పూర్వం తెలుగ కవిత్వం దాదాపు పద్యం రూపంలోనే ఉండేది. కాని పద్యాన్ని రాయడం, చదవడం, అర్ధం చేసుకోవడం కొంత కష్టతరంగా ఉండేది. తెలుగు కవిత కొత్త ధోరణిలో ఉండాలనే బలమైన ఆకాంక్షతో చేసిన ప్రయోగ ఆవిష్కరణే ఈ వచన కవిత్వం. ఈ వచన కవిత్వంలో కవికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో యతి ప్రాస, చంధస్సు మొదలైనవేవి ఉపయోగించనవసరం లేదు. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు "చందో బందోబస్తులన్నీ ఈ వచన కవిత తెంచింది". ఇంతటి స్వేచ్ఛాయుత తెలుగు వచన కవిత్వానికి పితామహుడు మన కుందుర్తి ఆంజనేయులు గారు.
కుందుర్తి ఆంజనేయులు గారు గుంటూరు జిల్లా 1922లో ఇదే రోజు జన్మించారు. తెలుగు సాహితీ ఘన చరిత్రలో గొప్పకవులుగా నిలిచిపోయిన కవుల దగ్గర కుందుర్తి గారికి శిష్యరికం చేసే అదృష్టం వరించింది. చిన్నతనంలో గుర్రం జాషువా గారు ఈయనకు తెలుగు మాష్టారు. ఆ తర్వాత కాలేజి రోజులలో విశ్వనాథ సత్యనారయణ గారి దగ్గర కూడా శిష్యరికం చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే తనకెంతో ఇష్టమైన రచనలు చేశారు. వీరోచితంగా సాగిన భారత స్వాతంత్ర పోరాట సమయంలో ఎన్నో గొప్ప రచనలు చేసి ఉద్యమ స్పూర్తిని రగిలించారు. సౌప్తికం, రసధుని, అమావాస్య, నా ప్రేయసి, నయాగరా, తెలంగాణ, దండియాత్ర, ఆశ, నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండా, బతుకు మాట లాంటి ఎన్నో రచనలు చేసి కేంద్ర సాహిత్య అకాడెమి, రాష్ట్ర సాహిత్య అకాడెమి, సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారం లాంటి ప్రతిష్టాత్మక అవార్ఢులు అందుకున్నారు.
కుందుర్తి వారి ప్రతిభను తెలుసుకునేందుకు మచ్చుకు కొన్ని..
తినేది తక్కువా తీసి పారేసేది ఎక్కువ సీతాఫలం పండులా ఉంది నా దేశం.!
పూర్వం ఒకనాడు ఒక రాజు యింకోరాజును దండెత్తి ఓడించాడు ఓడినరాజు వారసులు విజేత రాజును బలిగొని అతని రాజ్యం ఆక్రమించాడు రాను రాను కొన్నాళ్లకు వారు రాజులయ్యారు ప్రజలు బానిసలయ్యారు..
అంతగా బుద్దుడిని పూజించడం మానేసి అనుసరిద్దాం ఆయన బోధనలు అహింసతో, సత్యంతో పరిష్కరిద్దాం మన బాధలు.!
నా ఊహలో కవితకు శరీరం ప్రజల వాడుక భాష దాని ఆత్మ వారి అభ్యున్నతి..
కత్తికి మేధస్సులు లొంగీ నెత్తురుటేరులు పొంగీ చరిత్రలో కనని వినని యెరుగని నరబలి జరుగుతోంది! మానవ మర్యాదలు మరచిన మా నరజాతికి చైతన్యం కలిగించను చిందిన క్షీరాంబుధిలా శివ సాయం నటనంలా చక చక చక చక నడిచే విప్లవ సైన్యం జయిస్తుంది జయిస్తుంది.!
సిరిలో పొర్లాడిన శ్రీమంతులకూ ఆకలితో మోకరిల్లిన అసువులు విడిచిన దిక్కులేని దీనులకూ చోటులేని లోకాన్నే విప్లవ సైన్యం కోరింది గతకాలపు మతాలకూ శృతి కలవని కులాలకూ తరతరాలు పీడించిన పరిపాలన పద్ధతికీ వీలులేని లోకాన్నే విప్లవ సైన్యం చూసింది.!
చాలీ చాలని కూలి జీవనం కండల తరుగూ మండే ప్రేవులు తెలియని అజ్ఞానంలో చిమ్నీదీపం చీకటిలో నిరాశలో నిద్రించిన జీవులు! మనిషిని మనిషీ, జాతిని జాతీ దోచుకున్న పురాతన గాథలవి!
నిజం జయిస్తుంది, ధర్మం జయిస్తుంది తెలుగు జయిస్తుంది. ఈ నేల ఎవరిది? కోటి ప్రజల సొత్తు కదా కొందరు వద్దంటే ఒప్పుకోని చరిత్రా! ముందుకు పదా!
పెరుమాళ్ళు సాగిపోతున్నాడు పెదకాపు యింటరుగు మీద పేకాడుకుంటూ కూచున్న కొందరు పెద్దలు గొణుక్కున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చిన పక్షులు కొన్ని పెరుమాళ్ళు పెద్దేరు దాటే దాకా సాగనంపి వచ్చాయి అక్కడికి ఎదురుగా వచ్చి చరిత్ర హరిజన యోధుడికి స్వాగతం పలికింది.!
ప్రజలకు సిద్ధాంతాలుండవు ఆదర్శమే ఉంటుంది, అది జరిగి తీరాలి పట్టుదల ఉంటుంది కాని పదిమంది త్రోవలు త్యాగం ఉంటుంది, కాని అది నడిచేదారి దొరకాలి. విద్యుత్తు వంటి చైతన్యం ఉంటుంది గాని వాడుకునే నాథుడుండాలి. వారికి సిద్ధాంతాల చర్చలేదు ఏ మార్గమైనా ఇష్టమే గమ్యం చేర్చేదిగా ఉండాలి.!
విడి విడిగా జల బిందువులు అన్నీ కలిసి సముద్రమై ఉప్పెనలా ప్రభుత్వాన్ని ముంచేసినై!
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.