హైదరాబాద్ జైన్ పబ్లిక్ స్కూల్ వారు ప్రతి సంవత్సరం పిల్లలను Excursion తీసుకువెళ్తూ ఉంటారు. ఐతే ఈసారి అక్కడికి ఇక్కడికి వద్దు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెల్దామని మౌంటైనీర్ జాహ్నవి గారు సజెస్ట్ చేశారు.. అందులో భాగంగా 6 నుండి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు ఫిట్ నెస్ టెస్ట్ పెట్టారు. ఇందులో 8వ తరగతి చదువుతున్న హసిత సెలెక్ట్ అయ్యింది. ఇంత చిన్న వయసులో ఒక్కదాన్ని పంపించడం వద్దని అమ్మ లావణ్య గారు కూడా వెళ్ళడానికి ఎన్ రోల్ చేసుకున్నారు. రేపే ప్రయాణం ఇంట్లో అంతా హడావిడి.. ఇదే సమయంలో దాదాపు 7 సంవత్సరాల వయసులో ఉన్న సమన్యు కూడా వస్తానని అల్లరి మొదలు పెట్టాడు. ఎదో చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు అది ఇది అనుకున్నారు కానీ అదే బాబు రేప్పొద్దున ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటాడని కలలో కూడా ఊహించి ఉండరు.
ఫిట్ నెస్ ట్రైనింగ్ అంటే మాటలా.! సరే రా! రేప్పొద్దున 4 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది నువ్వు ఆ టైం వరకు రెడీగా ఉండాలి!! అని అమ్మ ఏడుస్తున్న సమన్యు కు చెప్పారు. (వీడు 4 గంటలకు లేవడం అస్సలు కుదరదు, బాగానే తప్పించుకున్నామని అమ్మ మనసులో అనుకున్నారు) ఉదయం లేచి చూస్తే అందరి కన్నా ముందే లేచి చకచకా రెడీ అయ్యి సమన్యు సిద్ధంగా ఉన్నాడు. ఇక చేసేదేమీ లేక సమన్యు ని తీసుకెళ్లారు. ట్రైనింగ్ ప్రారంభమైన మొదటి రోజు కూడా ట్రైనర్స్ చెబుతున్నట్టుగా అన్ని వర్కౌట్స్ చురుకుగా చేసుకుంటూ పోతున్నాడు. ఆ.. ఎదో ఆట లాగా అనుకుంటున్నాడు, ఒక్కరోజు ఇలా ఉంటాడు లే.. అని అనుకున్నారందరు. రెండో రోజు, మూడో రోజు, నాలుగైదు.. ప్రతిరోజూ ఇంతే చురుకుగా పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మ , ట్రైనర్స్ ఒక నిర్ణయానికి వచ్చి పూర్తి స్థాయి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు.
పర్వతాలు ఎక్కడం మామూలు విషయం కాదు దానికంటూ ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి లేదంటే అత్యంత ప్రమాదకరం. మూడు నెలల ట్రైనింగ్ లో చిన్ని సామాన్యు పరేడ్ గ్రౌండ్స్ లో lungs కెపాసిటీ పెంచే workouts, breathing exercise, Running, భువనగిరి కొండ ఎక్కడం దిగడం, అలాగే అనంతగిరి హిల్స్ అడవిలో కొన్ని రోజులు గడపడం ఇలా మొదలైన ట్రైనింగ్ తీసుకుని ప్రపంచంలో చిన్న వయసులోనే ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహించిన జాబితాలో చేరుకున్నాడు.
ట్రైనర్స్ కూడా భయపడ్డారు: ఎవరెస్టు బేస్ క్యాంప్ తర్వాత సమన్యు చూపు కిలిమంజారో పై పడింది. ట్రైనర్ భరత్ గారిని అడిగితే "చాలా చిన్న పిల్లోడండి" ఈ వయసులో వద్దనే అన్నారు. సమన్యు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. "ముందు మీరు టెస్ట్ పెట్టండి నేను ఓడిపోతే మీరు చెప్పినట్టిగానే వింటానని" అన్నాడు. భరత్ గారు కూడా రకరకాల టెస్ట్ పెట్టాక "సమన్యు చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడని తెలిసింది". అనుకున్నట్టుగానే అతి చిన్న వయసులోనే కిలిమంజారో తన లేత పాదాల కిందికి తీసుకువచ్చాడు, అలాగే నిండా పది సంవత్సరాలు నిండకుండానే ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసి యాస్కో, రష్యా లోని ఎలబ్రస్ ను కూడా అధిరోహించి చరిత్ర సృష్టించాడు.
నేను ఈ బాబుని కలవాలి: రాష్ట్రపతి కొంతకాలం క్రితం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారు హైదరాబాద్ కు వచ్చారు. ఓ న్యూస్ పేపర్ వారు సమన్యు గురించిన ఆర్టికల్ పబ్లిష్ చేశారు, ఆర్టికల్ చదివి ఆశ్ఛర్యానికి లోనయిన రాష్ట్రపతి గారు వెంటనే సమన్యుని పిలిపించుని అభినందించారు, అలాగే ప్రతి సంవత్సరం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందించే బాల్ శక్తి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
పిల్లలకు నచ్చే పనులకు మొదటగా అడ్డు తగిలేది తల్లిదండ్రులు. వారి శక్తికి చిన్నతనంలోనే సరిహద్దులను నిర్ణయిస్తున్నారు. ఒక్కోసారి అందులో జాగ్రత్త ఉండొచ్చు కానీ చాలాసార్లు అది ఒక భయంగా, జైలుగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. లావణ్య గారు కృష్ణకాంత్ గారు మాత్రం జాగ్రత్తలు చెబుతూనే స్వేచ్ఛ నివ్వడంతో ఈరోజు సమన్యు ఇంత స్థాయికి అతి చిన్న వయసులోనే ఎదిగాడు.. లావణ్య గారైతే ఏకంగా తన బ్యాంక్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి పూర్తిగా పిల్లల భవిష్యత్తుకై అంకిత మయ్యారు. సంఘం గర్వపడే తల్లిదండ్రులు వీరు, సమన్యు సాధించిన విజయంలో అర్ధభాగం వీరిదే.