ప్రపంచానికి ప్రేమ అనేది పెళ్ళికి ముందు చేసే టెస్ట్ డ్రైవ్ లా అయిపోయిన ఈరోజుల్లో నిజమైన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాను. అమ్మాయి అందంగా ఉంది అని ఆశగా చూసే కళ్ళు, ఆత్రంగా మీద పడిపోయే ఆకతాయిలు, ప్రేమ ను అవసరం తీర్చుకుని ఆయుధం గా వాడుకునే మనుషులు. భయమేసింది, బాధేసింది.. ఈ ప్రపంచానికి దూరం గ పారిపోవాలి అనిపించింది. కానీ ఆ పరుగుని ఆపే ప్రేమ నా ఎదురుగ వచ్చి నుంచుంది.
ఆ క్షణం నాలో నాకే, నాపై నాకే ఒక సరికొత్త అనుభూతి కలిగింది. తన పేరు అడగాలి అని ఉంది, తన వెంట నడవాలి అని ఉంది, తనతో మాట్లాడాలని ఉంది, మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను అని చెప్పాలని ఉంది. తన వైపు నడిచాను. అడుగు తడపడింది, మాటకి పదం కరువయింది. ప్రేమ అంటే ఇలా నే ఉంటుందా అని ప్రశ్న నాలో మొదలయింది. అసలిది ప్రేమ? అనే కలవరం కూడా దానికి తోడైయింది.
పదాలు పేర్చుకుని.. మాటలు కూర్చుకుని... ధైర్యం తెచ్చుకుని నా మొదటి మాట తనతో మాట్లాడాను .
"హాయ్ .. నా పేరు సమీరా" " హలో.. నేను మీరా" మీరా- సమీరా .. నాలో సగం.. కళ్ళు కళ్ళు కలిసాయి.. మాటలు - నవ్వులు పూశాయి .. ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. నా ఇష్టం తనతో చెప్పేదెలా? నాకు తనపై ఉంది ప్రేమ అని నమ్మించేదెలా? ఇద్దరు అమ్మాయిలు సహజీవనం చెయ్యటం నేరం గా చూసే ఈ ప్రపంచాన్ని ఎదురించేదెలా?
ఎన్ని ప్రశ్నలకైనా నా దగ్గర ఉన్న సమాధానం ప్రేమ.
"మీరా.. వింతగా అనిపించొచ్చు... మాట్లాడి పదినిమిషాలు కాలేదు అప్పుడే ఇలా ఎందుకు అంటుంది అనిపించొచ్చు. నాకు పిచ్చిపట్టింది అని కూడా అనుకోవచ్చు. కానీ దైర్యం చేసి చెప్తున్నాను. ఐ లవ్ యు మీరా. ఎందుకు .. ఎలా.. ఎపుడు ... ఏంటి.. ప్రశ్నలు చాలానే ఉన్నాయ్ ... వాటికి సమాధానం ఈ క్షణం నిన్ను చూస్తూ రెప్ప వాల్చటం మర్చిపోయిన నా కళ్ళకు తెలుసు, నీతో ఉన్న ఈ క్షణం ఎక్కడ దూరమైపోతుందో అని నిమిషానికి వెయ్యిసార్లు కొట్టుకుంటున్న నా గుండెకు తెలుసు. ప్రపంచం ఏమి అనుకున్న పర్లేదు నీకు ఇష్టమైతే నీతోనే ఉంటా, ఏడడుగులు వేస్తా. పెళ్ళికి, ప్రేమకి రెండు మనసులు కావాలి కానీ రెండు లింగాలు కాదు. "
" ఇద్దరు అమ్మాయిలు కలిసి ఎలా జీవిస్తారు అనే ప్రశ్న నాకు ఎప్పుడు వస్తుండేది. ఇపుడు నిన్ను చూసాక, నీ మాటలు విన్నాక ప్రేమ అనే ఒక బంధం ఎంతటి వ్యవస్థని అయినా కూల్చేగలదు అనే నమ్మకం కలిగింది. ఇంట్లో ఏమనుకుంటారో నాకు తెలీదు .. ప్రపంచం ఏమనుకున్నా అవసరం లేదు. నిజమైన ప్రేమ అని నమ్ముతున్నాను.. నీ వెన్నంటే ఉండాలి అని అనుకుంటున్నాను. సంవత్సరమంతా ప్రేమ లో ఉంటూ ప్రేమికుల రోజుకి ఒంటరి అయిపోయిన నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది. తప్పు ప్రేమది కాదు.. నాది.. నేను ప్రేమిచిన వాళ్ళదేమో."
"నా ప్రేమ నిజం.. మన కలయిక నిజం.. ఈ ప్రేమికుల రోజు నుండి మన జీవితం లో ఒక కొత్త ప్రయాణం ప్రారంభం. మనది ప్రేమే అని కోర్ట్ ఆర్డర్ లు ఇస్తే కానీ ఒప్పుకొని ప్రపంచానికి, రోమియో-జూలియట్, లైలా- మజ్ను లా కథలే ప్రేమ కథలుగా చదువుకునే వీళ్లకీ ఒక కొత్త కథ అవుదాం. "