మధ్యతరగతి, పేద, ధనవంతులు ఇలా ఏ తేడాలున్నా ఎక్కువ మంది కోరుకునేది ఒక్కటే 'పాప వద్దు బాబే కావాలి అని".. ఇలా కోరుకోవడమనేది వారి తప్పు మాత్రమే కాదు వరకట్నం, యాసిడ్ దాడులు, మానభంగాలు, వారి ఆర్ధిక పరిస్థితులు లాంటి అనేకానేక కారణాల వల్ల కూడా ఇప్పటికి తల్లిదండ్రులు ఆడపిల్లలు పుట్టిందంటే భయపడిపోతున్నారు. శారీరకంగా దృడంగ ఉన్నా మహిళలకే అవరోధాలుంటే.. పుట్టుకతోనే నడవలేని మాధవీలతకు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు.. అంగవైకల్యం నా శరీరానికి కాని నా లక్ష్యానికి నా గుండె ధైర్యానికి కాదు అంటు ఏ ఒక్కరూ ఊహించలేని లక్ష్యానికి చేరుకుంది.

మాధవీలత పుట్టిన 7వ నెల నుండే పోలియో వ్యాదితో బాధ పడుతుంది, తనకు ఊహ తెలిసినప్పటి నుండి నడవడం లేదు.. నాన్న ఓ స్కూల్ హెడ్ మాస్టర్, తల్లి గృహిణి. ఐదుగురు సంతానంలో మాధవీలత అందరికంటే చిన్నవారు. నడవలేదు అని తనని ఇంటికి మాత్రమే పరిమితం చేయలేదు. స్కూల్ లో చేర్పించి మానసిక ఉన్నతిని అందించారు. సోదరుడు, తండ్రి ప్రతిరోజు ఆమెను స్కూల్ కి తీసుకెళ్ళి జగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవారు. ఇలా తన పాఠశాల విధ్యాభ్యాసం కొనసాగించారు. తనకున్న వైకల్యంతో కొన్ని ప్రత్యేక అవసరాల కోసం అక్కడున్న కాలేజిలలో సౌకర్యాలు లేకపోవడం మూలంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, బ్యాంక్ కోచింగ్ వంటి కోర్సులన్నీ ఇంటివద్ద నుండే పూర్తిచేసింది.

ముందుగా ఎల్.ఐ.సి లో ఉద్యోగం కోసం దరఖస్తు చేశారు.. కాని ఎల్.ఐ.సి జాబ్ అంటే తిరగాల్సి ఉంటుంది దాని కంటే మీరు టైపింగ్ నేర్చుకుంటే ఒకే దగ్గర కూర్చొని చేసుకోవచ్చు అని చెబితే కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.ఇక అప్పటినుండే బ్యాంక్ జాబ్ కోసం విపరీతంగా కృషిచేసింది.. ఉన్నత మార్కులతో ఉత్తీర్ణురాలై 15సంవత్సరాల పాటు హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి స్టాండర్డ్ బ్యాంక్ ఆద్వర్యంలో పనిచేసే బ్యాంక్ ఆఫీస్ స్కోప్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం ప్రారంభించారు.. చిన్నతనం నుండి కుర్చిలకే పరిమితం అవ్వడంతో 2007లో భయంకరమైన వెన్నునొప్పి మొదలైంది. వైద్యులను సంప్రదిస్తే అపరేషన్ చేయాలని లేదంటే సంవత్సరానికి మించి బతకలేదని చెప్పారు. కాని ఫిజియోథెరపిస్ట్ మాధవికి హైడ్రోథెరపిని సూచించారు. కఠోర శ్రమతో వెన్నునొప్పి సమస్యను అధిగమించడం మాత్రమే కాదు ఏకంగా జీవితంలో మొదటిసారి తన శరీర బరువును కాలి మీద మోపి బుడి బుడి అడుగులు వేసింది.

40 సంవత్సరాల వయసులో స్విమింగ్ నేర్చుకోవాలని అనుకున్నారు. కాని వికలాంగులకు శిక్షణ ఇచ్చెవారు లేకపోవడంతో తనకు తాను గానే స్విమ్మింగ్ నేర్చుకుంది. అదే ఉత్సాహంతో తమిళనాడు లో 'పారాలింపిక్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆఫ్ తమిళనాడు'ని స్థాపించారు. పారాలింపిక్స్ లో స్విమ్మింగ్ ను ప్రోత్సహించడం కోసం దీనిని స్థాపించారు. అలా మొదట నలుగురు స్విమ్మర్స్ తో ఉన్నా ఆ సంస్థ ఇప్పుడు 300కు పైగా స్విమ్మర్స్ తో ఏటా చాంపియన్ ట్రోఫీలను నిర్వహిస్తున్నారు. పారాలింపిక్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న మాధవి 2011లో జాతీయ స్థాయిలో మూడు బంగారు పతకాలు, 2012లో రెండు రజిత, రెండు కాంస్య పతకాలు, 2013లో ఒక రజిత, మూడు కాంస్య పతకాలు, 2014లో నాలుగు బంగారు పతకాలు, 2015లో మూడు బంగారు పతకాలు, 2016లో మాధవి ఏకంగా 4 బంగారు పతకాలను సాధించి ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరుపించింది.

కేవలం స్విమింగ్ లో మాత్రమే కాదు వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ లో కూడా తన సత్తా చాటింది మాధవి. స్విమింగ్ అంటే ఏ ఒక్కరితో సంబందం లేకుండా పాల్గొనే ఆట, కాని బాస్కెట్ బాల్ అంటే ఎప్పటికప్పుడు వ్యుహాలను రచించాలి శారీరకంగా కూడా శ్రమ అధికంగా ఉంటుంది కాని మాధవీలత ఈ రంగంలో కూడా సరైన ప్రణాళికలతో జాతీయస్థాయిలో వికలాంగులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం 'వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' అనే సంస్థను స్థాపించారు. మాధవీలత ప్రస్తుత లక్ష్యం 2020 టోక్యోలో ఒలంపిక్స్ లో మన భారతదేశం తరుపున వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ జట్టును పంపించడం.. ఇందుకోసం దేశం మొత్తం తిరుగుతు ఆ ప్రాంతాలలో ప్రత్యేక కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం వివిధ కంపెనీలు ఆర్ధిక సహయాన్ని అందిస్తున్నారు. ఇంతటి గొప్ప మహిళ మన తెలుగమ్మాయి కావడం మనకు గర్వకారణం. అవకాశాలను ఉపయోగించుకుంటే మంచిదే చాలా మంచింది.. కాని సమస్యలను, అవరోధాలనే మెట్లుగా ఉపయోగించుకుంటే మధవీలత లాంటి ఎవ్వరూ ఊహించలేనటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతాం..
