ఈ ఆలయానికి అతి పురాతన చరిత్ర ఉంది. ఒకసారి స్వర్గలోకంలో ఇంద్రుడితో పాటు కొంతమంది దేవతలు బ్రహ్మ దేవునితో సమావేశమైనప్పుడు శ్రీ మహావిష్ణువు మాయగురించి ప్రస్థావనకు వచ్చింది. కాసేపటికి సంభాషణల ద్వారా తెలుసుకున్నదేమిటంటే విష్ణుమాయను కనుగొనడం ఎవ్వరి తరం కాదని. ఐతే ఇదంతా నిశితంగా గమనిస్తున్న నారదమహర్షికి మాత్రం ఈ మాటలు అంతగా రుచించలేదు. నిత్యం నేను నారాయణుడి నామాన్ని జపిస్తాను నాకు నారాయణుడి మాయను తెలుసుకోవడం సులభం అని అక్కడ అన్నాడు. ఆ మాట సరాసరిగా శ్రీ మహావిష్ణువుకు చేరుతుంది. అప్పుడు నారదునికి తన మాయను తెలియజేయాలని ఒక నిర్ణయానికి వస్తాడు. కొంతకాలానికి నారదుడు భూలోకానికి వచ్చాడు. సంధ్యావందనం చేసుకోవాలని అక్కడే ఉన్న ఒక కొలనులో మునిగి లేచేసరికి నారదుడు ఒక మహిళగా మారిపోతాడు.. అక్కడికక్కడే నారదుడు తన శక్తులన్నీ కోల్పోయి, ఒక సాధారణ మహిళగా మారిపోయి గతాన్ని మరిచిపోతాడు.
కొంతకాలం తర్వాత వివిధ పరిణామాలు సంభవించాక ఒకరోజు ఆకలితో అలమటిస్తూ అడవిలో ఉన్న ఒక చెట్టు పండును తెంపడానికి చాలా ఇబ్బందిపడుతుంటాడు. అక్కడికి మారువేషంలో శ్రీ మహావిష్ణువు చేరుకుని 'దగ్గరిలోని కొలనులో స్నానం చేసుకుని వచ్చేదాక నీకు ఆ పండు అందదు' అని చెప్పి నెమ్మదిగా కనపడకుండా మాయమవుతాడు.. నారదుడు పండును తినాలన్నా ఆశతో కొలనులో మునుగుతాడు.. "ఆశ్ఛర్యం నారదుడు తన మామూలు ఆకారంలోకి వచ్చేస్తాడు" ఆ తర్వాత ఇదంతా విష్ణుమాయ అని తెలిసి విష్ణుమాయను తెలుసుకోవడం ఎవ్వరితరం కాదనే నిజాన్ని తెలుసుకుంటాడు. తన తప్పుకు ప్రాయశ్చితంగా ఇంకా శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడం కోసం ఇదే ప్రాంతంలో పాతాళ భావనారాయణ స్వామి ప్రతిమను ప్రతిష్టించి తపస్సు చేశాడట, ఆ తపస్సు ముగింపుకై నారాయణుడు వచ్చి ఈ మాయకు నిదర్శనంగా ఇక్కడే స్వయంభూ గా వెలిశారట.
అసలు కాకినాడ అంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది.. అటు ఫుడ్ పరంగా, ఇటు అధ్యాత్మిక పరంగా, ఏ రకంగా చూసిన మన రాష్ట్రంలో అతి సుందరమైన ప్రదేశాలలో కాకినాడ కూడా ఉంటుంది. అలాంటి కాకినాడకు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పవరం అనే ఊరిలో ఉంది ఈ దేవాలయం. పురాతన కాలంనాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం చూస్తున్న ఈ గుడి సుమారు 500సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ దేవాలయానికి ముందు నారదుడు మునిగిన సరస్సుగా పేరుగాంచిన సరస్సు ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే 100 వైష్ణవ దేవాలయాలను దర్శించినంత ఫలం దక్కుతుందని ఆలయ పూజారులు చెబుతారు.