మన తెలుగు స్టేట్స్ లో చాలా అందంగా ఉండే ప్రాంతం అంటే కోనసీమ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రకృతి తనలోని అందాలను ఇంకాస్త అందంగా చూపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి కోనసీమలో వెలసిన బాల బాలాజి దేవాలయాన్ని భక్తులు వారి కోనసీమ తిరుపతిగా పిలుచుకుంటారు. ఈ గుడి కాకినాడ నుండి 70కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 85కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పనపల్లి అనే ఊరిలో ఉంది.
పూర్వం ఈ ప్రాంతంలో గరుత్మంతుడు పాములను వేటాడి చంపితినేవాడు. నాగుపాములు ఈ బాధను భరించలేక జిమూత వాహనుడు అనే రాజుకు చెప్పాయట. వారి బాధను చూడలేక జిమూత వాహనుడు పాము రూపంలో గరుత్మంతుడికి ఆహారంగా అక్కడికి వచ్చాడట దీనిని గమనించిన గరుత్మంతుడు రాజు గొప్పతనాన్ని చూసి పరవశించిపోయి 'ఒక వరం కోరుకో' అని తనకో వరం ఇచ్చాడు. దానికి రాజు చనిపోయిన పాములన్నీటిని బ్రతికించమని కోరాడు. ఇది విధిని అతిక్రమించడం అవుతుంది దీనిని నేను చేయలేనని చెబితే కనీసం వాటికి తర్పనమైనా వదలమని అడిగాడట. అప్పుడు గరుత్మంతుడు ఇక్కడికి నదిని తీసుకువచ్చి ఆ నీటిలో నాగుపాములకు తర్పనం చేశారట.
అలాగే ఇక్కడ మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పెంచి పోషించిన వకులమాత శ్రీనివాసుడిని ఒక కోరిక కోరిందట. రామునికి, కృష్ణునికి బాల్యం ఉన్నది కాని నీ బాల్యాన్ని చూడలేకపోయాను వారిలానే నాకు నీ బాల్యాన్ని చూడాలని ఉందని అడిగిందట. ఆ తర్వాత వకుళమాత కోరిక ప్రకారమే ఈ ప్రదేశంలో వేంకటేశ్వరుని బాల్యం జరిగిందని అందువల్ల ఈ గుడిని బాల బాలాజిగా భక్తులు పిలుచుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన విశేషాలు అంటే శిల్పాలు, గోదావరి నది గురించి చెప్పుకోవచ్చు. విష్ణుమూర్తికి కి సంబంధించిన చారిత్రక ఘట్టాలు, ఆలయ గోపురం మీద దేవతల శిల్పాలు అందంగా దర్శనమిస్తాయి. గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.