Contributed by Shammu Shanmukh
పలక పట్టుకున్న క్షణం నుండి మాతృ భాష తో సమానం గా ఆంగ్లాన్ని నేర్పిస్తారు మన పాఠశాలల్లో. మనం చదువుకునే పాఠ్య పుస్తకాలు కూడా ఆంగ్లం లోనే ఉంటాయి. మనకి తెలుగు రాకో, లేదా అవసరం లేకో, మరి బయట ఎక్కడైనా ఎవరైనా తెలుగులో మాట్లాడితే చులకనగా చూస్తారు. పరిస్థితి ఎలా తయారు అయింది అంటే మాతృ భాష కంటే బాగా పరాయి భాష మట్లాడుతున్నారు చాలా మంది. ఉద్యోగం చెయ్యాలి అంటే ఆంగ్లం, బయట ఎదైనా తినాలి అంటే ఆంగ్లం, వైద్యం చేయించుకోవాలి అంటే ఆంగ్లం...
ఇలా ప్రతీ విషయం లో మన మాతృ భాషని వెనక్కి నెడుతున్నారు. కనిపించనంత వెనక్కి వెళ్ళిపోతోంది మన మాతృ భాష. అమ్మ అనే పిలుపుని కూడా తెలుగు లో పలకడానికి సిగ్గు పడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. కాని ఇన్ని ఇబ్బందులు ఉన్నా అన్నింటిలో మన తెలుగు వాడు ముందు ఉంటాడు. అమెరికా లో తెల్ల వాడికే చెమటలు పట్టిస్తున్నారు.
పొరుగు దేశాలకి వెళ్ళే భారతీయుల్లో మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటే అది మన వాళ్ళ ప్రతిభ. అన్ని ప్రదేశాలలో వారి వారి మాతృభాష కాకుండా వాడుకలో ఆంగ్లం భాష మాత్రమే ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఎవరైనా అలోచించారా. అలా వాడాలి అని దేవుడు ఏమి నిర్దేసించలేదు...అది అందరికీ సులభంగా అర్దం అవుతుందనే అలా నిర్నయించి ఉంటారు. అలాంటి భాష మీద వ్యామోహం తో మన మాతృభాషని విస్మరించటం ఎంత వరకూ సమంజసమో మీ విగ్నతకే వదిలేస్తున్నా. పరాయి భాష ని నేర్చుకోవద్దు అని అనటం లేదు కాని మన మాతృ భాష ని గౌరవించండి.
అమ్మ మనల్ని తొమ్మిది నెలలు మోస్తుంది కాని మాతృభూమి మనం ఉన్నంత కాలం మోస్తుంది. అలాంటి మాతృభూమి మీద ఉంటున్నందుకు కనీసం మాతృభాష లో మాట్లాడలేమా.. చిన్న చిన్న సహాయాలు చేస్తున్న వాళ్ళ ఋణమే ఉంచుకోము అలాంటిది మనల్ని మోస్తున్న మన మాతృ భూమికి ఎదైన చెయ్యగలం అంటే అది మన మాతృభాష లో మాట్లడటమే.. బాలేదు అని అమ్మని, రాలేదు అని తెలుగుని వదులుకోకూడదు..
చివరిగా ఒక మాట
ఆత్మాభిమానాన్ని చంపుకోవటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టే.. మాతృ భాష లో మట్లాడాల్సిన చోట పరాయి భాష వాడిన ప్రతీసారి ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్టే.. అలా ఆత్మాభిమానాన్ని చంపుకున్న ప్రతీసారి ఆత్మహత్య చేసుకున్నట్టే.!!