(కొన్ని సంవత్సరాల క్రితం) "నమస్తే సాయి గారు.." "నమస్కారమండి, ఎలా ఉన్నారు.?" "నేను బాగానే ఉన్నానండి, అన్నట్టు మీ అబ్బాయి కార్తిక్ మానసిక పరిస్థితి సరిగ్గానే ఉంది కదా..?" (అనుకోని ఈ సంఘటనకు ఆలోచించలేకపోతున్న సాయి గారిని మళ్ళి చూసి) "ష్చ్ ప్.. అబ్బే ఎమ్ లేదండి మొన్న ఘాట్ రోడ్ మీదుగా వెళ్తుంటే, చింపిరి జుట్టుతో, బట్టలకంతా మురికి దుమ్ము పట్టి, ఎదో కెమెరా పట్టుకుని నడుచుకుంటూ అడవుల్లోకి వెళ్తుంటే చూశాను.." ఇదిగో అబ్బాయ్ " అని పిలుస్తున్న కాని ఆకాశంలోకి ఏవో పక్షులను చూస్తూ వెళ్ళిపోతున్నాడు. చెప్పిన మాట చెప్పినట్టుగా వినే మెషిన్ లాంటి కుర్రాడు, పాపం ఎలా ఉండేవాడు ఎలా ఐపోయాడండి..
ఇది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న కార్తిక్ గతం. గెలుపే పరమావధిగా చేసే పనిలో కష్టం, నష్టం, శ్రమ, నిరాశ, ఆనందం ఇవి ఉంటాయేమో.. నచ్చే పనిలో మాత్రం కేవలం "సంతృప్తి" ఉంటుంది. కార్తిక్ ఎవరినో ఏడ్పించాలనో, లేదంటే మరెవ్వరినో సంతోష పెట్టాలనో ఒక మార్గాన్ని ఎంచుకోలేదు. నచ్చిన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ప్రయాణం ఎంతటి ప్రత్యేకమైనదో, సమస్త జీవకోటికి ఎంత ఉపయోగకరమైనదో తెలుసుకున్న తర్వాత చులకనగా చూసిన వారే గౌరవించడం మొదలుపెట్టారు, భవిషత్తు గురుంచి భయపడిన వారే కార్తిక్ లా అవ్వాలని మిగిలిన వారికి సలహాలిస్తున్నారు.



ఆ ఒక్క పక్షి వల్ల:
కార్తిక్ జీవితం సామాన్యమైనది భోజనం లేక పస్తులుండి చదువుకున్న సందర్భాలు లేవు, స్కూల్ కు కార్లో వెళ్లిన సందర్భాలు లేవు. ఒకరోజు కార్తిక్ తిరుపతిలోని తన ఇంట్లో ఎదో ఆలోచిస్తూ ఉండగా Red whiskered bulbul గాలిలో రెక్కలతో ఈదుతూ తన దగ్గరికి వచ్చి వాలింది. తల పైన కిరీటం లాంటి ఆకారం, శరీరం రంగు భిన్నంగా ఉండడంతో కార్తిక్ ను ఆకర్షించింది. కార్తిక్ ప్రతిరోజు ఆ పక్షికోసం ఎదురుచూడడం, ఆ పక్షి కూడా ప్రతిరోజూ కార్తిక్ ఇంటి చెట్టు మీద వాలడంతో ఆ పక్షి పేరు తెలుసుకున్నాడు. ఇంటర్నెట్ లో ఆ పక్షి గురుంచి తెలుసుకునే ప్రయత్నంలో మిగిలిన పక్షుల గురుంచి తెలుసుకున్నాడు. వాటిని ఫోటో లు తియ్యడం కూడా అప్పుడే మొదలుపెట్టాడు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, ఒక హాబీగా ఉందని తెలుసుకున్న నాన్న చిన్నతనంలో కార్తిక్ కు ఒక కొడాక్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు. తన జీవితంలో తను హాయిగా విహరిస్తున్న ఆ ఒక్క పక్షి వల్ల కార్తిక్ జీవితమే పూర్తిగా మారిపోయింది. నాన్న అనుకున్నట్టుగానే ఫోటోగ్రఫీ హాబీగా, చదువు ఫుల్ టైం గా సమయాన్ని డివైడ్ చేసుకున్నాడు.



రొటీన్ జాబ్ వద్దు:
అన్నయ్య ఒక సోలార్ ప్రొడక్ట్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎం.బి.ఏ పూర్తి చేసిన తర్వాత కార్తిక్ అన్నయ్య కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టాడు. సొంత కంపెనీ, ఎవ్వరి కింద పనిచేసే పరిస్థితులు లేవు. కాని నేను బ్రతికేది చచ్చేదాక బ్రతకడం కోసం కాదు.. నా కోసం, నచ్చిన పనులు చెయ్యడం కోసం అని కార్తిక్ కు అప్పుడే తెలిసింది. "నాన్న.. నేను ఫోటోగ్రాఫర్ ని అవుతాను.. కాదు కాదు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ని అవుతాననని చెప్పాడు" మొదట నాన్న సందేహించారు. అన్ని రకాలుగా చెప్పి చూశారు, బాధపడ్డారు, కొంతమంది బంధువులు, ఇరుగుపొరుగు వారి మాటలకు నొచ్చుకున్నారు. కాని ఇవన్నీ "కార్తిక్ పై ఉన్న ప్రేమ" ముందు చిన్నవిగానే కనిపించాయి..



బర్డ్స్ సైకాలజీ:
ఫోటో స్టూడియోలో, లేదంటే ఇతర ఫంక్షన్లో ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు పోజ్ ఇస్తారు. అడవిలో పక్షుల విషయంలో అలా ఉండదు కదా.. ఎప్పుడు ఏ Expression ఇస్తుందా?, అసలు అది ఒక్కచోటే ఉంటుందా.? ఉంటుందో లేదంటే ఒక్క ఉదుటున ఎగిరిపోతుందా అని బరువైన కెమెరా పట్టుకుని నిత్యం అలెర్ట్ గా ఉండాలి. కార్తిక్ కెమెరా పట్టుకుని ఉదయం 6 గంటలకు బయటకు వెళితే రాత్రి 8 గంటలకు తిరిగివచ్చేవాడు. కార్తిక్ లో ఉండే గొప్ప లక్షణం ఓపిక. ఎన్ని గంటలైన అలానే కూర్చోగలడు, ఎంతసేపైనా బోర్ లేకుండా పక్షులను గమనించగలడు. Ornithology పూర్తిచేయడం వల్ల పక్షుల మనస్తత్వం తెలిసిపోయేది. దాని వల్లనే మిగిలిన ఫోటోగ్రాఫర్స్ ఒడిసిపట్టలేని పక్షుల శరీర కదలికలను కార్తిక్ పట్టుకున్నాడు.



ఒక పక్షి మరో పక్షికి ప్రపోజ్ చెయ్యడం:
ఒకరోజు ఇలాగే పక్షులను చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక పక్షి మరో పక్షికి చిన్న పుల్లను ఇస్తుండడం గమనించాడు. అదేంటి? పొదిగే సమయంలో గూడు నిర్మించడం కోసం పక్షి పుల్లలను ఏరుకస్తుంది కదా, పుల్లను పక్షికి ఇవ్వడం ఏంటి అని పరిశీలిస్తున్నాడు. పక్షి పుల్లను తెచ్చి ఇస్తుంది కాని మరో పక్షి దాన్ని స్వీకరించడం లేదు. ఇలా రెండు మూడు సార్లు జరిగాక పక్షి పుల్లను స్వీకరించింది.. ఆ తర్వాతనే ఆ రెండు పక్షులు జతకట్టాయి. అప్పుడు తెలిసింది ప్రేమను వెలిబుచ్చడంలో ఇలా పుల్లను వాడుతున్నాయి అని. ఇది ఒక జాతి పక్షులు వరకు మాత్రమే.. కొన్ని రకాల పక్షులు మరో రకంగా లవ్ ప్రపోజల్ చేస్తాయని తన రీసెర్చ్ లో తేలింది. వీటన్నిటిని తన కెమెరాలో షూట్ చేశాడు. త్వరలో దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శించబోతున్నాడు కూడా..



ప్రాణాలకు తెగించి:
2011 తలకోన దట్టమైన అడవిలో ఒకరోజు "ఇండియన్ పిట్ట" అనే పక్షి ఫోటోల కోసం రెండు గంటలుగా ప్రయత్నిస్తున్నాడు. అదే చెట్టు పై నుండి ఒక బలమైన చిరుత కార్తిక్ సమీపంలో దూకింది. కార్తిక్ కు చిరుతకు మధ్య కొన్ని అడుగుల దూరమే ఉంది. కార్తిక్ ప్రాణాల కోసం పరిగెత్తలేదు. కెమెరాను అందుకుని వెంట వెంటనే 13 ఫోటోలు తీసి అక్కడి నుండి దగ్గర్లోని జీపులోకి దూకగలిగాడు. ఇలా ప్రాణాలకు తెగించి కార్తిక్ తీసిన ఫోటోలు ఎన్నో..



వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తో పాటుగా వేలమందికి విద్యార్థులకు తను నేర్చుకుని, ఇంతటి ప్రయోజికత్వాన్ని సంపాదించి పెట్టిన ఫొటోగ్రఫీకి సంబందించిన క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు కూడా. కార్తిక్ ఇప్పటి వరకు 6 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు. 2017లో జరిగిన International Day for Biological for Biological Diversity సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బెస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, బయోడైవెర్సిటీ కన్సర్వర్ గా అవార్డ్ స్వీకరించాడు. అలాగే 2018లో జరిగిన International Day for Biological for Biological Diversityలోనూ Best Biodiversity Conserver అవార్డ్ ను అందుకున్నాడు.


కార్తిక్ తీసిన మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు: CLICK HERE