నందమూరి తారక రామ రావు గారు. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి , ఆయన పోషించిన పాత్రల గురించి, సృష్టించిన చరిత్ర గురించి రాయాలంటే నిఘంటువు లాంటి మనిషి కావాలి. ఆయనని దగ్గర నుండి చుసిన అనుభవం కావాలి. అందుకే ఆయనని కళ్లారా చుసిన శివ శక్తి దత్త గారి లాంటి పెద్దవాళ్లు, అనుభవజ్ఞుల చేత రాయపడిన "కథానాయకా " పాట రామరావు గారి ఠీవికి, కీర్తికి దర్పణంగా నిలిచింది. ఈ పాట ని కీరవాణి గారి స్వరకల్పన లో ఖైలాష్ ఖేర్ గారు ఆలపించారు. ఆ పాటలోని సాహిత్యం ఇది.
బడి లో తెలుగు పద్యాలు నేర్చుకునేటప్పుడు ప్రతిపదార్ధం(word to word meaning), భావం(whole meaning) అని నేర్చుకునే వాళ్ళం. అలా ఈ పాట ప్రతిపదార్థ భావాలు చూద్దాం.
ప్రతి పదార్ధం: ఘన = గొప్పదైన కీర్తిసాంధ్ర = కీర్తితో నిండినవాడా విజితాఖిలాంధ్ర = విజిత + అఖిల + ఆంధ్ర = మొత్తం ఆంధ్రప్రదేశ్ ని జయించిన వాడా జనతా = జనుల అందరి సు = మంచి ధీ = బుద్ధిలో ఇంద్ర = శ్రేష్ఠమైన వాడా మణి దీపకా = మణులతో సమానమైన కాంతి కలవాడా.
త్రిశతాధికా = త్రిశత + అధికా = 300 వందలకు పైగా చిత్రమాలిక = చిత్రాలు(సినిమాలను) మాలలు గా ధరించి జైత్రయాత్రిక = జైత్రయాత్రను చేసిన వాడా కథానాయక = కథను నడిపించేవాడా
ఆహార్య= చక్కని రూపు అంగిక = శరీర కదలికలు వాచిక = వాక్చాతుర్యం, మాటలో స్పష్టత పూర్వక = పుట్టుకతోనే కలిగిన వాడా అద్భుత అతులిత = అద్భుతమైన, తూల్చలేనటువంటి నటనా ఘటికా = నటన యందు నైపుణ్యం కలిగిన వాడా
భీమసేన = భీముడు వీర + అర్జున = వీరుడైన అర్జునుడు కృష్ణ = కృష్ణుడు దాన కర్ణ = దానం చేసేటువంటి కర్ణుడు మానధన = అభిమానమనే ధనముని కలిగిన వాడు
సుయోధన = దుర్యోధనుడు భీష్మ = భీష్ముడు బృహన్నల = బృహన్నల విశ్వామిత్రా = విశ్వామిత్రుడు లంకేశ్వరదశకంఠ రావణాసురాది = లంకేశ్వరుడైనా దశ కంఠము కలిగిన రావణాసురుడు మొదలగు
పురాణా పురుష = పురాణాలలో పురుషుల భూమిక = పాత్ర లను పోషకా = పోషించిన వాడా సాక్షాత్ సాక్షాత్కారక = స్వయానా వారేనా అన్నట్టు నటించిన వాడా
త్వదీయ = నీవు ఛాయాచిత్ర = సినిమాలతో అచ్చాదిత = కప్పపడిన వాడవు
రాజిత = ప్రకాశవంతమైన రంజిత = ప్రేక్షకులను ఆనందపరిచేటువంటి చిత్ర = చిత్రముల కు యవనిక = తెరలాంటివాడవు
న ఇదం పూర్వక = ఇంతవరకు లేని విధంగా రస = రసములను , (భావోద్వేగాలను) ఉత్పదకా = పలికించేటువంటివాడవు
కీర్తి కన్యక = ఆడ పిల్ల లాంటి కీర్తి ప్రతిష్టల కు మనో నాయక = మనసున యందు నాయకుడివి ( ప్రేమించిన వాడా) కథానాయకా = కథను నడిపించేవాడివి
భావం : ఎన్టీఆర్ గారు ఎంతో గొప్ప కీర్తి తో నిండినవారు, ప్రేక్షకుల అందరి హృదయాల లో ఎంతో గొప్ప స్థానాన్ని పొందిన వారు. ఆయన కాంతి ఎన్నో మణుల కాంతులతో సమానం. 300 పైగా విజయవంతమైన సినిమాలను ముందుండి నడిపించిన కథానాయకుడు (హీరో) ఆయన . రూపం లోను, శరీర కదలికలోను, మాట లోను ఇది వరకు ఎవరికీ లేనటువంటి నటనా నైపుణ్యం ఆయనకుంది. భీముడైన, అర్జునుడైన, కర్ణుడైన, బృహన్నలైన, కృష్ణుడైన, భీష్ముడైన , దుర్యోధనుడైన , లంకేశ్వరుడగు రావణుడైన ఎలాంటి పురాణ పాత్రైనా... వారేనా అనిపించేట్టు ఆ పాత్రని తెర పై చూపించేటువంటి వారు గొప్ప నటులు ఎన్టీఆర్. అందుకే ఆయనకి అభిమానమనే ధనం కలిగిఉంది. ఓ ఎన్టీఆర్ మీరు సినిమాలతో కప్పపడిన వారు, ఆ చిత్రాలను చూపించేటువంటి తెర లాంటి వారు. ఇది వరకు ఎవరు చేయని విధంగా భావాలను పలికించేటువంటి వారు. కీర్తి ప్రతిష్టల మనసులని గెలుచుకున్న నాయకులు మీరు. కథానాయకులు మీరు.