కళియుగానికి అధిదేవతగా ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారు. తిరుమల మాత్రమే కాదు తిరుమల తిరుపతి దాని చుట్టు పక్కనున్న ప్రాంతాలలో కూడా శ్రీనివాసుడి ఆనవాళ్ళు ఉన్నాయి. తిరుమలకు చేరుకునే ముందుగానే స్వామి వారు కల్యాణ వేంకటేశ్వరస్వామి గా ఇక్కడ శ్రీనివాస మంగాపురంలోనే ఉండేవారు.. ఈ అతి పురాతనమైన దేవాలయం తిరుపతి నుండి 12కి.మీ దూరంలో ఉన్నది. ఒక దేవాలయం ఎవరు నిర్మించినా గాని, ఎప్పుడు నిర్మించినా గాని, ఎంత ఖర్చుతో నిర్మించినా గాని అక్కడ భగవంతుడు ఉన్నాడు అనే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక దైవత్వ భావనకు భక్తులు లోనవుతే చాలు, అదే విధంగా ఈ దేవాలయంలో భగవంతుడు ప్రతిమరూపంలో కొలువై ఉన్నాడని అంతే అనుభూతికి లోనవుతాము.
ఈ గుడి అత్యంత పురాతనమైనది కావడంతో దీనిని ఆయా కాలానికి తగ్గట్టు ఎందరో మహారాజులు నిర్మించారు. వారందరిలో అందరికన్నా శ్రీకృష్ణ దేవరాయుల వారు అద్భుతమైన కళా నైపుణ్యంతో తిరుమల వాటి పరిసర ప్రాంతంలో ఉన్న దేవాలయాలను నిర్మించారు. ప్రాణం లేని రాళ్ళు ఇక్కడ జీవమున్న వాటిలా శిల్పాలలో దర్శనమిస్తాయి. స్వామి వారికి వివాహం జరిగిన తర్వాత అమ్మ వారితో ఇక్కడ కొంతకాలం గడపడంతో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు ఈ కోవెలకు వచ్చి స్వామి వారికి అమ్మవారికి కళ్యాణం చేయిస్తారు, ఇలా చేయించడం వల్ల వారి దాంపత్యం కలకాలం అన్యోన్యంగా ఉంటుందని వారి నమ్మకం.
కలకాలం దాంపత్యం బాగుండాలని కొత్తగా పెళ్ళైన దంపతులు మాత్రమే కాదు, పెళ్ళి కాని వారు కూడా వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఆరు నెలలలోపు వివాహం జరుగుతుందనంటారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత - ప్రతిమ ఎత్తు. తిరుమల లోని స్వామి వారి ప్రతిమ కన్నా ఈ దేవాలయంలోని ప్రతిమ ఒక అడుగు ఎత్తులో ఉందనంటారు.
పూర్వం ఈ ప్రాంతంలో అగస్త్యుడు అనే మహాముని తపస్సు చేస్తూ ఉండేవారు. నారాయణవనంలో శ్రీనివాసునికి కళ్యాణం జరిగిన తర్వాత వరాహుని సూచన మేరకు అగస్త్యుని ఆశీర్వాదం కోసం ఇక్కడికి స్వామి వారు చేరుకున్నారట. ఐతే కొన్ని కారణాల వల్ల ఇక్కడే ఉండి కళ్యాణదీక్ష చేయాలని ఆ మహాముని చెప్పారట. అలా వారి సూచన మేరకు శ్రీనివాస దంపతులు కొంత కాలం ఇక్కడే ఉన్నారని చరిత్ర. అలా 6నెలలపాటు గడిపిన తర్వాత ఒక మార్గం నుండి స్వామి వారు నడుచుకుంటు తిరుమలకు చేరుకున్నారు, తర్వాతి కాలంలో భక్తులు కూడా తిరుమలకు అదే దారిలో వెళుతున్నారు. (ప్రస్తుతం మనం వెళ్ళే దారి కూడా ఇదే).