(Contributed by విక్రం బొల్లం)
కోయిలది పాట అంటారు, కాకిది కాదు! సింహంది గర్జన అంటారు, కుక్కది కాదు!
మానవుడిది ఒక వింత ప్రవర్తన, వాడి శ్రేయోభిలాషులని, వాడికి సహాయం చేసినవారిని విస్మరించి, ఐశ్వర్యము గలవారి వైపు, సొగసైన శరీర దార్యం ఉన్నవారి వైపు, చురుకైన వారి వైపు ఆకర్షించబడతాడు. కాని దురదృష్టం, ఆకర్షణకి వడి ఎక్కువ, ఆయుష్షు తక్కువ. వాడు ఈ నిజాన్ని తెలుసుకునేలోపే, వాడి శ్రేయస్సు కోరినవారు, వాడికి సహాయం చేసినవారు దూరం అవుతారు.
అందుకే బయట రూపుకి ఆకర్షి౦పబడకుండా, నిర్మలమైన మనస్సుతో నిన్ను హక్కున చేర్చుకునే వారిని పట్టుకో. నీ మనోద్వేగాన్ని కనబరిచే కన్నీరు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది కానీ, వీరు మాత్రం నిన్ను ఎప్పటకీ వదలరు.
కోయిలది పాటే కావొచ్చు, కానీ నీ పిత్రుదేవతలకు పిండప్రదానం చేసే రోజు, కాకులే నీకు సహాయం చేస్తాయి, వారి ఆత్మకి శాంతిని చేకూర్చేందుకు సహాయం చేస్తాయి. సింహంది గర్జనే కావొచ్చు, కుక్కలే నీకు రక్షణ కల్పిస్తాయి, ఒక్క ముద్ద పెడితే జీవితాంతం నీకింద బానిసలా పడుంటాయి.
కోయిలలకు, సింహాలకు జోహార్లు కొట్టడం మానేసి, నీ మంచి కోరే కాకుల్ని, కోకిలలా మార్చేందుకు ప్రయత్నించు, నీ తోడుండే కుక్కలకి, సింహంలా గర్జించడం నేర్పించు. సహాయం చేసినవారిని ఎప్పటికీ మరవకు.
గుర్తుంచుకోవడమే కాదు, బంగారు సింహాసనంవేసి కూర్చోపెట్టడం కూడా, నీ బాద్యతే. ఈ గుణమే అక్షయం! ఈ సుగుణమే శాశ్వతం!