Contributed By Surendranath P
“మన షష్ఠి పూర్తి అయ్యి రెండు రోజులు అయింది. నీకు గుర్తుందో లేదో కానీ సరిగ్గా అరవయ్యేళ్ళ క్రితం ఇదే రోజున ‘మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఈ రెండు రొజుల్లో అర్థమైందండీ’ అన్నావు”.
మీ అక్క అంటే నీకు చాల ఇష్టం కదా! మన పెళ్ళి అయ్యాక నీ మొదటి పుట్టిన రోజు అందరికంటే ముందు నేనే శుభాకంక్షలు చెప్పాలని చాలా ఎదురు చుశావు. కానీ నేను రాత్రి పన్నెండింటప్పుడు చెప్పలేదు. సరే పొద్దున నిద్ర లేచాక చెప్తానేమో అని అనుకున్నావు. కానీ నేను అప్పు డు కూడా చెప్పలేదు. ఆఫీసుకి వెళ్ళే ముందు, గుమ్మం దాటాక, ఆఖరికి బస్సు ఎక్కాక కూడా ఏదైనా మర్చిపోయి వెనక్కి వస్తానేమో అని నీ ఎదురు చూపులు, ఆ కళ్ళు ఇంకా నా ముందు మెదులుతూనే ఉన్నాయి. సాయంత్రం నేను వచ్చాక కూడా ఆ కళ్ళలో అదే ఆశ. అయినా నేను పట్టించుకోలేదు. కొంచెం సేపటికి తలుపు తట్టారు ఎవరో. తలుపు తీయగానే మీ అమ్మ, నాన్న, అన్న, అక్క, బావ. అసలే కొత్త పెళ్ళి కూతురువి మరి! ఒక్కసారిగా అమ్మ, నాన్న, ముఖ్యంగా మీ అక్క ని చూడగానే ఎగిరి గంతేసినంత పని చేశావు. ఇంకొంచెం ఆగి మా అమ్మ, నాన్న కూడా వచ్చారు. కనీసం అప్పుడైనా చెప్తానేమో అని ఎదురు చూశావు. నిద్రపోయేవాళ్ళని నిద్ర లేపొచ్చేమో కానీ, నిద్ర నటించే వాళ్ళని ఎవరూ లేపలేరన్నట్టు నేను కావాలనే ఎమీ చెప్పలేదు. సంబరాలు అయిపోయాక ఎంతో గోముగా 'మీకు గుర్తుంది కానీ అసలు గుర్తుండాల్సిన వాళ్ళకి మాత్రం గుర్తులేదు’ అని నిట్టూరుస్తుంటే ఇది మొత్తం ఆ అసలు వాళ్ళే చెశారు అని మీ అమ్మ చెప్పగానే నీ కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే ‘ఇంక ఆలస్యమవుతుంది, బయల్దేరండి!” అని అందరిని పంపించేసి కోపం, బాధ, సంతోషం, ప్రేమ నిండిన కళ్ళ నీళ్ళతో నా నుదుటి మీద నువ్వు పెట్టిన ముద్దు, ఆ శ్వాస జన్మలో మర్చిపోలేనిది”.
“ఒక సారి మనం గొడవ పడ్డాం. కానీ ఎమైందో గుర్తులేదు, వయసు అయిపోతుంది కదా! నేను చెప్పిందే చెయ్యాలని నేను, నువ్వు చెప్పిందే చెయ్యాలని నువ్వు....అసలు ఎంత గొడవ పడ్డామో! కొంచెం సేపటి తర్వాత గొడవ పూర్తి అవలేదు కానీ నీ వంట పనికి నువ్వు, స్నానానికి నేను వెళ్ళిపోయాం. నేను బయటకి వచ్చేటప్పటికి భోజనం తయారు చెశావు. ఈలోగా ‘నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చినట్టే చేద్దాం’ అని యాద్రుశ్చికంగానో మన ఒద్దికకి నిదర్శనంగానో అక్షరం పొల్లు పోకుండా ఇద్దరం అవే పలుకులు పలికాం. అప్పటి వరకూ రాజ్యమేలిన నిశ్శబ్ధం ఒక్కసారిగా మూగబోయింది. అంతా మన పకపక నవ్వులతో మెరిసిపోయింది. నాకు ఇంకా గుర్తుంది....ఆ రోజు నా మీద కోపంతో కూరలో ఉప్పు కూడా ఎక్కువ వెసేశావు. కానీ రుచి మాత్రం చాలా బాగుంది. ఎంతైనా మన ప్రేమ కదా!”
“ఇంకొక సారి నాకు జ్వరం వచ్చింది, చాలా ఎక్కువగా. దాదాపు ఇరవై రోజులు తగ్గలేదు. పిల్లల్ని స్కూలుకి పంపించి నా పక్కనే కూర్చుని మందులు వేస్తూ, ఒళ్ళు వేడెక్కకుండా తుడుస్తూ నన్ను చిన్న పిల్లాడిలా చూసుకున్నావు. ఎప్పటికి తగ్గుతుందా అని నా చెయ్యి పట్టుకుని నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఎన్నో సార్లు అలాగే నిద్రపోయేదానివి. అప్పుడు అర్థమైంది నాకు, ‘నన్ను చేసుకున్నందుకు నువ్వు కాదు అదృష్టవంతురాలివి, నీలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుడ్ని’అని మనస్పూర్తిగా అనిపించింది”. “ఎన్ని సార్లు బతిమిలాడింది మీ అమ్మ ఇంటికి రమ్మనీ! ప్రతి సారీ ఏదో ఒక సాకు చెప్పేదానివి కానీ నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళల్సివచ్చి వెళ్ళినా కానీ ఒక్క రోజుకంటే ఎక్కువ ఉండేదానివి కాదు. ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్న ప్రమోషను వచ్చిందని ఆనందంగా ఇంటికి వచ్చిన నాకు ఆ ఆనందంకంటే నీ సంతొషం చూసి ఎంత హాయిగా అనిపించిందో! ఎన్ని సార్లు కొప్పడ్డానో నీ మీద! కానీ ప్రతిసారీ నన్ను అర్థం చేసుకున్నావు తప్ప నన్ను ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అనలేదు. పళ్ళెంలో నాకు అన్నం పెట్టి, నేను తిన్న తర్వాతే తినేదానివి. నావాళ్ళందరినీ నీ కుటూంబంలా చుసుకున్నావు. నీకంటూ ఏ కోరికలు లేకుండా నా ముఖం మీద నవ్వే నీ జీవితంలా నన్ను రాజులా చూసుకున్నావు.
“నీ మెడలో మూడు ముడులు వేసే ముందు నీ చేతిలో చెయ్యి పెట్టి ఏదో చెప్పించారు. ఆ పదాలు నాకు అర్థంకాలేదు కానీ ‘ఈ క్షణం నుంచి బ్రతుకైనా చావైనా నా జీవితం మొత్తం నీతోనే’ అనుకున్నాను. కానీ, నేను మాట తప్పి రెండు రొజులు అవుతుంది!” అని తనలో తాను మాట్లాడుకుంటూ తన జ్ఞాపకాల పెళ్ళి పుస్తకాన్ని గుండెలకి హత్తుకుని నిద్రపోయాడు నాన్న. పక్క రోజు నేను నాన్న అని పిలిచిన పిలుపు ఆయన చెవి వరకే చేరాయి తప్ప వినిపించలేదని తర్వాత తెలిసింది. అప్పుడు అర్థమైంది నాన్న అమ్మని ఎంత ప్రేమించాడో! “ధర్మార్థ కామములలోన ఏనాడూ నీ నీడ ఎన్నడూ నే విడిచిపోను. ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను.”
“ప్రేమ అంటే రెండు శరీరాలు కాదు, రెండు మనసులకు జరిగె పెళ్ళి.”
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.