శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు తన జీవిత కాలమంతా ఏ అతీంద్రియ శక్తులు ప్రదర్శించకుండా ఒక నిజమైన మనిషిగా బ్రతికి, ఒక మనిషి ఎలా బ్రతకాలో జీవించి చూపించారు.. మనదేశంలో శ్రీ రామునికి ఏ విధంగా భక్తులున్నారో ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి వారికి కుడా అంతే స్థాయిలో భక్తులున్నారు.. "జై శ్రీరామ్" ఎంత పవిత్రమైనదో, "జై హనుమాన్" అంతే పవిత్రమైనదని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం హనుమంతుడు ఇంకా ఈ భూమి మీదనే బ్రతికున్నాడని విశ్వసిస్తారు. అంతటి మహిమ, శక్తివంతుడైన హనుమంతునికున్న అతి ప్రముఖమైన దేవాలయాలలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఒకటి.




పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం గురువాయి గూడెంలో ఉన్న ఈ కోవెలకు అతి పురాతన చరిత్ర ఉంది. త్రేతాయుగంలో సీతాన్వేషనలో హనుమంతుడు శ్రీరామ దూతగా లంకకు చేరుకుంటాడు. రావణుడి సామ్రజ్యంలోని 'మధ్యుడు' అనే సైనికుడు ఆంజనేయు స్వామి వారి దివ్య మంగళ స్వరూపానికి ముగ్ధుడై అపార భక్తిని పెంచుకుంటాడు. 'రావణుడి సైనికునిగా ఉన్న తను శత్రు వ్యక్తికి వినయుడిగా ఉండడం ధర్మం కాదని' భావించి కనీసం వచ్చే జన్మలోనైన ఆంజనేయ స్వామి వారికి భక్తునిగా జన్మించాలని కోరుకుంటూ కపిల సైన్యానికి కావాలని ఎదురువెళ్ళి వీర మరణం పొందారట. ఆ తర్వాత ద్వాపరియుగంలో జన్మించారు. ఈసారి కురుపాండవ యుద్ధంలో కూడా సైనికునిగా కౌరవుల పక్షాన పోరాడాడు. అప్పుడు అర్జునుడి రధంపై ఉన్న ఆంజనేయనేయ స్వామి ఉన్న జెండాను చూసి పూర్వజన్మ గుర్తుకు వచ్చి అక్కడికక్కడే ప్రాణ త్యాగం చేశారట.



ఆ తర్వాత ప్రస్తుత కళియుగంలో మధ్యుడు మరల జన్మించి ఆంజనేయ స్వామి వారి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కాని స్వామి వారి దర్శనం కాలేదు. మధ్యుడు వృద్ధుడయ్యాడు. అతని సొంత పనులు చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఒక కోతి ఎలా వచ్చిందో కాని మధ్యుడి చేయి పట్టుకుని ఒక పండుని ఆహారంగా ఇచ్చిందట. ఆ తర్వాత ముసలివాడైన మధ్యుడికి కోతి అన్ని బాగోగులు చూసుకుంటు ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ కోతిని నిశితంగా పరిశీలిస్తే ఆ కోతి మామూలు కోతి కాదు యుగయుగాలుగా తాను ఎదురుచూస్తున్న సాక్షాత్తూ ఆంజనేయస్వామి వారే అని మధ్యుడికి అర్ధమయ్యింది..



"శ్రీరాముని పాద సేవ చేసే ఈ మహిమాన్విత చేతితో నేను సపర్యలు చేసుకున్నానా" అని విలపించాడు. అప్పుడు అంజనేయ స్వామి వారు "మధ్యుడా.. నీ కల్మషం లేని పవిత్రమైన ప్రేమే నాతో ఈ సేవలు చేయించింది, నీకు ఏ వరం కావాలో కోరుకో" అని అడిగారట అప్పుడు మధ్యుడు మీరెప్పటికి ఇక్కడే ఉండాలని వేడుకున్నాడట. అందుకు హనుమంతుడు అంగీకరించి నువ్వు మరల మద్ది చెట్టుగా జన్మిస్తావు.. నేను ఒక చేతిలో గదతో, ఇంకో చేతిలో పండుతో ప్రతిమ రూపంలో దర్శనమిస్తానని అభయమిచ్చారట. అలా స్వామి వారు స్వయంభూ గా వెలిసి భక్తుల కోరికలు తీర్చే తమ ఇలవేల్పుగా పూజలందుకుంటున్నారు.

