దశావతారలో ఒక అవతారం అయిన శ్రీరామునికి ఎంతటి భక్త జన సంఖ్య ఉందో ఆయన దాసుడు ఆంజనేయస్వామికి కూడ అంతే స్థాయిలో భక్తులున్నారు. ఎందుకంటే శ్రీరాముడిని హనుమంతుడిని వేరుగా చూడలేము కనుక. అంజనేయుడు క్రమశిక్షణకు మారుపేరు, విశ్వశానికి మారు పేరు, దేహ దారుడ్యంలో వీర హనుమాన్ కి మించినవారు ఇంకొకరు లేరెమె అని అనిపిస్తుంటుంది.. జై శ్రీరాం, జై హనుమాన్ అని భక్తితో ఆర్తితో పిలిస్తే చాలు వారి ఆపదలకు రక్షణగా నిలుస్తాడు అని భక్తుల విశ్వాశం.. అంతటి మహిమాన్విత తేజస్సు కలిగిన అంజనేయుని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం మన తెలంగాణా లో ఉంది. రామునికి భద్రాచలం ఉంటే ఆయనగారి సేవకుడికి కొండగట్టు ఉంది. మన తెలంగాణలోని భద్రాచలం, వేములవాడ, యదగిరి గుట్ట, కొమరవెళ్ళి, బాసర సరస్వతి ఆలయాల స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి దాదాపు 35కిలోమీటర్ల దూరంలో మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామ పరిధిలో ఈ పవిత్ర దేవస్థానం కొలువై ఉంది.

ఆలయానికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలదు. స్థానికుల నమ్మకం ప్రకారం త్రేతయుగంలో రామ రావణ యుద్దసమయంలో లక్ష్మణుడి ప్రాణం కోసం సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న సమయంలో సంజీవని గుట్టలో కొంతభాగం ఇక్కడ పడిపోయిందని (లేదా) సంజీవని కొండను ఎత్తుకొస్తున్న సమయంలో ఇక్కడ యాగాలు నిర్వహిస్తున్న ఋషుల ఆహ్వానం మేరకు కొంతసమయం గడిపారని స్థానికుల నమ్మకం.

నిజానికి పూర్వం సింగం సంజీవులు ఒక యాదవ ఆవుల కాపరి ఒకరోజ మందలో ఉన్న ఆవు తప్పిపోయిందని వెతెకి వెతికి అలసిపోయి పడుకున్నాడు అప్పుడు ఆయన కలలోకి ఆంజనేయుడు వచ్చి ఆవు ఆచూకి తెలిపి దానితో పాటు తను ఇక్కడే కొలువై ఉన్నానని నా ప్రతిమ ఫలాన చోట ఉందని ఆ వ్యక్తికి వివరించాడు. స్వప్నంలో నుండి ఉలిక్కిపడి లేచి చూసి పరిశీలించగా హనుమంతుడు చెప్పిన ప్రదేశాలలో ఆవు దొరికింది. ప్రతిమ దర్శన భాగ్యం కలిగింది.. ఇదంతా ఊరు వాడ ఎరుకచేసి ఆంజనేయునికి గుడి కట్టించారని స్థానికుల వివరణ. ఆ కాలంలో మాములుగా సింగం సంజీవులు చిన్న పరిమాణంలో దేవాలయాన్ని నిర్మించారు.. కాలంతో పాటు భక్తుల తాకిడి పెరగడంతో 160 సంవత్సరాల క్రితం కృష్ణరావు దేశ్ ముఖ్ ఆలయ ఎక్కువ విస్తీర్ణంలో కట్టించారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం ఆయన కట్టించినదే.

చుట్టు పచ్చని పంటపొలాల నడుమ అందంగా నిర్మలంగా పవిత్ర కొండగట్టు ప్రాంతం శోభాయమానంగా కొలువై ఉంటుంది. దేవాలయాన్ని స్తాపించారు ఇప్పటికి ఆ నిర్మలత్వం ప్రశాంతత అలాగే కొనసాగిస్తున్నారు.. ఇక్కడి ఆలయ నిర్మాణంలో కళాకారుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించాలి.. 5అంతస్థుల రాజగోపురంలో వివిధ రకాల ఆకారంలో ఆంజనేయుని విగ్రహాలు దర్శనమిస్తాయి. రాజగోపురంలో రామునికి సహాయం చేసిన వానరసైనం విగ్రహాలు కూడా అందంగా మలిచారు. ఆలయం లోనికి వెళ్ళగానే పవిత్ర కోనేరు ఉంటుంది భక్తులు ఆ పవిత్ర కోనేరులో స్థానమాచరించి గుడిలోనికి అడుగుపెడతారు.. దేవస్థానంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. గుడికి కుడి వైపు వైష్ణవాలయం ఉంటుంది ఇందులో విష్ణుమూర్తి స్వరూపుడున కలియుగ వరదుడు అండాళ్ళ అమ్మవారు దర్శనమిస్తారు. ఎడమవైపున శైవ సాంప్రదాయంలో శివ పంచాయతనం కలిగిన ఆలయం ఉంటుంది. వెనుక భాగంలో భేతాల స్వామి దేవాలయం ఉంటుంది..

ఇక్కడి నియమాలు పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్రాలను అనుసరించి అమలుచేస్తారు. చాతుర్ధ శ్రీ వైష్ణవ అర్చకుల ద్వారా అర్చనలు నిర్వహిస్తారు. నిత్యాభిషేకాలు, ఆరాధనోత్సవాలు, వ్రతాలు, హోమాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, ధనుర్మాసమహోత్సవాలు, కృష్ణాష్టమి, హనుమాన్ జయంతి వంటి పండుగలు ఇక్కడ అత్యంత ఘనంగ నిర్వహిస్తారు.. ఇక్కడ ప్రత్యేకంగ 5రోజులు హనుమాన్ జయంతి రోజులు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఎంతోమంది పుణ్యమార్గంలో, ధర్మ మార్గంలో నడవడానికి హనుమాన్ మాల ధరిస్తారు. 40రోజులు అత్యంత భక్తి ప్రపత్తులతోగడిపిన స్వాములందరు వారి ఇరుముడిని తలపై ఎత్తుకొని "కొండగట్టు" దేవస్థానంలో మాల విరమణ చేయడం సాంప్రదాయం. దర్శించిన వారందరికి అపూర్వ భక్తి పారవశ్యాన్ని అందించి, కోరికలను తీరుస్తు, వరాలను అందించే కల్పతరువుగా ఈ దేవాలయం ప్రసిద్ది చెందింది.
