"తనలో అసమాన శక్తి సామర్ధ్యాలున్నాయని తెలుసుకున్న ఏ స్త్రీ అణిగిమనిగి ఉండదు".
హైదరాబాద్ పద్మవ్యూహ ట్రాఫిక్ లో వెహికిల్ ను నడపాలంటే చచ్చే చావు వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లు, నేను సురక్షితంగా ఉంటే చాలు పక్క ప్రయాణికుడు ఏమై పోయినా పర్వాలేదని అనుకునే కొంతమంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇలాంటి రోడ్డు మీద ప్రతిరోజూ 10 నుండి 12 గంటలు ఆటో నడపడమంటే మామూలు విషయం కాదు, అందులోనూ ఓ మహిళ 12 సంవత్సరాలుగా అన్నిరకాలైన ఇబ్బందులపై పోరాటం చేస్తూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తుందంటే తను సామాన్యురాలు కాదు అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.
కుటుంబం కోసం:
వెన్నపూస నారాయణమ్మ గారు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం వెనుక ఏ హృదయ విధారకరమైన సంఘటనలు లేవు. బ్రతకడానికి కడప జిల్లా నుండి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత భర్త చెన్నారెడ్డి గారు ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కంపెనీలో వైండింగ్ వర్క్స్ చెయ్యడం మొదలుపెట్టారు. జీతం చాలా తక్కువ. ఇలా తక్కువ జీతంతో కొంతకాలం సాగినా గాని పిల్లలు ఎదుగుతున్నకొద్ది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి..
నారాయణమ్మ గారిది ధృడమైన మనస్తత్వం దేనికి అంతగా భయపడే తత్త్వం తనదికాదు. ఈ ఆర్ధిక పరిస్థితులను దాటాలంటే పొదుపు చెయ్యడం కన్నా సంపాదించడం ఉత్తమం అని ఆటో నేర్చుకోవడం మొదలుపెట్టారు. అందరూ ఊహించినదే వారికి ఎదురయ్యింది.. "మహిళ అయ్యుండి ఆటో నడుపుతున్నావా అని తనని, సిగ్గుందా నీకు డబ్బు సంపాదించడం చేతకాక ఇలా భార్యతో ఆటో నడిపిస్తున్నావా అని భర్త ను" ఇలా సమాజం విమర్శించింది. వారికి తెలుసు, న్యాయంగా డబ్బు సంపాదిస్తే ఎవ్వరి ముందు తల దించుకోవాల్సిన అవసరం ఉండదని..
జీవిత ప్రయాణంలో సహాచరుని అండదండలు గొప్ప శక్తిని, మానసిక ప్రశాంతతను ఇస్తాయి. భర్త చెన్నరెడ్డి గారి సహకారం మరువలేనిది. ఉదయం లేచిన మొదలు ఇద్దరూ ఇంటిపనులు సమంగా పంచుకుంటారు. ఇప్పటికీ ఖాకీ డ్రెస్ వేసుకుని ఆటో నడుపుతున్న నారాయణమ్మ గారిని ఆశ్చర్యంతో చూస్తుంటారు. తోటి ఆటో డ్రైవర్లతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కున్నా గాని అవి నారాయణమ్మ గారికి చాలా చిన్న చిన్న సమస్యలు.
పిల్లల చదువులు:
సంవత్సరాల కృషి ఫలితంగా బాచుపల్లిలోనే తమ కలల ఇంటిని నిర్మించుకున్నారు. బ్రతుకు పోరాటంలోనే కాదు పిల్లల భవిషత్తును తీర్చిదిద్దడం లోనూ నారాయణమ్మ గారు విజయం సాధించారు. అబ్బాయి మానిష్ హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు, అమ్మాయి మౌనిక బీ ఫార్మసీ పూర్తిచేసి ప్రస్తుతం ఎం ఫార్మసీ చదువుతున్నారు.
సేవాతత్త్వం:
ఒకానొక సమయంలో నారాయణమ్మ గారు కష్టాలతో సహజీవనం చేశారు కనుక తనకు వాటిమీద అవగాహన ఉంది. తన దగ్గరకు వచ్చిన కొంతమంది మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించారు. అంతే కాదండి ముసలివారికి, వికలాంగులకు, పరీక్షలు రాసే విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బంది కలుగకుండా ఉచితంగా వారి గమ్య స్థానాలకు చేరవేస్తారు. భయంతో ఎప్పుడు స్నేహం చేయకపోవడం వల్ల రోడ్డుమీద ఎవరైనా అమ్మాయిలను ఎడిపించడం చేస్తే కనుక వారికి నాలుగు చివాట్లు పెట్టి స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో..