Contributed By Lakshmi Bhupala సినిమా కి కావల్సిన కథావస్తువుని ఎంచుకోవడానికి ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలామంది ప్రతీసారీ పురిటినొప్పులు పడుతుంటారు (రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్ళతో సహా).. దీనికి ఇప్పుడు నేను చెప్తున్న 'కృష్ణవంశీ' కూడా అతీతులు కారు.. ఒకరకంగా అలా పడితేనే వాళ్ళ కెరీర్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటుంది.. ఉదాహరణకు ఈ ఆర్టికల్ లో డైరెక్టర్ కృష్ణవంశీ ని ఆయన కెరీర్ ప్రారంభం నుండి విశ్లేషించుకుంటే, ఆయన ఒకదానితో ఒకటి ఏమాత్రం సంబంధం లేని సినిమాలతో, జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని సృష్టించుకున్నారు.. అందుకే ఆయన తర్వాత ఎంతమంది దర్శకులొచ్చినా, వాళ్ళు ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చినా, "క్రియేటివ్ డైరెక్టర్" అనే గౌరవం ఒక్క 'కృష్ణవంశీ' కి మాత్రమే ఉండిపోయింది.. దానికి ప్రథమ కారణం విభిన్న కథాంశాలే.. ఇప్పటివరకు 'కృష్ణవంశీ' ఎంచుకున్న కథాంశాలు గమనిస్తే....
గులాబీ : 'హ్యూమన్ ట్రాఫికింగ్' అనే సామాజిక సమస్యని చక్కటి ప్రేమకథ కు జోడించి తీసిన చిత్రం.. చాలా సహజంగా ఉండే మాటలు, శ్రావ్యమైన పాటలు, అద్భుతమైన చిత్రీకరణ ఉన్న చిత్రం.. ఇప్పటికీ ట్రెండీగా ఉంటుంది..

నిన్నే పెళ్లాడతా : కుటుంబంలో ఉండే మనస్పర్థలు, సంబంధ బాంధవ్యాలను అతిసహజమైన రీతిలో తీసిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఇది.. (ఇందులో కొన్ని హిందీ సినిమా ఛాయలున్నా, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించి ఆరోజుల్లో కోట్లు కుమ్మరించిన సినిమా)

సిందూరం : పోలీసులు-నక్సలైట్ల మధ్య జరుగుతున్న అనివార్యమైన పోరాటం గురించి, దానివల్ల మధ్యలో నలిగిపోతున్న ప్రజల గురించి కూలంకషంగా చర్చించిన సినిమా.. వ్యవస్థ లో ఎవరు ఎలా ఉన్నా అందరూ మనుషులే అని చెప్పే ప్రయత్నం చేసిన సినిమా..

చంద్రలేఖ : ఇదొక మలయాళ సినిమా రీమేక్.. కాబట్టి చర్చించడం అసంబద్ధం..

అంతఃపురం : తెలుగులో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలన్నీ ఒకెత్తు, అంతఃపురం ఒక్కటీ ఒకెత్తు.. పగ ప్రతీకారం తప్ప ప్రాణాలకు విలువివ్వని ఫ్యాక్షనిజం నేపధ్యంలో, భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, తన కొడుకును అక్కడ నుండి తీసుకెళ్లడానికి యముడు లాంటి 'నరసింహం' అనే ఫ్యాక్షనిస్ట్ తో పోరాడిన కథ.. మనిషి ప్రాణం విలువ చెప్పిన చిత్రం..

సముద్రం : సమాజంలో చట్టం, న్యాయం వంటి విభిన్న వ్యవస్థల మధ్య నలిగిపోయిన/నలిగిపోతున్న మనలాంటి ఒక సామాన్యుడి కథ ఇది..

మురారి : పెద్దలు చేసిన తప్పులు/పాపాలు శాపాలై తరతరాలను వెంటాడతాయని అంతర్లీనంగా చెప్పిన చిత్రం ఇది..ఎంతో మనోనిబ్బరం, దృఢ సంకల్పంతో ప్రయత్నించినా విధి ఫలితాన్ని, ఉపద్రవాన్ని పక్కకు మరల్చగలమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదనే కథాంశం ఉన్న విభిన్న చిత్రం ఇది..

ఖడ్గం : మతసామరస్యాన్ని, జాతీయ సమైక్యతను ఉమ్మడిగానే తప్ప, మతాల, వర్గాల ద్వారా సాధించలేమని, ప్రశాంతతను పొందలేమని ఎంతో పవర్ ఫుల్ గా చెప్పిన చిత్రం ఖడ్గం.. సమాజంలో జరుగుతున్న విద్వేష మారణకాండ కు అద్దం పట్టిన చిత్రం..

శ్రీఆంజనేయం : ఆత్మ-పరమాత్మల అనుబంధ సారం ఈ చిత్రం.. డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతి నుండి మనిషిగా రూపాంతరం చెందిన మనం రానురాను మృగాలుగా, రాక్షసుల్లా మారిపోతున్నాం.. ఒక కోతి స్వచ్ఛమైన మనసు, భక్తితో దేవుడిగా మారినప్పుడు, మనిషి స్వచ్ఛంగా ఉంటే దేవుడు కాగలడని, ఆత్మ-పరమాత్మ వేరు కాదనే కథాఅంశం ఫిలసాఫికల్ డివోషనల్ సినిమా ఇది..

చక్రం : మనిషి జీవితంలో ఎంత సాధించినా, ఏం చేసినా 'మరణం' మాత్రమే ఆఖరి మజిలీ..దాన్నుంచి తప్పించుకోవడం ఎవరివల్లా కానిపని.. అలాంటప్పుడు ఉన్న ఈ చిన్న జీవితాన్ని హాయిగా, ప్రశాంతంగా బ్రతకాకుండా, ఎందుకొచ్చిన గొడవలు, కలహాలు, విద్వేషాలు, పంతాలు, ఎత్తులు పైఎత్తులు?..అని ప్రశ్నిస్తూ సున్నితమైన కథతో చెప్పిన ప్రయత్నం 'చక్రం'..

డేంజర్ : టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో మూఢనమ్మకాలేంటని ప్రశ్నిస్తూ, హై టెక్నికల్ వాల్యూస్ తో చేసిన సినిమా ఇది.. తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ ఎక్విప్మెంట్ తో తీసిన ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఇది..

రాఖీ : తరతరాలుగా అణగదొక్కబడుతున్న స్త్రీ జాతి సమస్యలపై పోరాటం ఈ రాఖీ.. ఇప్పటికీ సమాజంలో పాతుకుపోయి ఉన్న 'వరకట్నం' అనే సాంఘిక దురాచారం నేపథ్యంలో ఉన్న చిత్రం ఇది..

చందమామ : 'ప్రతి ప్రేమకథ కూ తల్లితండ్రులే అవరోధాలు' అనే రొటీన్ ప్రేమకథల్ని దాటి తీసిన సినిమా ఇది.. కన్నవాళ్ళని గౌరవించిన కూతురు, కూతురు అభిప్రాయానికి, ఇష్టాఇష్టాలకు విలువిచ్చిన తండ్రి కథ ఇది..

శశిరేఖా పరిణయం : పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేని ఒక ఆడపిల్ల, హఠాత్తుగా 'పెళ్లి' అంటే, అయోమయంలో ఇల్లు వదిలి పారిపోయి ఎటువంటి పరిస్తితులు ఎదురుకుంది అనేది ఈ చిత్ర కథాంశం..

మహాత్మా : ప్రతి వీధిలోనూ 'గాంధీ' విగ్రహం పెట్టి, జయంతికి, వర్ధంతికి మాత్రం దండలేసి, ఆయన్ని మన అవసరాలకు వాడుకుంటున్నామే కాని, గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఎంతవరకు అనుసరిస్తున్నాం?... అనే ప్రశ్న మనందరికీ తలెత్తేలా తీసిన చిత్రం ఇది..


మొగుడు : 'ప్రతి మొగుడూ మగాడే, కానీ ప్రతి మగాడూ మొగుడు కాలేడ'నే కథాంశం ఉన్న చిత్రం ఇది..

పైసా : మనిషి సృష్టించిన డబ్బు, మనిషిని ఎలా ఆడిస్తుందో చెప్పిన సినిమా ఇది..

గోవిందుడు అందరివాడేలే : మనం కన్నవాళ్ళని, ఉన్నావూరుని, మాతృదేశాన్ని వదిలి ఎక్కడికెళ్లినా మన మూలాలు మనతోనే ఉంటాయని, ఉండాలనే కథాంశం ఉన్న చిత్రం ఇది..

నక్షత్రం : ఒక పోలీసు అధికారి కొడుకు దుర్మార్గుడు కావచ్చు, సామాన్య పోలీసు కొడుకు బాధ్యత గల పౌరుడు పోలీసు కావచ్చు, ఒక దొంగ కొడుకు ఉత్తమ పోలీసు కావచ్చు.. ఇదంతా పెంపకం వల్లే ఉంటుందనే కథాంశం ఈ చిత్ర నేపథ్యం...

ఇందులో సూపర్ హిట్లున్నాయి, అట్టర్ ప్లాప్లున్నాయి..కారణాలు వంద ఉండొచ్చు.. ఇక్కడ విషయం కేవలం కథావస్తువుని ఎంచుకోవడం మాత్రమే కానీ, హిట్టు ప్లాపులు కాదు.. ఇలాంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తీసాక అవి థియేటర్ లో ఆడకపోయినా టీవీల్లో వచ్చినప్పుడు మనల్ని కదలకుండా చేసే అద్భుతమైన సినిమాలు కూడా ఉన్నాయి.. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, కథల్ని ఎంచుకోవడానికి కేవలం ప్రేమకథలు, హారర్,రొటీన్ యాక్షన్ ఫార్ములాలే ఎంచుకుంటే మీరు ఉన్న 100 మంది దర్శకుల్లో 98A,98B ల్లాగే మిగిలిపోతారు.. మీకంటూ ప్రత్యేక స్థానం కావాలి, మీ నెంబర్ 101 కావాలంటే మాత్రం కొత్తగా ప్రయత్నించండి...ఇప్పుడున్న తరం కృష్ణవంశీ గారిని క్రియేటివ్ డైరెక్టర్ అని పిలిచినట్టే, కథల విషయంలో నిజాయితీగా, విభిన్నంగా ఆలోచిస్తే రేపు మీరు కూడా మీ తర్వాత తరానికి ఆదర్శం కావచ్చు.. ...లక్ష్మీ భూపాల