సరైన సమయంలో నీ జీవితంలో డబ్బు సంపాదించే దారిని కనుగొనకుండా విశ్రాంతి తీసుకుంటే ఇక చచ్చేంత వరకు నువ్వు కష్టపడాల్సి ఉంటుంది. - వారెన్ బఫెట్. డబ్బుకు సంబందించి ఇది చాలా చాలా రొటీన్ లైన్ కావచ్చు కాని డబ్బు సంపాదించుదామని విపరీతంగా తపన పడేవారికి మాత్రం కాదు. "లలిత జ్యువెలరీ" అనే పేరు వినగానే బంగారం కన్నా గుండు తో కనిపిస్తున్న డా.కిరణ్ కుమార్ జైన్ గారు గుర్తుకువస్తున్నారు. ఓ సినిమా ప్రమోషన్స్, ఓ బ్రాండ్ ప్రమోషన్స్ కన్నా ఈ ఛానెల్ ఆ ఛానెల్ అన్న తేడా లేకుండా ఏ టైంలో బ్రేక్ వచ్చినా గాని మనోడు వచ్చేస్తున్నాడు. చాలామంది ఆయన మీద జోక్స్ వేస్తున్నా గాని ఈ స్థితిని చేరుకోవడానికి ఎన్నో పరిస్థితులను అదిగమించారు.
నెల్లూరు జిల్లా నుండి: వేల కోట్ల బిజినెస్ తోదూసుకుపోతున్న కిరణ్ కుమార్ మన తెలుగు వారే. నెల్లూరు జిల్లానే వారి సొంతఊరు, పుట్టింది ఒక అతి సామాన్య కుటుంబంలో. కిరణ్ కుమార్ అస్సలు చదువుకోలేదు కాని డబ్బు సంపాదించాలనే కాంక్ష మాత్రం విపరీతంగా ఉండేది. "పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, పేదరికంతో చావడం నీ తప్పు" అని బిల్ గేట్స్ చెప్పినట్టు తన జీవితాన్ని చిన్నతనం నుండే సమూలంగా మార్చేద్దామని కేవలం 11 సంవత్సరాలు కూడా నిండని వయసులోనే ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు.
లలిత జ్యువెలరి ఆయనది కాదు: "నువ్వు ఇప్పుడున్న పరిస్థితి కన్న ఉన్నతంగా ఉండాలంటే ప్రస్తుతం నువ్వు ఆచరిస్తున్న పద్దతులను మార్చాల్సి ఉంటుంది". రోజుకు కడుపునిండా భోజనం చేయడానికే ఇబ్బందిగా ఉన్న సమయంలో ఎవరి కిందో రోజువారి కూలిగా బ్రతికితే ఇక జీవితాంతం ఇంతే అని భావించి మొదట అమ్మ నాలుగు గాజులను కరిగించి బిజినెస్ చేయడం ప్రారంభించారు. మొదట తాను తయారుచేసిన నగలను చెన్నై లలిత జ్యువెలరీలో అమ్మేవారు. టాలెంట్ కు శ్రమ, మార్కెటింగ్ స్ట్రాటజీ తోడయితే ఇక తిరుగు ఉండదన్నట్టు మనోడు కాస్త తొందరగానే సక్సెస్ ను ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత తయారు చేసిన బంగారు నగలను లలిత జ్యువెలరీకే కాకుండా దక్షిణ భారతదేశంలోని అని పెద్ద సంస్థలకు అమ్మడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలకు ఎక్కడైతే మొదటిసారి వ్యాపారం మొదలుపెట్టారో అదే లలిత జ్యువెలరీని 1999లో టేక్ ఓవర్ చేశారు. ఆ తర్వాత సంస్థ ద్వారా తయారుచేసిన బంగారు నగలను దేశంలోని వివిధ షోరుమ్ లకు సప్లే చేశారు ఇలా కాదని చెప్పి ప్రస్తుతం తయారుచేసిన నగలను నేరుగా కస్టమర్స్ కే అమ్మడం మొదలుపెట్టారు.
ప్రతి నగపై 916 BIS హాల్ మార్క్ సింబల్: మిగిలిన షోరూమ్ లో కన్నా అతి తక్కువ మార్జిన్ లలిత జ్యువెలరీలో(300 -400) ఇస్తుండడం, దానితో పాటు భారతదేశం గుర్తించిన హాల్ మార్క్ సింబల్ ఉండడంతో అటు నమ్మకం, ఇటు తక్కువ ధరతో సరైన మార్కెటింగ్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు.
100కోట్ల పబ్లిసిటీ: 750కోట్లతో తెలుగు మార్కెట్ లోకి వచ్చేసిన లలిత జ్యువెలరీ పబ్లిసిటీ కోసం దాదాపు100కోట్ల ఖర్చుచేస్తున్నది. బహుశా భారతదేశంలోనే జ్యువెలరీ రంగంలో ఈ స్థాయిలో ఖర్చుపెట్టడం ఇదే మొదటిసారి కావచ్చు.
తానే బ్రాండ్ అంబాసిడర్: వేల కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న లలిత జ్యువెలరీకి ఏ స్టార్ నో బ్రాండ్ అంబాసిడీర్ గా తీసుకోవచ్చు కాని ఇలాంటి వ్యాపారంలో నమ్మకం చాలా ముఖ్యం. మిగిలిన స్టార్స్ కు నెగిటీవ్ ఫాన్స్ ఉండే అవకాశం ఉంది, ఇంకా స్టార్స్ కు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలి అదే పబ్లిసిటీకి ఖర్చుపెట్టుకోవచ్చు. అది కాక స్టార్స్ మాట్లాడేది కూడా తనే రాసివ్వాలి(వారికి అవగాహన తక్కువ ఉంటుంది) ఇలాంటి రకరకాల కారణాల వల్ల తనే తన సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సక్సెస్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు.