(Written By Raghavanand Mudumba)
మనం మన జీవితంలో ఇంకో కలాంను చూడలేము -పి ఎం నాయర్. కలాంగారి సెక్రెటరీగా పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ వారు చేసిన ఇంటర్వ్యూ లో కొన్ని బాగాలు యొక్క తెలుగు అనువాదం మీ కోసం.
1. కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారిదేశాన్ని అవమానించినట్టు అని వారు బాధపడతారు అని.. అంతిమంగా అది మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని.. వాటిని అయిష్టంగానే తీసుకునేవారు.
ఇండియా తిరిగిరాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగ్ తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు.ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలోనుండి తనతో తీసుకు వెళ్ళలేదు.
2. 2002 లో రంజాన్ november-december నెలలో వచ్చింది. మనదేశం లో రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం. ఒకరోజు కలాంగారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు.దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాను. “ బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు,బట్టలు,ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని అనాదాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు. అనాదాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు. అందులో ఆయన ఎటువంటి జోక్యమూ చేసుకోలేదు.
ఎంపిక అయ్యాక నన్నుతన రూమ్ లోకి పిలిచి “ ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన, నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి“అన్నారు. నేను ఈ విషయం అందరికీ చెబుతాను అంటే ఆయన వద్దు అన్నారు. తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరులేరు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఇఫ్తార్ విందు ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి కలాం గారు
3. కలాం గారికి తన మాటలకు అందరూ “ ఎస్ సర్ “ అనాలి అనే నైజం లేదు. ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగారు . “ నో సర్ ! “ అన్నాను. కలాంగారు మౌనంగా ఉండిపోయారు. మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయమూర్తిగారు నన్ను పిలిచి అలా No అన్నారేమిటండి అన్నారు. ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్..!! విని అవసరం అయితే అయన తన అభిప్రాయం మార్చుకుంటారు సర్“ అని నేను అన్నాను ప్రధాన న్యాయమూర్తి ఇది విని ఆశ్చర్య పోయారు .
4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు. వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు. దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు. ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు. వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు. అది సుమారు రెండు లక్షలు అయ్యింది . ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు. ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు. ఆ రోజులకి ఆయన అద్దె చేల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు. ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టేపెట్టుకున్నందుకు తన నివాసానికి తానే అద్దె చెల్లించాలి అనే నిజాయతీని మేము భరించలేము అని మేము ఒప్పుకోలేదు.
5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్ళేముందు అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్ళి కలిశాము. అందరినీ పేరు పేరునా పలకరించారు. నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది. ఆయన అడిగారు నా భార్య ఎందుకు రాలేదు అని..??
నేను కారణం చెప్పాను .
మర్నాడు మా ఇంటి ముందు పోలీస్ లు. ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని చెప్పారు
ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని తెలిసి అతడి ఇంటికి వెళ్ళి పరామర్శించినట్టు చరిత్రలో ఎక్కడా జరగలేదు.
చివరిగా ఒక TV వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు : 1) 3 పాంట్లు 2) 6 షర్టులు 3) 3 సూట్లు 4) 1 వాచ్ 5) 2500 పుస్తకాలు 6) Scientists Community Bangalore వారు ఆయనకు ఎప్పుడో ఇచ్చిన ఒక ఇల్లు 7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్ 8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు.