ఒక పువ్వు ఎన్నో జ్ఞాపకాలను అందిస్తుంది, అది ప్రేమించిన వారికిచ్చినా, ఆత్మీయుల పుట్టిన రోజు, పెళ్లి రోజు నాడు అందించినా కాని అది కొన్ని రోజులకు వాడిపోతుందనంటేనే మనసుకు కాస్త బాధగా ఉంటుంది. ఇక నుండి ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవచ్చు. పువ్వులోని పరిమళం వెళ్ళిపోతుందేమో కాని ఆ పువ్వులు వాడిపోకుండా ఉండేందుకు మన హైదరాబాద్ కు చెందిన ప్రొఫేసర్ మహాలక్ష్మి గారు ఏళ్ళ తరబడి పరిశోధనలు చేసి ఒక అద్భుతమైన యంత్రాన్ని కనుగొన్నారు..
ఎప్పటిలానే ఉండాలి: దాదాపు 36 సంవత్సరాలపాటు సైంటిస్ట్ గా, ప్రొఫెసర్ గా జయశంఖర్ యూనివర్సిటీ లో బాధ్యతలు నిర్వహించిన మహాలక్ష్మి గారికి ఎన్నో సంవత్సరాల పాటు ఇదే ఆలోచన తొలుస్తూ ఉండేది. కాని ప్రొఫెసర్ గా పనులు నిర్వహించడంలో బిజీగా ఉండడం వల్ల అంతగా దాని మీద పూర్తిగా దృష్టి పెట్టలేక పోయారు. రిటర్మెంట్ తర్వాత పూర్తి సమయం వెచ్చించడంతో ఈ కల సాకారమయ్యింది.
ఎలా పనిచేస్తుంది: దీనికోసం ఎన్ని సంవత్సరాలు శ్రమించారో తెలుసా..? అక్షరాల 20 సంవత్సరాలు. లాయోఫిలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పూలను మైనస్ 30డిగ్రీలో ఉంచి వాటిలో ఉన్న తేమను వేరుచేస్తారు. ఆ తర్వాత ముందుగానే తయారుచేసిన కెమికల్స్ ను వాటిపై అద్దుతారు. ఈ లాయోఫిలైజేషన్ లో పూలను సుమారు 8 రోజుల వరకు ఉంచుతారు. ఈ ప్రక్రియ మూలంగా కొన్ని సంవత్సరాల పాటు అలాగే పువ్వులు అందంగా కనిపిస్తాయి.
ఈ పద్దతి మంచి సక్సెస్ అవ్వడంతో అన్ని రకాల పూలను(వినియోగదారులు తెచ్చినవి, లేదా వారి పూలను) ప్రిజర్వ్ చేసి అమ్మకాలు సాగించడమే కాదు ఎంతో మందికి ఉద్యోగాలను అందిస్తున్నారు. మొదట ఈ పద్దతి గురించి, 20 సంవత్సరాల పాటు కృషి చేసినందుకు ఎవరైతే చులకనగా చూశారో ఇప్పుడు వారే ఏళ్ల తటబడి పూలను భద్రపరుచుకునే ఈ పద్దతిని వినియోగించుకుంటున్నారు.