నన్ను ప్రేమించే నీకు – నీ సొంతం అయిన నేను రాయునది నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ మరో మూడ్రోజుల్లో మనిద్దరం ఒక్కటి అవ్వబోతున్నాము. జీవితాంతం నాతో కలిసి ప్రయాణం చేయబోతున్న నీకు కొన్ని ప్రమాణాలు చేద్దామని,ఈ లేఖ పంపిస్తున్నాను.ఎదురుగా ఉంటే అన్నీ చెప్పలేనేమో అని ఎదలో ఉన్న భావాలన్నీ అక్షరాలుగా మార్చి ఇలా నీ ముందు ఉంచుతున్నాను. నాతో కలిసి ఏడడుగులు వేసి నా జీవితంలోకి రాబోయే నీకు కొన్ని మాటలు చెప్పాలని ఉంది.ఏదో భావోద్వేగం మనసులో బలంగా ఉండిపోయింది.కోరి సాదించుకున్న ప్రేమ దక్కిన ఆనందమో,జీవితాంతం నీతో కలిసి సంతోషంగా ఉంటాను అనే ఊహో, ఏదో మరేదో తెలియట్లేదు కానీ,మనసులో మాత్రం చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేస్తూ ఉన్నాను.
పెళ్లి అంటేనే నమ్మకం. ఇద్దరు మనుషులు ఒకటిగా మారి పరిపూర్ణమైన జీవితాన్ని కలిసి జీవిస్తారనే నమ్మకం.ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు ఉంటూ బాధలైనా బరువులైనా కలిసి పంచుకుంటామని చేసుకునే ప్రమాణం.రేపు పెళ్ళిలో పంచ భూతాల సాక్షిగా మనం చేసుకోబోయే ప్రమాణం ఇదే. ఆ శ్లోకాలు,వాటి అర్ధాలు నాకంతగా తెలియవు కానీ,నా మాటల్లో కొన్ని చెప్పాలానే ఈ లేఖ,
I Don’t want to be your something special మైథిలి.నేను నీ జీవితంలో ప్రత్యేక స్థానం కోరుకోవట్లేదు...నీ జీవితంలో ఒక భాగం అవ్వాలని అనుకుంటున్నా..ఉదయాన్నే నీతో కలిసి కాఫీ తాగుతూ నేనుండాలి,ఆఫీసుకి వెళ్ళగానే నీకొచ్చే మొదటి తలపుల్లో నేనుండాలి, సాయంకాలం అలసి పోయాక ఆ అలసట తీర్చేందుకు నేనుండాలి,రాత్రి నువు తినిపించే గోరుముద్దల్లో ఉండాలి,అర్దరాత్రి,దాబా మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ చెప్పుకునే కబుర్లలో నేనుండాలి.ఇలా ప్రతీ రోజూ నీ ప్రతీ చర్యలో నేనో భాగం అవ్వాలి. నీతోనే రోజు మొదలవ్వాలి,నీతోనే రోజు ముగియాలి.నేను మాటిస్తున్నాను నేనుంటానని. నీ మాటల మాటున ఉన్న భావాల్ని,నీ మౌనం మాటున అర్థాన్ని నేనవ్వాలి. ఇద్దరం ఒకరికొకరం మాట్లాడుకోకపోయినా మౌనం కూడా మధురంగా ఉందనిపించేలా ఉండాలి. నిశభ్దాన్ని అందులోని ప్రశాంతతని నీతో కలిసి ఆస్వాదించాలి.
నీ కన్నులు వెతికే చూపులు నాకోసం అవ్వాలి, నా వేదనకి దొరికే స్వాంతన నువ్వావ్వాలి, నీ పెదాల పై చిరునవ్వు నేనవ్వాలి,నీ కోపానికి కారణం నేనవ్వాలి,నీ అల్లరి నాదవ్వాలి,నీతో రోజూ గొడవ పడాలి,ఎంత గొడవైనా మళ్ళీ నిన్నే చేరాలి,మళ్ళీ సరికొత్తగా నీతో ప్రేమలో పడాలి. ఊపిరున్నంత కాలం నేనిదే చేస్తానని మాటిస్తున్నాను.
నువు ప్రపంచంతో యుద్దం చేస్తావా,నేను నీ సైన్యం అవుతాను, నువు లోకాన్ని జాయిస్తావా నేను నీ ధైర్యం అవుతాను, ఆకాశానికి ఎగురుతావా ఆ రెక్కల్ని నేనవుతాను. నీకిచ్చే స్వేచ్చని నేనే....తిరిగొచ్చే ప్రేమని నేనే అవ్వాలి. నీకేదీ లోటు లేకుండా చూడాలి,నిను చూస్తూనే జీవితాంతం గడిపేయాలి. నా పుస్తకానికి పరిచయం నువ్వావాలి,నా జీవితానికి సంతకం నేనవ్వాలి. మాటిస్తున్నాను.నేనుంటాను నీవెంటే...నేనుంటాను నువ్వుంటేనే.
ఎప్పుడో చెప్పాల్సినవి ....ఎప్పుడూ చెప్పనివి ...ఇప్పుడు ఇలా చెబుతున్నా..నా జీవితంలోకి వస్తున్నందుకు,నీ జీవితాన్ని నాకిస్తున్నందుకు నేను మాటిస్తున్నా మైథిలీ...ఈ రాముడు నిన్ను అరణ్యవాసం చేయనివ్వడు,అగ్ని ప్రవేశం అవసరం రానివ్వడు,అవసరమైతే ఒక్కడే లంకనైనా,లంకాధిపతినైనా ఎదురిస్తాడు నీకోసం. ఇట్లు ఇప్పటి వరకూ రామ్ ....రేపటి నుండి మైథీలీ రామ్
To be continued..