చీకటి పడిందంటే చాలు మళ్ళీ ఉదయం ఎప్పుడవుతుందా అని కవిత గారు ఎదురుచూస్తూ ఉండేవారు. మరికాసేపట్లో సూర్యుడు రాబోతున్నాడు అనగానే సైకిల్ హ్యాండిల్ ను పట్టుకుని బయటకు పరిగెత్తేవారు. ఇదేదో కాంపిటీషన్ కోసం కాదు, సైకిల్ అంటే చిన్నతనం నుండే కవిత గారికి ప్రేమ. తనకు నచ్చిన వాటితోనే ఎక్కువ సమయం గడపడం వల్ల సైకిల్ తోనే తన ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం కవిత గారు సైకిలిస్ట్, రన్నర్, అలాగే సామాన్యులతో నడుస్తూ ఎందరినో మోటివేట్ చేస్తున్న ఓ బాటసారి.


విజయవాడ దగ్గర్లోని గండ్రాయి అనే ఓ గ్రామంలో పుట్టి భారతదేశం గర్వించే స్థాయిలో ఎదిగారు. ఐతే ఈ మార్గం ఒక్క వాక్యంలో పూర్తి రాసినంత సులభంగా సాగలేదు. 15 సంవత్సరాల వయసులో ఎప్పటిలానే ఐదు గంటలకు రన్నింగ్ కు బయలుదేరితే ఓ బస్ కవిత మార్గానికి స్పీడ్ బ్రేకర్ గా ఢీ కొట్టింది. మూడు వారాలు కోమాలో, ఇంకా ఆ గాయాలు కూడా జీవితాంతం ఇబ్బందులకు గురిచేసేవే.. తన మీద తనకు గల ఇష్టం ఆత్మగౌరవం, ఇంకా రన్నింగ్ సైక్లింగ్ పై ప్రేమ మూలంగా త్వరగానే కోలుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లడం, చదువు, ఉద్యోగం, పర్ట్నర్షిప్ లో వ్యాపారం..

కవితకు అలసట నుండి రిలీఫ్ నిచ్చేది, బాధ నుండి ఓదార్పును శక్తినిచ్చెది సైక్లింగ్, రన్నింగ్. 2009లో మొదటి రన్నింగ్ థార్ ఎడారిలో జరిగింది. మిగిలిన రన్నర్స్ ముందు నుండే ప్రాక్టీస్ చేశారు, కవిత మాత్రం ప్రత్యేకంగా ఎటువంటి ప్రాక్టీస్ లేదు, ఊహించినట్టుగానే గెలిచారు. ఎడారిలో 210 మీటర్ల రన్నింగ్ రేస్ లో గెలిచిన తర్వాత పరుగు ఇటు వైపు సాగింది. హిమాలయాలు, పడమటి కనుములు, రాజాజీ నేషనల్ పార్క్, జై సల్మేర్, ఫోక్రాన్, కచ్ లాంటి కష్టమైన దారులలో రన్నింగ్.. మిజోరాం, ఒడిశా, ఢిల్లీ, తెలుగురాష్ర్టాల్లోనూ రన్నింగ్, సైక్లింగ్ చేశారు. "గ్లోబ్ రేసర్స్ ఫౌండేషన్" ను స్థాపించి పట్టుదలతో రాణిస్తూ ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించడం, మగవారికి ధీటుగా వివిధ గేమ్స్ లో మహిళలు రాణించాలని "విమెన్ స్ట్రాంగ్ కలెక్టివ్" ను కూడా ఏర్పాటుచేశారు.


కవిత చదునుగా ఉన్న మైదానం కన్నా పర్వతాలు, కొండలు, ఏడారులు లాంటి దారులలో రన్నింగ్, సైక్లింగ్ చెయ్యడం ఇష్టం. తన లాంటి ఉత్సాహవంతులకు ఒక వేదిక ఏర్పాటు చేసి అల్ట్రా రేస్ లనూ నిర్వహిస్తోంది. చక్కని గైడెన్స్ కూడా అందిస్తారు. రేస్ సమయంలో ఏవేవి వెంట ఉండాలి.? ఆ ప్రదేశంలో ఓడిపోయినా భావోద్వేగానికి తీవ్రంగా స్పందించకుండా ముందుగా కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణం ఎలా రియాక్ట్ కావాలనే దానిపై ట్రైనింగ్.. మొదలైన అన్ని రకాల అంశాలలో కవిత, ఇంకా తన టీం వివరిస్తారు. కవిత గారికి వ్యవసాయం అంటే కూడా ఇష్టం. సొంతూరు లో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మొదలుపెట్టారు.
