Contributed By N.V.Chaitanya Sai
కాఫీ, అతనికి ఎప్పటినుంచి అలవాటు అయిందో తెలియదు, రోజులో కనీసం 4 సార్లు కాఫీ ఉండాల్సిందే... ఎందుకు దాన్ని అంత ప్రేమిస్తాడో తెలియదు, కానీ అతను కాఫీ తాగేటప్పుడు చూస్తే... మనకి కూడా అనిపిస్తుంది, ఎవరినైనా ఇంతలా ప్రేమిస్తే... మన దగ్గరే ఉండిపోతారేమో అని.
ఆ రోజులో ఏమి జరిగినా...అతనికి, అతని పెదవులు తాకే ఆ కాఫీ కప్పుకి తప్ప ఎవరికీ ఏమీ తెలిసేది కాదు. కాఫీలో వచ్చిన క్రొత్త ఫ్లేవర్ లా, ఆమె అతని జీవితంలోకి వచ్చింది కాఫీ కంటే ఎక్కువగా ఆమె, అతనికి అలవాటుగా మారింది. ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమో కూడా తెలియదు. కానీ ఆమె ప్రక్కన ఉంటే...అతనికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. అతను, ఆమెను కూడా కాఫీని ఎంత ప్రేమించాడో అంతే ప్రేమించాడు, ఏమో ఇంకా ఎక్కువగానే ప్రేమించి ఉండచ్చు. అందుకేనేమో అప్పటి వరకు ఏమి జరిగినా కాఫీ దగ్గరికి వెళ్ళేవాడు, ఆమె పరిచయం అయినప్పటి నుండి ఆమె దగ్గరికి వెళ్లే వాడు.
బాధలో ఓదార్పు లాగా, ప్రేమలో వ్యసనం లాగా, దిగులులో ధైర్యం లాగా, వేదనలో వెలుగు లాగా...అతనికి ఆమె ఉండేది. ఆమెకు మాత్రం ఇంత వరకు కాఫీ రుచి కూడా తెలియదు. తాగాలని అనిపించినా తాగేది కాదు. అతని కాఫీ పిచ్చి గురించి ఆమెకు కూడా తెలుసు. అందుకే తను తాగితే, మొదటి కాఫీ అతనితోనే తాగలనుకుంది.
అతను తాగచ్చు కదా...నా కోసం ఎందుకు, అని చాలాసార్లు అడిగినా... నీకు చెప్పా కదా..."నీతోనే ఫస్ట్ తాగుతా...అని", అందుకే తాగలేదు అని అనేది. అరే, తాగచ్చు కదరా, అని బయటికి అన్నా... అతని లోపల మాత్రం, ఆమె ఆన్న మాటలకి, కాదు కాదు ఆమె "నీ కోసమే తాగలేదు" ఆన్న ఒక్క మాటకు అతనికి, బాగా అనిపించేది...చాలా బాగా అనిపించేది. ఆ మాట కోసం ఏదైనా చేయొచ్చు ఏమో అనిపించేది, అతనికి.
అలా మన కోసం ఒకరు ఉంటే చాలా బాగుంటుంది కదా!! ఇద్దరు చాలాసార్లు కలిశారు, కానీ అదేంటో...ఆమె ఉన్నప్పుడు ఎప్పుడూ...అతను కాఫీ తాగలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు అతనికి. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ప్రక్కన ఉంటే...మనకు ఇష్టమైనవి ఏవీ గుర్తుకు రావేమో!! అలా...కొద్ది రోజుల గడిచాయి, అప్పటికి గడిచిన రోజుల్లో మాటలు కొంచెం తగ్గాయి, వారు మాట్లాడుకున్న రోజుల్లాగా...వారి మధ్య దూరం కూడా పెరిగింది. ఆ దూరం అక్కడితో ఆగదు కదా...!! అలా అతను, ఆమెను మరిచిపోయాడో, లేదో తెలియదు కానీ... తనకి ఇష్టమైన కాఫీకి మాత్రం దూరమయ్యాడు.
అతను ఎవరికోసం మొదలుపెట్టాడో...తెలియదు కానీ, ఆమె కోసం వదిలేశాడు. బహుశా...ఆమెతోనే కలిసి తాగాలని అనుకున్నాడో లేక ఆమె చేతితో ఇస్తేనే తాగాలని అనుకున్నాడేమో. ఇదంతా...జరిగి అతను మళ్ళీ ప్రేమించిన తనతో కలిసి అతనికి ఇష్టమైన కాఫీ తాగుతాడా?? మళ్ళీ అతని భావాలు కాఫీ కప్పులైతే కచ్చితంగా వినలేవు, ఆమె వింటుందో లేదో మనకు తెలియదు.