తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు(టీఎస్బీసీబీ) నివేదిక ప్రకారం హైదరాబాద్ గాలిలో దుమ్ము, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నిట్రిక్ ఆక్సైడ్, అమ్మోనియా వంటి కాలుష్యకారకాలు ప్రధానంగా ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ భయంకరంగా పెరిగిపోయింది. టెన్షన్, భయం, కోపం నుండి బయటపడి మానసిక శాంతి కలగాలంటే గట్టిగా ఊపిరి పీల్చి వదలమంటారు.. ఇప్పుడు అలా చేస్తే మానసిక ప్రశాంతత ఏమో కాని ఈ పొల్యూషన్ శరీరంలోకి ఇంకాస్త ఎక్కువ వెళ్ళిపోవడం మాత్రం జరుగుతుంది. హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణ అంతటా పెరిగిపోతున్న పొల్యూషన్ ను అదుపు చెయ్యడానికి రాష్ట్రంలో 33% అడవులు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.m ఒక్క హైదరాబాద్, మరియు దాని పరిసర ప్రాంతాలలో లోనే 16 పార్కులు అభివృద్ధి చేయబోతున్నారు. ఆ 16 పార్కులలో ఒకటిది కండ్లకోయ ఆక్సిజన్ పార్క్.
75 ఎకరాలు: మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామంలో రూపుదిద్దుకున్న ఈ పార్క్ మరో ప్రపంచాన్ని తలపిస్తుంది. సాధారణంగానే సిటీకి దూరంగా ఉండడం, చుట్టూ దట్టమైన చెట్ల వల్ల ఏ హారన్ మోత, మన చుట్టూ ఉంటు మనల్ని మింగే విష వాయువులు ఇక్కడ ఏమాత్రం కానరావు. ప్రకృతి నిశ్శబ్దంగా ధ్యానంలో మునిగిపోయి తనలోని శాంతిని ఇక్కడికి వచ్చిన తన బిడ్డలకు ఇస్తుంది. ఈ ఆక్సిజన్ పార్క్ 75 ఏకరాల రిజర్వు ఫారెస్ట్‌లో విస్తరించింది.
చల్లని పలకరింపు: ఈ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ను అర్బన్ లాంగ్స్ స్పేస్ అనే మరో పేరు కూడా ఉంది. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, వివిధ రకాల ఔషద మొక్కలు వాటి వ్యక్తిత్వాన్ని గాలిలోకి ప్రసరింపజేస్తాయి. 75 ఏకరాలలో 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ క్లాస్ రూమ్, హెర్బల్ గార్డెన్, యోగా షెడ్, బటర్ ఫ్లై గార్డెన్, వాకింగ్ బ్రిడ్జ్, ట్రీ షెడ్ ఉంటాయి.
నిజానికి కండ్లకోయలో రిజర్వ్ ఫారెస్ట్ ను సమకూర్చాలని 10 సంవత్సరాల క్రితం నుండే ప్రణాళిక ఉంది, కాని అది చేతల్లో కనిపించలేదు. ప్రజల ఆరోగ్యం, టూరిజం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని లక్షల రూపాయలు వెచ్చించి దీనికి ఒక రూపు తీసుకువచ్చారు. చిన్నపాటి నీటి కుంటలు, పిల్లలు ఆడుకోవడానికి జంతువుల విగ్రహాలు, వివిధ రకాల పక్షుల మాటలతో చిన్నపాటి అభయారణ్యాన్ని తలపిస్తుంది.