Contributed By Hari Krishna G
పల్లెటూళ్ళ నుండి ఉద్యోగాలని, వ్యాపారాలని, చదువులని, పనులని వచ్చి వేరు వేరు పట్టణాలలో స్థిరపడిన అందరికి మా ఈ చిన్న విన్నపం. ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు మన ఊరికి ఏదో ఒకటి చేయాలని అనుకుని ఉంటారు. కాని ఏదో వెనుకకు లాగేస్తుంటుంది, జీవితమో, జీతమో. మీలో ఉన్న ఆ ఏదోఒకటి చేయాలని ఆలోచనను మరొక్కసారి గుర్తుచేయడానికి మా ఈ చిన్ని ప్రయత్నం. పల్లెటూళ్ళు ప్రశాంతతకు పుట్టినిల్లు. కాలుష్యం లేకుండా శుభ్రంగా ఉంటే బాగుంటుంది కదా, లేకపోతే పట్టణాలకు మనకు తేడా లేకుండా ఉంటుంది. వీలైనన్ని చెట్లు ఉండేలా చూసుకోవాలి. పూరి గుడిసెలలో ఉన్న గొప్పతనం, ఉమ్మడి కుటుంబాలలో ఉన్న ఆప్యాయతలు మీ తరంతోనే ఆగిపోకుండా మాకు కూడా పంచండి. బండ్లు వాడకుండా అందరిని నడిచేలా చేయాలి. మహా ఐతే సైకిల్ వాడేలా చూడాలి. ఆ విధముగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మురుగు కాల్వలు సక్రమంగా ఉండేలా చూడాలి. అరుగులు నిర్మించాలి. ఊరిలో పుట్టిన ప్రతి ఒక్కరిని సంవత్సరానికి ఒక్కసారైనా ఊరికి వచ్చేలా చూడాలి.
ఒక్కసారి ఊరితో అనుబంధం ఉన్న ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, హెల్త్ ఉద్యోగులు, కరెంట్ పని వాళ్ళు మరియు వీఆర్ఓలను పిలవాలి. ఊరిలో చదువుకుని గొప్పవాళ్ళు అయిన వాళ్ళను సన్మానించాలి. అందరూ వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయో వారి పిల్లలకు చూపించాలి. దేవాలయాలు, మసీద్, చర్చిలను బాగుచేయాలి. వీలైతే ఒక సినిమా హాల్ ను నిర్మించాలి. అన్ని మంచి సినిమాలే వేయాలి. కుదిరితే కొత్త సాంకేతిక పరమైన వీడియోలు సినిమా హాల్ లో వేసి అందరిని విద్యావంతులను చేయాలి. పాత ఆచారాలు కట్టుబాట్లు, సామెతలు, శుభాలకు, అశుభాలకు చేయాల్సిన తంతులు పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పాలి. ఈ కార్యాలన్నీటికి అక్షరరూప మిచ్చి పుస్తకాలలో పొందుపరచాలి. ఒక గ్రంధాలయాన్ని ఏర్పాటుచేయాలి. ఊరి చరిత్రని గురించి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళ దగ్గరి నుండి సేకరించి పుస్తకాలలో పొందుపరచాలి. ఊరికి నీటి కష్టాలు ఎలా తీరుతాయో అందరిని సమావేశ పరిచి అడగాలి. సలహాలు సూచనలు తీసుకోవాలి పాటించాలి.
కరెంటు వైర్లు, స్తంభాలు సక్రమంగా ఉండేలా చూడాలి. వీది దీపాలు ఉండేలా చూడాలి. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా ఎలా ఖర్చుపెడుతున్నారో బోర్ఢు మీద రాస్తూ ఉండాలి. వ్యవసాయంతోనే మనం అభివృద్ధి సాధించవచ్చని ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ముసలి వాళ్ళకు పిల్లలు దూరంగా ఉన్నారనే భావన కలుగకుండా ఉండేలా కనీసం రెండువారాలకు ఒకసారి వచ్చిపోతూ ఉండాలి. తిరునాళ్ళు, సందళ్ళు, ఎడ్ల పందాలు, సంక్రాంతి పాత వైభవం మాకు రుచి చూపించండి. మీరు ప్రయాణం చేయండి నేర్పిస్తామని మీకు హమీ ఇస్తాం. వాటిని మా ముందు తరాలకు నేర్పిస్తామని, వాటిని చంపేయమని రండి.. ఊరు పిలుస్తుంది. వచ్చి మీ చిన్నపాటి జ్ఞాపకాలు, చిలిపి పనులు, ఊరిలో జరిగే విశేషాలు గుర్తుచేసుకోండి. మీ అనుభవాలే మాకు పాఠాలు. మీ అనుభవాలు మాతో పంచుకోండి. మంచి ఏంటో, చెడు ఏంటో నేర్పండి. మీరు ఊరికి దూరంగా ఉంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పుడు గొప్పవాళ్ళయ్యారు.
ఆ కష్టాల నుండి కనీసం మూడురోజులైనా మిమ్మల్ని దూరం చేయడానికి మీ బాబాయిలు, మామయ్యలు, పెద్దనాన్నలు, అత్తలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అమ్మమ్మ, తాతయ్య ఎదురుచూస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కాస్తంత ప్రేమ పొందండి. నీళ్ళు లేక పంటలు లేక ఉసూరుమంటున్న మీ ఊరిలో ఉంటున్న స్నేహితులకు, బందువులకు కాస్త ధ్యైర్యాన్నివ్వండి. మీ పలకరింపు వాళ్ళని సంతోషపెడుతుంది. మా ఊరి వాళ్ళు ఫలానా అని మాకు తెలిస్తే ఈ బంధాలు, భాందవ్యాలు, పలుకరింపులు కలకాలం ఉంటాయి. మన ఊరిలో చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారని విన్నాం. కాని వాళ్ళని ఏ పెళ్ళిలో కార్యాలలో చూస్తాం గాని ఎవరు ఏం చేస్తారో పూర్తిగా తెలియదు. ఊరికి వస్తే ఏముంటుంది బోర్ అని మీరు అనొచ్చు. మీరు రండి.. వచ్చి మీ అందరు మాట్లాడుకోండి, ఏదైనా నాటకం వేస్తారో, ఇంకేమైనా సందడి చేస్తారో చేయండి. పరిచయాలు పెంచుకోండి, ఇప్పుడు కాకపోతే వచ్చే సంక్రాంతికి అయినా ఏదో ఒక ఆలోచన అమలవుతుంది.
ఈ సంక్రాంతితో మొదలు పెట్టి మన ఊరితో మీకున్న ఆప్యాయతతో బలపరుచుకోండి. ఇందులో మిమ్మల్ని ఏమి చేయమని అడగడం లేదు. అడిగేది ఒక్కటే.. మీరు ఊరికి రండి, వస్తూ ఉండండి మీకు ఉన్న మమకారంతో మీరే ఏదో ఒకరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. మీరు శ్రీకారం చుడుతున్న మొదటి మంచి పని ఈ సంక్రాంతికి ఊరికి రావడం.. వచ్చి ఊరిని కళకళ లాడేలా చేస్తారని ఆశిస్తూ.. ఇట్లు
మీ ఊరి పిల్లలు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.