నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి అడిగిన సౌకర్యాలు, మంచి చదువు అందించి ప్రయోజకుడిని చేస్తే ఈరోజు వృద్ధులై పోయేసరికి ఇంటి నుండి వెళ్ళగొడుతున్నారు.. నవమాసాలు తన శరీరంలో దాచుకుంటే ఈరోజు తన ఇంట్లో చోటు లేదంటున్నాడు.. ఎన్నో త్యాగాలు చేసి అతనికి సౌకర్యాలు అందిస్తే ఈరోజు ఆ తల్లిదండ్రుల మందుల కోసం డబ్బులేదంటున్నాడు.. అలాంటి వాడు కొడుకు.? రక్తం పంచుకున్న వాడు కొడుకు కాదు తల్లిదండ్రులను నిజాయితిగా ప్రేమించి వారి సకల బాధ్యతలు తీసుకునే వాడే నిజమైన కొడుకు. వెంకటరమణ గారు ఒక్క తల్లికి ఒక్క తండ్రికి మాత్రమే కొడుకు కాలేదు అభాగ్యులు, ఆనాధలకు ఇలా ఎంతోమందికి భగవంతుడు ఇచ్చిన కన్న కొడుకు అయ్యారు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మనాన్నలను ఎదోరకంగా కర్కశంగా గాలికి వదిలేసే నీచ కొడుకులు ఉన్న కాలం ఇది. కాని అలాంటి అమ్మ నాన్నలకు సేవచేయడం వెంకటరమణ గారు అదృష్టంగా భావిస్తారు. కడప జిల్లా సిద్ధవటం మండల ప్రాంతంలో "పరమాత్మ తపోవనం" అనే ఒక ఆశ్రమం ఏర్పాటుచేసి ఎంతోమంది వృద్ధులకు ఆయన కొడుకయ్యారు. వెంకటరమణ గారు కడప జిల్లాలో పోలీస్ ఆఫీసర్(ASI) గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిని ఒక అశ్రమంలా కాదు ఒక దేవాలయంలా పరిగనిస్తారు అక్కడి స్థానికులు.
మనం చూస్తుంటాం.. మన బంధువులలో గాని మరెక్కడైనా గాని ఎవరైనా చనిపోతే కొన్ని అనుమానాలతో దూరంగా నిలబడతారు చాలామంది.. వారికి స్నానం చేయించడానికైనా, శవాన్ని మోయడానికైనా లక్షసార్లు ఆలోచిస్తారు. కాని వెంకటరమణ గారు అలా కాదు ఒక సొంత కొడుకు ఏ విధంగా భాద్యతలు, కార్యక్రమాలు నిర్వహించాలో ఆ విధంగా పూర్తిచేస్తారు. అలా ఇప్పటికి 500 మంది దహన సంస్కారాలు తన సొంత ఖర్చులతో వారి సాంప్రదాయాలకు అనుగూణంగా పూర్తిచేశారు. కేవలం పూర్తిచేయడం మాత్రమే కాదు ప్రతి సంవత్సరం పవిత్ర వారణాసి వెళ్ళి గంగ నది ఒడ్డులో వారి ఆత్మశాంతికై పూజలు చేసి, పిండ ప్రధానం చేస్తారు. వారి జీతంలో 15వేలు కుటుంబ ఖర్చుల కోసం వినియోగిస్తే మిగిలిన 45 వేల రూపాయలు ఆశ్రమంలోని వృద్ధుల కోసం ఉపయోగిస్తారు. ఇదొక్క ఉదాహరణ చాలు ఆయనది స్వచ్చమైన నిస్వార్ధ ప్రేమ అని చెప్పడానికి..
2011లో ప్రారంభించిన ఈ పరమత్మ తపోవన ఆశ్రమ నిర్వహణకు ఇప్పటి వరకు ఏ ఆటంకం కలుగలేదు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి విరాళం ఇవ్వాలనుకున్న గాని ఆ విరాళాన్ని డబ్బు రూపంలో కాకుండా బియ్యం, కూరగాయలు మొదలైన వాటి రూపంలో రమణ గారు స్వీకరిస్తారు. సువిశాల ప్రశాంతమైన ఈ ఆశ్రమంలో అన్ని రకాల పండ్ల చెట్లుంటాయి, ఆవులు, పక్షులతో ఈ ఆశ్రమం చాలా అందంగా ఉంటుంది. ఇంతలా సేవచేస్తున్న వెంకట రమణ గారు ఏనాడు వృద్ధులను బయటివారిలా భావించరు. వీరికి నాకు ఏదో జన్మలో అనుబంధం ఉండి ఉంటుంది అని వీరికి సేవ చేయడం నా అదృష్టం అని ఆనందపడతారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.