(ఈ ఆర్టికల్ రాసినది కిట్టు విస్సాప్రగడ, ఒక సినిమా రచయత.)
సినిమా..ఇదొక అందమైన అబద్ధం. రాళ్ళు కొట్టే వాడి దగ్గర నుంచి కీబోర్డు మీద బటన్సు కొట్టే వాడి దాకా అందరినీ కనెక్ట్ చేసే ఎకైక భాష సినిమా. అలాంటి సినిమా ని చూడటం ఎంత తేలికో, చేయటం అంత కష్టం. ఆ కష్టాన్ని సవాలు గా, అభిలాష గా తీసుకుని తరలి వచ్చిన సోదర సోదరీమణుల కథే, ఈ కృష్ణా నగర్ కేకలు!
1) పుష్పక విమానం :
మూట ముల్లె సద్దేసుకుని కృష్ణా నగర్ కి వచ్చేసి రోజూ స్టూడియో ల వెంట, డైరెక్టర్ ల వెంట పడేటప్పుడు వేసుకోటానికి రెండు జతల బట్టలు, తినటానికి ప్లేట్ మీల్స్, ఉండటానికి ఒక చిన్న స్పేస్ చాలు. అందుకే ఈ బ్యాచిలర్ రూంస్ లోకి ఎంత మంది వచ్చినా, ఇంకొకడికి చోటుంటుంది. రాత్రి నిద్దట్లో ఒకడు పొజిషన్ మారాలంటే, మొత్తం అందరూ మారాల్సి వస్తుంది. ఇరుకుదనం లో చురుకుదనం అంటే ఇదే అనమాట!
2) పచ్చదనం - పరిశుభ్రత :
అలా ఒక బ్యాచిలర్ కొంప సిద్ధమైన కొన్నాళ్ళకి ఎవడి బట్టలు ఎవడు వాడుతున్నాడో తెలీదు. అది రూమా భూత్ బంగ్లా నా తెలీదు. అది బాత్రూమా బూతు బంగ్లా నా తెలీదు. కర్రీ పాయింటు కవర్లు...ఉతకాల్సిన బట్టలు...తుప్పు పట్టిన ఇనప వస్తువులు...ఆహా! ఉత్కృష్టం! ఐతే, బురద లో పద్మం లా జూనియర్ ఆర్టిస్ట్స్ మధ్యలో సన్నీ లియోన్ లా వీటన్నిటి మధ్యలో ఒక కాస్ట్లీ కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం కంపల్సరీ. తిండి లేకపోయినా లైట్ కానీ ఇంటర్నెట్ కి మాత్రం అంతా చందాలేస్కుని మరీ బిల్లు కడుతుంటారు.
3) కోతల రాయుళ్ళు :
మెగాస్టార్ కి లైఫిచ్చింది నేనే..అందుకే ఆయన బ్లెడ్ బ్యాంక్ కి నేనెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు...నాగార్జున కి శివ చేయమని చెప్పింది నేనే..అందుకే ఇవాళ ఒక యూనివర్సిటీ కి కూడా ఆయన పేరే పెట్టారు..చేస్తా..నిన్ను కూడా ఆ రేంజ్ హీరో ని చేస్తా..టచ్చి లో ఉండు..టీ కి ఓ యాభై ఇవ్వు..ఇలాంటి కోతల కింగ్స్ కోకొల్లలు...టీ కి డబ్బులు లేనోడు స్టార్ హీరోలకి లైఫ్ ఇచ్చాడట...వీళ్ళని నమ్మితే నవ రంధ్రాల్లో నవరత్న ఆయిల్ పూసుకున్నట్టే!
4) తొలి అనుభవం - ద ఫస్ట్ రోమాన్స్ :
చదువు ఐపోగానే ఫస్ట్ టైం మూటా ముల్లే సద్దుకుని కృష్ణా నగర్ వచ్చేసాకా, ఎవరో ఒక మ్యానేజరో ప్రొడక్షన్ బాయో పరిచయమైతే, నెమ్మదిగా వాళ్ళతో కలిసి షూటింగ్ కి వెళ్ళి వస్తారు. ఫస్ట్ టైం షూటింగ్ చూసాకా ఈవినింగ్ రూం కి వచ్చి ఇంక లక్ష్మి గనపతీ రేంజ్ లో బొమ్మ చూపిస్తారు ఫ్రెండ్స్ కి. అబ్బ చాలా ఈజీ రా ఇలా నిలబడి అలా డైలాగ్ చెప్పి ఎల్పోటమే! ఒక్క సీన్ ని రోజంతా తీసారు రా బాబు! షూటింగ్ లో నాకు ఎన్ని మర్యాదలో! కుర్చీ వేసి గొడుగు పట్టి ఫూడ్ పెట్టి అబ్బబ్బబ్బా ...మ్యాటరేంటంటే మనోడు గుంపు లో దూరి అలా ఓ లుక్కేసి వచ్చుంటాడు అంతే!
5) టెర్మినాలజీ - పరిభాష :
బైట నుంచి ఎవరైనా కలవటానికి వచ్చినప్పుడు ఈ ఎన్విరానమెంట్ అంతా సినిమా భాష లో ఉంటుంది. బావా..గంట క్రితం రైస్ పెట్టాను బావా...ఇంకా ఉడకలే..కట్ చేస్తే స్విచ్ ఆన్ చెయ్యటం మర్చిపోయా హిహిహీ...మామా...ఓపెన్ చేస్తే బట్టలేస్కుంటున్నా మామా..ఇంటర్ కట్ లో నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది మామా...లాంటి భాష కి ఆ చుట్టు పక్కకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్ టైటిల్స్ ఐనా అడుగుతారు లేదా మ్యూట్ బటన్ వెతుకుతారు. ఇక అందరి నోటా కామన్ గా వినపడే కేక.." ఒక్క చాన్స్...ఒకే ఒక్క చాన్స్"!
6) మమతల తల్లులు తండ్రులు కాలింగ్ :
ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి సినిమాలకి ట్రయల్స్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు పాపం సినిమాల్లో కన్నా జీవితం లో ఎక్కువ నటిస్తారు.కష్టాలు, కన్నీళ్ళు కోకాకోలా తాగినంత ఈజీ గా మింగేస్తారు.టైం కి తిను, టైం కి పడుకో అని పేరెంట్స్ చెప్తుంటే..చెమ్మ చెక్క అష్టా చెమ్మ టాపిక్స్ కి డైవర్ట్ చేసేసి హమ్మయ్యా ఇవాళ మ్యానేజ్ చేసేసాం అని తల కింద చేతులేస్కుని బబ్బుంటారు. ఏదో ఒక రోజు అవకాశం రాకపోతుందా అమ్మా నాన్న ని ప్యాలెస్ లో పెట్టకపోతామా అని ఓ వెర్రి వాంఛ! Million Dollar dreams in a congested room I say!
7) మనోభావాలు...మడత కాజాలు :
ఏదో కష్టపడి హీరో డేట్స్ దొరక్క, ప్రొడ్యూసర్ మనీ టైం కి ఇవ్వక, రక రకాల ఇబ్బందులు పడుతూ నానా డ్యాషులు డ్యాషుతూ చచ్చి చెడి ఎంతో కష్టపడి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే, హీరో ముక్కు గోక్కున్నాడు మేము హర్ట్ అయ్యాం..హీరోయిన్ అరికాల్లో ముల్లు గుచ్చుకుంది మేము ఫీల్ అయ్యాం..విలన్ హావభావాలకి మా మనోభావాలు దెబ్బ తిన్నాయ్ లాంటి ఆర్త నాదాలకి అన్నిటికన్నా ఫస్ట్ అట్టుడికిపోయేది కృష్ణా నగరే!
8) అతిథి దేవో భవ..! రిఫరెన్స్ మామా! :
ఏళ్ళ తరబడి ఫిల్మ్ ఇండస్ట్రీ లో తన ఊరి నుంచి వచ్చిన ఒకడు ఉన్నాడనీ తెలిసిన తర్వాత ఒక రోజు అతన్ని రూం కి పిలిచి, అందరినీ పరిచయం చేసి, అత్తాపూర్ బాబా టైపు లో కూర్చోపెట్టి ఉపచారాలు, తీర్థ ప్రసాదాలు అందించిన తర్వాత, అతని సక్సెస్ లెవెల్ ని బట్టీ మామా నాక్కూడా ఒక చాన్స్..నేను కూడా నీలా అవుతా..మన ఊరి పరువు ప్రతిష్ట నిలబెడతా..మీ డైరెక్టర్ ని కల్పించు మామా టైపు హాహాకారాలు, భక్తుల కోరికలు వినపడటం సర్వ సాధారణం. మ్యాటర్ ఏంటంటే ఈ రాత్రి గడిచాకా మనోడు ఫోన్ కూడా ఎత్తడు.
కాబట్టీ, ఆ ప్రకారంగా అమ్మాయిలకీ, అబ్బాయిలకీ కూడా దాదాపు 60% కృష్ణా నగర్ జీవితాలు ఇలానే ఉంటాయి. ఒక్క సారి హిట్ ఒస్తే మాత్రం జూబ్లీ హిల్స్ కి తగ్గని స్టేజ్ కి వెళ్ళిపోతారు.లేదా ఏళ్ళ తరబడి ఇంట్లో వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి కనిపించే అబద్ధాలకి రంగులు పూసి చూపిస్తూ ఒక రకమైన త్రిశంఖు స్వర్గం లో బతికేస్తుంటారు. ఒక్క వాక్యం లో చెప్పాలంటే, చుక్కల్లో తేల్చాలన్నా...పాతాళం లోకి తొయ్యాలన్నా సినీ ఇండస్ట్రీ ని మించిన దేవత మరొకటి లేదు..సాంబో! రాస్కో రా!