సాధారణంగా చిన్నపిల్లలు ఏ వయసులో నుండి మాట్లాడడం మొదలు పెడతారండి..? ఒక రెండు సంవత్సరాలు, లేదంటే మూడు సంవత్సరాలు అంతే కదా.. చిన్నారి ఖుషి ఏ వయసులో నుండి మాట్లాడడం మొదలుపెట్టిందో తెలుసా 9 నెలల నుండే. తల్లి గర్భంలో 9నెలలో తన శరీరాన్ని నిర్మించుకుంటే, ప్రకృతమ్మ ఒడిలో 9 నెలలలోనే మాట్లాడడం మొదలుపెట్టి, రెండు సంవత్సరాలలోనే 9 రికార్డులు గెలుచుకుని కన్నతల్లి నుండి భారతదేశమంతటా ఎంతోమందిని ఆశ్చర్యానికిలోను చేసింది ఖుషి..
శ్లోకాలే లాలిపాటలు: అమ్మ సుదతి ఫార్మాలో పి.హెచ్.డి పూర్తిచేసి(ఆరుసార్లు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.) మంచిర్యాలలో పల్లవి మోడల్ స్కూల్ నడిపిస్తున్నారు, నాన్న గిరిష్ గారు ఎం.ఫార్మసి పూర్తిచేసి మంచిర్యాలలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ స్థాపించి మేనేజ్ చేస్తున్నారు. స్వతహాగ అమ్మనాన్నలు ఉన్నత చదువులు చదివినవారవడంతో ఖుషీకి ఆర్ధికంగా మాత్రమే కాదు మేధోసంపద పరంగా ఏలోటు లేకుండా పెరిగింది. నానమ్మ కళావతి, తాతయ్య వెంకటేశ్వర రావు గార్లు కూడా మన సంస్కృతిని ఖుషీకి వారసత్వంగా అందించడానికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఏ సినిమా పాటలో కాకుండా సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు వినిపించడం అలవాటు చేయడంతో ఆ శ్లోకాలు అమ్మ పాడి వినిపిస్తే తప్ప ఖుషి నిద్రపోయేది కాదట. 9 నెలల నుండి మాట్లాడడం మాత్రమే కాదు ఒక వస్తువు చూపించి దీని పేరు ఇది అని చెబితే వారం తరువాత ఐనా సరే ఆ వస్తువును గుర్తుపట్టి దాని పేరును చెప్పగలిగేంత మెమరీ పవర్ కూడా అంత లేత వయసులో నుండే ఖుషీ అందుకుంది.
రికార్డ్ ఎందుకు సాధించకూడదు.? ప్రతి మనిషిలోనూ మిగిలిన వారెవ్వరిలోను లేని ఒక గొప్ప ప్రతిభ దాగి ఉంటుంది.. దానిని తెలుసుకుని మరింత పదునుపెడితే ప్రపంచమంతా మనల్ని కీర్తిస్తుంది. ఖుషి తల్లిదండ్రులు కూడా ఖుషిలోని ఇంతటి అద్భుతమైన ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించి ఖుషీకి ఇష్టమైన రీతిలో ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టారు. ఇంకేముంది అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి.. 20 సంస్కృత శ్లోకాలు, తెలుగు, ఇంగ్లీష్, హిందిలోని 50 రైమ్స్,1,000 వస్తువుల పేర్లు, పజిల్స్ కేవలం రెండు సంవత్సరాల వయసులోనే అనర్గలంగా చెప్పి Wonder book of records, Genius book of records, Universal record forum, Amazing kids, Golden star book of records, Bharath book of record, Telangana book of record, Telugu book of record, Nipuna record ఈ తొమ్మిది రికార్డ్స్ అందుకుని వీటితోపాటు రాధమయూరి ఎక్సెలెన్స్ అవార్డ్ 2016, ప్రతిభ పురస్కార్ 2017 అతిచిన్న వయసులోనే చరిత్ర సృష్టించింది.
నిజమైన విజేతలు ఒక్క విజయంతోనే ఆగిపోరు విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంటారు. ప్రస్తుతం ఖుషి డిక్షనరీలో మూడు అక్షరాలతో ఉన్న 1600 ఇంగ్లీష్ పదాలను ఆపకుండా చెప్పి ఆ రికార్డ్ ను అందుకునే లక్ష్యం వైపు దూసుకుపోతుంది.