మొదట ఆ యువకులను చూసి దేపల్లి గ్రామ ప్రజలు ఎవరు వీళ్ళంతా అని ఆశ్ఛర్యపోయారు.. వీళ్ళు తప్పకుండా మన దగ్గర డబ్బు ఆశిస్తున్నారని భయపడ్డారు.. కొంతమంది ఐతే ఏకంగా ఊరిలోకి అడుగు పెట్టకూడదని వీరిపై కుట్రలు కూడా చేశారు. కాని ఆ యువకులు వెనకడుగు వెయ్యలేదు. చెయ్యాలి అని అనుకున్నది మొదలు పెట్టారు.. రెండు వారాలు గడిచాయి.. ఇప్పుడు ఆ ఊరి ప్రజలందరూ వీళ్ళు ఎప్పుడూ వస్తారా అని ప్రేమగా ఎదురుచూస్తున్నారు. ఆ ఊరిని మార్చడానికి కంకణం కట్టుకున్న వారందరూ Chartered Accountants. ఏసి రూంలో ఉంటూ లక్షలకు లక్షలు సంపాదించకుండా మారుమూల పల్లెటూరికి వెళ్ళి తమవంతు బాధ్యతగా రైతులు, వారి పిల్లల బంగారు భవిషత్తును ఉజ్వలంగా మారుస్తున్నారు.



భారతదేశానికి అత్యంత అధికంగా సేవ చేస్తున్నది సరిహద్దులో రక్షణగా ఉన్న ఆర్మి జవానులైతే, దేశం లోపల సేవ చేస్తున్నది రైతులు.. రైతుల కష్టాలు మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు, స్వాతంత్రం రాక ముందు నుండి వారి జీవితాలలో పెద్దగా మార్పులు లేవు, ఆత్మహత్యలు ఆగడం లేదు.. వీరి పరిస్థితి ఇంతే ఎవరు ఏమి చేయలేరని ఆ యువకులు అనుకోలేదు. "పేద రైతుల జీవితాలలో అన్ని రకాలుగా మార్పు రావాలి" అని "శ్వేత శర్మ, అశ్విని లావణ్య, ఆయూష్ శర్మ, ఫణి కళ్యాణ్, గుంటూరి జాయ్ సన్, సత్యరఘ మొక్కపాటి" ఆరుగురు సభ్యులన్న చార్టడ్ అకౌంటెంట్ టీం(ఆయుష్,శ్వేత తప్ప) తమ చదువు మేధస్సు కేవలం మా కోసం మాత్రమే కాకుండా ముఖ్యంగా పేద ప్రజలకు కూడా ఉపయోగపడాలి అనే బలమైన సంకల్పంతో "కిసాన్ సేవక్ ఫౌండేషన్" ను 2014లో స్థాపించారు.



మన రైతులలో ఉన్న ప్రధాన లోపం నిరక్షరాస్యత. బ్యాంకులలో గాని, కష్టపడి పండించిన పంటకు సరైన ధర నిర్ణయించడం, చెల్లింపుల విషయంలో గాని, తీసుకున్న అప్పులకు సరైన వడ్డి లెక్కించడంలో మొదలైన అన్ని విషయాలలో రైతులకు చదువు అత్యంత అవసరం. అత్యధిక మెజారిటిలతో గెలిచిన ప్రభుత్వాలన్ని రైతుల చదువు కోసం, వారిని జ్ఞాన వంతులుగా తీర్చిదిద్దడంలో ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో సంవత్సరాల తరబడి రైతులు అన్ని రకాలుగా మోసాలకు గురి అవుతున్నారు. అందుకే "కిసాన్ సేవక్ ఫౌండేషన్" వారు ముఖ్యంగా "విద్య" అనే ఆయుధాన్ని రైతులకు అందిస్తే జీవితంలో ధైర్యంగా పోరాడే వ్యక్తిత్వం వస్తుంది అని వారు విద్యసేవను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా దేపల్లి అనే సుమారు 500 కుటుంబాలు ఉన్న గ్రామంలో వీరి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.



మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్. ఇక్కడ వలసలు ఎక్కువ, భృణ హత్యలు, బాల్య వివాహాలు, చిన్నతనంలోనే చదువు మాన్పించడం లాంటి వెనుకబాటు చర్యలు అధికంగానే జరుగుతుంటాయి. 500 కుటుంబాలు ఉన్న దేపల్లి గ్రామంలో ఉదయం 6గంటలకు ఒక బస్సు, సాయంత్రం 6గంటలకు మరొక బస్సు మాత్రమే వస్తుంది. దాదాపు 80 మంది విద్యార్ధులున్న ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో వారికి కేవలం ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వీటన్నీటి నిర్మూలనే 'కిసాన్ సేవక్ ఫౌండేషన్' ప్రధాన లక్ష్యమయ్యింది. మొదట ఈ గ్రూప్ దేపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు అందరు వింతగా చూశారు.. కనీసం వారి వివరాలు చెప్పడానికి కూడా విముఖత చూపించారు.. ఆ తర్వాత నెమ్మదిగా ఫౌండేషన్ వారి తపన అర్ధం అయ్యేసరికి వీరి వెంట రైతులు నడిచారు. అలా పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు ప్రతి ఆదివారం రోజు ఈ యువకులు చెప్పే పాఠాలకు హాజరవుతున్నారు.



ఈ యువకులందరూ ఇప్పుడు స్థానికులకు కుటుంబ సభ్యులయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఆదివారం రోజు వీరి రాక కోసం ఆత్మీయంగా దేపల్లి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వీరిలో కొంతమంది "చదువురాక బస్సు పేరు అడిగే వ్యక్తులు ఇప్పుడు ఇంగ్లీషులో వారి గురించి వివరించుతున్నారు.. ఏ ఒక్కరిని బ్రతిమలాడకుండా బ్యాంకులలో ఫామ్స్ వాళ్ళే నింపుతున్నారు.. తీసుకున్న అప్పుకు ఎవ్వరి ఆధారం లేకుండా వారే వడ్డి లెక్క కడుతున్నారు. మొదట ఆరుగురు వాలంటీర్లు ఉంటే ఇప్పుడు 100మందికి చేరుకున్నారు. ఇప్పుడు నైట్ స్కూల్ ని కూడా నిర్వహిస్తున్నారు.. ఇది కేవలం విజయం కాదు ప్రయాణం.. ఈ ఒక్క ఊరితో ఈ విజయం ఆగదు. ప్రతి వెనుకబడిన గ్రామంలో ఇలాగే విజయం సాధించాలని ప్రయాణం సాగిస్తున్నారు ఈ యువకులు.. ఈ ఊరికి, ఈ ఊరి ప్రజలకు ఏ విధమైన సంబంధము లేదు కాని ఎందుకు వారికింత సేవ చేస్తున్నారు అంటే అది జాలి కాదు, సాటి మనిషిపై చూపించే మానవత్వం.. స్వచ్ఛమైన ప్రేమనే వీరిని ముందుకు నడిపిస్తుంది..



KISAAN SEVAKS FOUNDATION (REGD 874 IF 2016), E-mail: kisaansevaksfoundation@gmail.com Call/ Whatsapp to Phani or Ashwini - 7207165162/ 9010964801