నిన్నటితరం సహాయ నటులైన గుమ్మడి, ఎస్.వి రంగారావు, తర్వాత అంతటి స్థాయిలో నటనను ప్రదర్శించిన నటులు శ్రీ నవరస నటనా సార్వభౌమ బిరుదాంకితుడు కైకాల సత్యనారాయణ . ఎన్.టి.రామారావు కాని, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ లాంటి హీరోలకు మాత్రమే కాకుండా చిరంజీవి, బాలకృష్ణ లాంటి తర్వాతి తరం హీరోలకు కూడా ఒక పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా నటించారు. తండ్రి, తాతయ్య పాత్రలలోని ఒక నిండుతనం ఆయన నటనలో కనిపిస్తుంటుంది. 1959 సిపాయి కూతురు సినిమా నుండి ఇప్పటికి 57 సంవత్సరాల పాటు దాదాపుగా 800 సినిమాలలో హీరోగా, విలన్ గా, తండ్రి, తాతయ్య, కమేడియన్ ఇలా అన్ని రకాల భిన్నమైన పాత్రలలో నటించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే యముడు పాత్ర మరోక ఎత్తు.. మనమెవ్వరం యముడిని చూడలేదు.. కాని నరకంలో యముడు ఎలా ఉంటాడో ఆయన ఆహర్యం, నటన ద్వారా బహుశా యముడు అంటే కైకాల సత్యనారాయణలా ఉంటాడేమో అని తెలుగువారందరి మనసులో ముద్రపడింది. శ్రీ కృష్ణుడు శ్రీ రాముడు అంటే మనకు ఎన్.టి. రామారావు ఎలా గుర్తస్తారో యముడు అంటే సత్యనారాయణ అలా గుర్తొస్తారు. కైకాల కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. డిగ్రీ వరకు చదువు పూర్తిచేసి నటన మీద ఆసక్తితో మద్రాసుకు వచ్చేశారు.. మొదట నటనలో కాస్త తడబడినా తన పట్టుదలతో నటనలో రాటుదేలి అగ్ర కథానాయకులకు ధీటైన ప్రతినాయకుడిగా ఎదిగాడు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు ఇలా ఆయన నటనలో మరుపురాని పాత్రలెన్నో.. నిర్మాతగా సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు. తనకిష్టమైన ఎన్.టి.రామారావు ప్రోత్సాహంతో1996 లో రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 11వ లోక్‌సభ కు ఎన్నికయ్యాడు.
కొన్ని మరుపురాని పాత్రలు...