మతం, కులం రెండూ 'దైవత్వం' పేరుతో మనిషి సృష్టి౦చుకున్నవే, సమస్త సృష్టి వ్యాపకం లో మనిషిది ఒక జాతి.. ఆ జాతి లో.. మళ్ళీ మతం.. ఆ మతం లో మళ్ళీ కులం.. ఆ కులం లో మళ్ళీ తెగలు. నిన్న కాపు గర్జన లో భారీ భయాందోళన జరిగింది సో సందర్భం వచ్చింది కాబట్టి నేడు మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ .. ఈ మత - కుల గోల ఈ నాటిది కాదు . చేస్తున్న పనిని బట్టి, మొఖానికి ఉన్న రంగును బట్టి, ఆస్తిని - అంతస్థుని బట్టి మనిషి పెట్టుకున్న అడ్డు జల్లెడ అనే మహా రాక్షస ముసుగు ఇది. చూడ్డానికి చాలా చిన్నగా , పారదర్శకంగా కనిపించే ఈ ముసుగు తల్లి పాలతో పాటు పోసి పెంచిన విషం లాంటిది. ఆ విష భీజాలు పెరిగి పెద్దవై ఇలా సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆ మధ్య పటేల్ కులస్థులు గుజరాత్ లో మారణ కాండ జరిపితే టీవీ లలో చూసి ఆశ్చర్యపోయాం కానీ ఇప్పుడు మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ లో అదీ తుని లాంటి ఒక గోదావరి పరివాహక ప్రాంతంలో ఇంతటి విధ్వంసం జరుగుతూ ఉంటే ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి. అసలు ఈ రిజర్వేషన్ లు ఎందుకు పుట్టాయీ? ఎందుకు ఇస్తున్నారు? మొత్తం మీద తీసేస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది.. దాని ఫెచ్చింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద గ్రంధం . అనుకున్నది సాధించడానికి ఎంచుకునే మార్గం గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుకుందాం. యుద్ధాలతో , మారణ హోమాలతో ఇసువంతైనా ఎవడూ ఏమీ సాధించలేదు అని చరిత్రే చెబుతోంది. మనం చరిత్ర లోంచి వచ్చిన వాళ్ళమే ఆకాశం నుంచి ఊడి పడలేదు. గాంధీని ఫాలో అయ్యి నోరు మూసుకుని పడుండి ఆ రకంగా గెలిచే సీన్ ఎలాగూ లేదు. కానీ విజ్ఞతని మరచి ..రెచ్చిపోవడం వల్ల జరిగే అనర్దాలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు ? నిన్న రైలు బోగీలు తగలడుతూ ఉంటే అసలు ఏం జరుగుతోందో కూడా తెలీని స్థితి లో ఆడవాళ్ళు పిల్లల్ని తీసుకుని పరిగెత్తారు, రైలు మొత్తం తగలడిపోతే ప్రాణాలు పోతాయి అని వందల మంది రైళ్ళు , బస్సులు దిగి పారిపోతుంటే మధ్యలో ముసలి జనాలు నలిగి పోయారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు అని సరిపెట్టుకోవాలి ఏమో. విద్వేషాలు రెచ్చగొట్టే మూర్ఖపు నాయకులు , రాజకీయ పార్టీలూ ఎప్పుడూ గోతి కాడ నక్కల్లా సారీ కుక్కల్లా కాచుకుని ఉన్నచోట బలిచ్చే మేకలం మనలో మనమే అని ఎప్పటికి తెలుసుకుంటాం ? ఈ దేశం లో జరిగే ఎలాంటి మత - కుల దాడి అయినా అధికార పీఠం కోసం ఒకడు.. , దాన్ని కాపాడుకోవడం కోసం మరోకడు. .. వీరిద్దరూ మన దారుల్ని మార్చి.. మన చితిని మనతోనే పేర్చి .. దాని మీద మనంతట మనమే పడుకునేలా చేస్తారు, తరవాత వారు నెమ్మదిగా మంట పెడతారు.
ఒక దేశపు ఘనత ఒక లక్ష్యానికి సంకేత.. అధ్బుతమైన లక్ష్య సిద్ధి సంకల్ప బలానికి ఫలితం విజయం. వీటన్నిటికీ విజ్ఞత కావాలి, పట్టు విడుపు ఉండాలి. రెచ్చగొడితే రెచ్చిపోయే ఒక తరం నడుస్తూ .. బతుకుతూ .. తింటూ .. కాలం వెళ్ళ దీస్తూ ఉన్నన్ని దశాబ్దాల పాటు ఈ దేశ చరిత్ర లో ఒలంపిక్ విజయాలకి కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా కుల - మత గొడవలు జరిగి తీరతాయి. మన మైండ్ సెట్ ని ఎవడో కంట్రోల్ చేసి వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు దాన్ని ఆడిస్తూ ఉంటే దానికి తగట్టు మనం గంగిరెద్దు లాగా ఆడుతూ ఉంటే సిగ్గు అనిపించట్లేదా ? ఒక్క సారి ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఇది. దీని తరవాత ప్రశ్నించుకోవడం కాదు ముందు తరాలు ఉమ్మే ఉమ్ములకి మొఖాలు తుడుచుకోవాలి. నిర్భయ కేసు లాంటి కేసులు ఏపీ లో వారానికి రెండు జరుగుతున్నాయి ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చి రైలు కాదు కదా రైలు బొమ్మ తగలెట్టాడా ? పోనీ కులం మీద ప్రేమ ఉంటే ఆడపిల్లలు అన్ని కులాల్లో నరకం చూస్తున్నారు, అన్యాయం అన్ని కులాల్లో ఉంది, అవినీతి అన్ని కులాల్లో సమానంగా సాగుతుంది, కానీ కేవలం రిజర్వేషనో మరేదో సాకుతో రోడ్ల మీద పడతాం కారణం 'మన దృక్పదం' .. రెచ్చిపోయే తత్వం. దీనికి ఎలా స్పందించాలో కనీసం ఆలోచించని వ్యక్తిత్వం ఇవేవైనా కావచ్చు.
ఆది మానవుడి కి తిండికి.. బట్టకి హింస చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేది అది ఎప్పుడో బుర్ర ఎదగక, నాగరికత తెలియక. వాడి నుంచి కోటానుకోట్ల సంవత్సరాలు దాటి వచ్చేసినా ఆ మృగ స్వభావం చావకేమో.. సంబంధం లేని వాటికల్లా తెగ బడుతున్నాం. అప్పుడు వాడికి న్యాయం కోసం - సమానత్వం కోసం .. కోర్టు లు లేవు, చట్టాలు లేవు. ఇబ్బంది కలిగితే పక్కవాడికి చెప్పుకోవడానికి బాష లేదు. భయమేస్తే కాపాడడానికి సెక్యూరిటీ లేదు. తేడా వస్తే రక్షి౦చటానికి వైద్యం లేదు. ఏవీ లేని వాడు అవసరం కోసం 'హింస' వైపు వెళితే వాడి గురించి చరిత్ర లో అనాగారికుడు గా రాసుకున్న మనం అన్నీ ఉన్నా వాడికంటే లక్ష రెట్లు 'హింస' ని వాడుతూ నాగరికులం ఎలా అవుతాం?
దేశాన్ని బాగుచేయ్యాలనే సంకల్పం తో నిత్యం కష్టపడే ఎందరి లాగానో ఒక ఆసుపత్రి లో డాక్టర్ ఒక అనారోగ్య కుర్రాడికి వైద్యం చేస్తున్నాడు .. ఎప్పటికీ ఆ కుర్రాడికి జలుబు రాకూడదని, అజీర్తి చెయ్యకూడదని... ఎప్పుడూ అనారోగ్యం పాలు అవకూడదని .. కాళ్ళు.. చేతులు బాగుండాలని .. మొత్తం మీద శరీరం అంతా పెర్ఫెక్ట్ గా ఉండాలి అని నిత్యం ఏదో ఒక ఇబ్బంది తో గురయ్యే అతన్ని నెమ్మది నెమ్మదిగా బాగు చేస్తున్నాడు. కానీ ఆ కుర్రాడి లోపల దశాబ్దాలు గా కూరుకుపోయిన 'క్యాన్సర్' అనే మందు లేని రోగాన్ని ఏమీ చెయ్యాలేని డాక్టర్ నీరుగారిపోతున్నాడు. ఆ కుర్రాడు కమ్మ అయినా, కాపు అయినా, రజకుడైనా, రాజైనా, బ్రాహ్మణుడైనా, బలిజ అయినా, వైశ్యుడైనా మరే కులం వారైనా కావచ్చు. ఎన్ని విషయాల్లో అతను పెర్ఫెక్ట్ అయినా అతనికి తెలీయకుండా అతన్నీ... అతనితో పాటు సమాజాన్నీ నెమ్మది నెమ్మదిగా తినేస్తున్న ఆ మహమ్మారి పేరు క్యాన్సర్ - దాన్నే మనం ముద్దుగా 'కుల గజ్జి' అని పిలుచుకుంటాం.