చదువుకోకపోతే హోటల్ లో ప్లేట్లు ఎత్తాల్సి ఉంటుందని నిన్న మన పేరెంట్స్, టీచర్స్ జాగ్రత్త చేసి చదివించారు. ఆ మాటలు మన ఉన్నతి కోసం చెప్పినా గాని అదొక నమోషి పనిగా మారిపోయింది. ఇది కాంపిటీషన్ ప్రపంచం.. వెనక్కి, పక్కకి చూడకుండా కేవలం ముందుకు మాత్రమే చూస్తూ పరిగెత్తినప్పుడే గమ్యాన్ని తాకగలిగే రోజులివి.. ఇక్కడ ఎంత జ్ఞానం ఉంటే అంత నెగ్గుకు రాగలం, లేదంటే ఇక అంతే సంగతులు. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మిగిలిన చాలా మంచి పనులను ఇంకా ఎవ్వరూ ముట్టుకోవడం లేదు, "న్యాయమైన మార్గంలో నడుస్తున్నాము ఎవరు ఏమనుకున్నా మాకు అవసరం" లేదు అని కరీంనగర్ కు చెందిన ముగ్గురు విద్యార్ధులు కలిసి "వజ్ర టిఫిన్ సెంటర్" ను మొదలుపెట్టారు.

పీ.జి, సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ: ఉదయం క్లాసులు, సాయంత్రం టిఫిన్ సెంటర్ ఇలా టైమ్ ని సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చని చెప్పడానికి వీరొక ఉదాహరణ. కరీంనగర్ కు చెందిన మానస, శ్రీకాంత్(9290601561) లు ఎం.బి.ఏ పూర్తిచేశారు. అజయ్ ఎం.కామ్ చదువుతున్నాడు. మానస, శ్రీకాంత్ లిద్దరూ సివిల్స్, వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ ముగ్గురికీ కూడా మానసిక, శారీరక శక్తి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడటం అంటే ఇబ్బందిగా ఉండేది. మిగిలిన వాటికి డిమాండ్ తక్కువ, మార్కెటింగ్ స్ట్రాటజిస్ లాంటి చాలా ఇబ్బందులుంటాయి కాని ఫుడ్ విషయంలో మాత్రం వీటికి మినహాయింపు ఉంటుంది. రుచికరమైన ఆరోగ్యకరమైన ఫుడ్ పెడితే చాలు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే తక్కువ రిస్క్ ఉన్న టిఫిన్ సెంటర్ పై మొగ్గుచూపారు.

చాలా వెరైటీస్: కరీంనగర్ కమాన్ ప్రాంతంలో ఉన్న ఈ వజ్ర టిఫిన్స్ సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం ఐదు గంటలకు లేచి పిండి గ్రైండింగ్ పట్టడం, చట్నీ ప్రిపేర్ చెయ్యడం, కూరగాయలు తెచ్చుకోవడం, మొదలైన ఏర్పాట్లుచేసుకుని క్లాసులకు వెళ్ళిపోతారు. పార్ట్ టైమ్ గా చేస్తున్నారు ఎదో ఒకటి రెండు రకాల ఐటమ్స్ మాత్రమే ఉంటాయని అనుకోకండి. హైదరాబాద్ లో దొరికే వెరైటీస్ తో పాటు 15 రకాల దోశలు, 7 రకాల ఇడ్లీలు, 7 రకాల బజ్జిలను కరీంనగర్ వాసులకు రుచి చూపిస్తున్నారు. కరీంనగర్ అంతటా ఫేమస్ ఐన వజ్ర టిఫిన్స్ లో పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అమ్ముతారు.


సామాజిక సేవలోనూ: వజ్ర టిఫిన్స్ కు నాయకులు, అధికారుల దగ్గరి నుండి స్టూడెంట్స్ సామాన్యుల వరకు అభిమానులున్నారు. అన్ని వర్గాలకు చెందిన అభిమానులుండడం వల్ల ఫుడ్ కాస్ట్ తక్కువగానే ఉంటుందని మనం భావించవచ్చు. ఇంకొకరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశ్యంతో నడుస్తున్న ఈ ముగ్గురు మరో ఆరుగురికి కూడా ఉపాధినిస్తున్నారు. అలాగే కరీంనగర్ లో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, వివిధ పండుగలలో వెయ్యిమందికి ఉచితంగా భోజనాలు పంపిణి చేస్తారు.

నమోషి పడాల్సిన పని లేదు.. ప్రజలను నమ్మించి నయవంచించే నాయకులు నామోషీ పడాలి, అవినీతి అధికారులు నమోషి పడాలి.. ఇంకొకరిని మోసం చెయ్యడం కాకుండా డబ్బులు సంపాదించే ఏ పనిలోనూ నమోషి ఉండదు న్యాయం తప్ప.