మహిళలకు చీరలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. చీర పుట్టిన దగ్గరి నుండి నేటి వరకూ కూడా దానికున్న విలువ గుర్తింపు తగ్గలేదు. మిగిలిన చోట వేరే డ్రెస్ వేసుకోవచ్చు కాని రెండు జీవితాలను ఏకం చేసేటువంటి పవిత్రమైన పెళ్ళిలో చీర కట్టుకోవాలి.. మనసుకు శాంతిని చేకూర్చే దేవాలయానికి చీర కట్టుకునే వెళ్ళాలి.. చీర ఏనాటి ట్రెండ్ లో అయినా టాప్ పొజిషన్ లొనే ఉంటుంది. ఈ చీరలలోనే రకరకాల రకాలున్నాయి అందులో ప్రత్యేక విశిష్టత కలిగినదే కలంకారీ చీర.
సంగీత గారికి చిన్నతనం నుండి ఒకరి వద్ద కాకుండా మన వ్యాపారం, మన థాట్స్ తో బిజినెస్ స్టార్ట్ చేసి ఓ ఎంట్రప్రెన్యూర్ గా ఎదగాలనే ఆలోచనలో ఉండేవారు. పెళ్ళికి ముందు అప్పుడప్పుడు ఇలాంటి ప్రణాళికలు చేసినా కాని అవి కార్యరూపం దాల్చింది మాత్రం పెళ్లి తర్వాతనే. భర్త రాజేష్ గారితో కలిసి హైదరాబాద్ కు వచ్చాక కొద్ది కాలం వరకు కుటుంబ వ్యవహారాలలో బిజీగా ఉండిపోయారు. పాప, బాబు పుట్టడం వారి బాగోగులు చూసుకోవడంతోనే ఐదు సంవత్సరాలు రివ్వున గడిచిపోయాయి. పిల్లలు స్కూల్ వెళ్లడంతో అప్పుడు తీరిక సమయాలు దొరికాయి. కొంతకాలం మెరిడియన్ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు. కొంతకాలం మరో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత "స్మైల్స్" అనే స్కూల్ కూడా స్థాపించారు. ఇలా రకరకాల వ్యాపకాల్లో ఉన్నప్పుడే సంగీత గారి జీవితంలోకి కలంకారీ వచ్చింది.
ఒకపక్క స్కూల్ ను నడిపిస్తూనే వస్త్రరంగంలోకి అడుగుపెట్టాలని భావించారు. హైదరాబాద్ కోటి దగ్గరి నుండి మొదలుపెడితే గుజరాత్ సూరత్, కోల్ కతా, ముంబాయి, కాంచీపురం ఇలా రకరకాల ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళల మనస్తత్వం, మార్కెట్, ట్రేడింగ్ మొదలైన విషయాల మీద అవగాహన పెంచుకున్నారు. ఈ ప్రయాణంలో కలంకారీ ని చూడడం జరిగింది.. దాదాపు మిగిలిన చీరలపై ఉన్న రంగుల డిజైన్ లన్నీ మెషిన్ ఆధారంగానే ముద్రిస్తారు. కాని కలంకారీ చీర మీద ఉండే ఆకృతులను మాత్రం చేతితో కొన్ని వారాలపాటు శ్రమపడి తయారుచేస్తారు. ఆ చీరలో ఒక కలతో నిండిన కళ కనిపిస్తుంటుంది, అందుకనే చీరలలో కలంకారీ ప్రత్యేకమైనది.
కలంకారీ మొదట తనని ఆకర్షించింది.. కలంకారీ గురుంచి మరింత క్షుణ్ణంగా తెలుసుకుంటున్న కొద్ది దాని మీద ప్రేమ మరింత పెరుగుతూ వచ్చింది. కలంకారీ తయారీ మొదలుపెట్టిన తర్వాత ఊహించుకున్నంత సులభం కాలేదు. కలంకారీ కళాకారులను కలిసి అనుకున్న డిజైన్ రూపొందించమన్నప్పుడు మెటీరియల్ చిరిగిపోయేది, తయారైన వాటిని అమ్మడంలోనూ రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు. బయటివారితో కాకుండా పూర్తిగా తానే ఒక టీం ఏర్పాటుచేసుకున్నారు. ముందు పదిహేను మంది కళాకారులతో మొదలుపెట్టి అమ్మకాలు పెరుగుతున్న కొద్ది ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది.
కలంకారీ కొన్ని వర్గాలకే కాదు మధ్యతరగతి కుటుంబాలకు చేరువచెయ్యాలి అనే ఉద్దేశ్యంతో కొన్ని చీరలను 20 శాతం కలంకారీ తో మిగిలినది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తో చీరలను తయారుచేసి తక్కువ ధరకే అందిస్తుంది. అంతేకాదు తనకు ఇంత నచ్చిన కలంకారీని దేశ వ్యాప్తంగా ఎగ్జిబిషన్లను ఏర్పాటుచేసి మరింతమంది కి ఈ కళపై అవగాహన కల్పిస్తున్నారు.
In case you haven't watched our documentary on KALAMKARI, check it out here: