కలతో పాటు విదేశాలలో ఉండే కొన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి. పూలు, పండ్లు, ఇంట్లో పెంచుకునే వేల రకాల మొక్కలిక్కడ ఉన్నాయి. ఇక ఇక్కడి మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి అని చెప్పి పవన్ కళ్యాన్ గారు, సి.ఏం కే.సి.ఆర్ గారి దగ్గరి నుండి మొదలుకుని దేశంలోని వి.ఐ.పిలతో పాటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇక్కడికి వస్తుంటారు.
కేవలం అడుగు మాత్రమే పెరిగే మొక్క దగ్గరి నుండి పెద్ద ఎత్తులో పెరిగే మొక్కల వరకు, వారం రోజులు నీరు లేకున్నా బ్రతికే మొక్కలు, నీటిలో మాత్రమే పెరిగే మొక్కలు, మన ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు ఇలా అన్ని రకాల మొక్కలు ఇక్కడున్నాయి. ప్రభుత్వం వారు భారీ ఎత్తున చేసే మొక్కల నాటే కార్యక్రమానికి మన కడియం నుండే లక్షల సంఖ్యలో మొక్కలు వెళతాయి. ఇదేమి ఏ కార్పోరేట్ వ్యాపారస్థులు చేస్తున్న బిజినెస్ కాదండి మన తెలుగువారు గ్రామాలలో పుట్టి పెరిగిన వారు ఇష్టంగా చేస్తున్న వ్యాపారం.