Contributed by N.V. Chaitanya sai
కొన్ని నెలలుగా ఎదురుచూపులు, తొలిసారి కలవడం కోసం!! విశ్వం కూడా ఎదురు చూసిందేమో, ఈ సమయం కోసం!! అనుకోకుండానే ఎదురు వచ్చిన సందర్భం, ప్రపంచం కూడా ప్రణాళిక రచించిందేమో... ఇదేనేమో విధి అంటే. మొదటిసారి జరిగేదేగా అద్భుతం అంటే...

కేవలం కొన్ని గంటల్లోనే, కరిగింది కాలం, నా కల నిజమైన క్షణం!! ఎన్నో మాటలు, ఎన్నో ఊసులు, కాలానికి అందని భావాలు...కలగలిపిన భావోద్వేగాలు... వీటన్నిటి మధ్యలో, కొన్ని క్షణాల మౌనం. ఆ మౌనం కూడా మనసారా ఆనందించి ఉంటుంది, మన మధ్యకి చేరుకున్నందుకు.

ఒకే దిశగా పడుతున్న అడుగులు, కొన్ని వేల ఆలోచనలు. వీటన్నిటినీ దాటి, నీ మొదటి స్పర్శ నన్ను తాకుతూనే... నా మనసు మౌనానికి బానిసైంది, రెండు క్షణాలు... నా పెదవులు, పలుకులు మరచిపోయాయి. నీ చెయ్యి పట్టుకుని నడుస్తే... ఏంత దూరమైనా తరిగిపోతుందేమో అన్న ఆలోచన!!

అరగంటలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అని అప్పటి వరకు నాకు తెలియదు.

తొలి పరిచయం ఏంత అద్భుతంగా ఉంటుందో... తొలి వీడ్కోలు కూడా అంతే భారంగా ఉంటుంది.

నా అడుగులు వెనకకు పడే సమయంలో నీ కౌగిలి, ప్రపంచంలో ఇంతకంటే ప్రశాంతమైనది ఏమైనా ఉంటుందా అనే భావన!!

వెళ్ళక తప్పదు, దూరాన్ని కూడా తగ్గించే ప్రేమ ముందు, ఆ దూరం కూడా తల దించుకుంటుంది అనే నమ్మకంతో... తొలి వీడ్కోలు.
