సుమారు 128 సంవత్సరాల క్రితం దంగేటి ధర్మారావు గారు సృష్టించిన ఈ హల్వాకు సామాన్యులు మాత్రమే కాదు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి లాంటి అసామాన్యులు కూడా హల్వా రుచికి దాసోహం అయ్యారు. ఆ వాతావరణంలో, అక్కడి ప్రకృతిలో ఏదో మహత్తు ఉన్నట్టు అదేంటో కొన్ని రకాల రుచులు పుట్టిన ఊరులో చేసినప్పుడే అమోఘంగా ఉంటాయి. అలా విశాఖపట్టనానికి సమీపంలోని మాడుగుల అనే ఊరిలో ఈ ప్రత్యేక హల్వా పుట్టి సంవత్సరాలు గడుస్తున్న కొద్ది రాష్ట్రాలు, దేశాలు దాటి ప్రపంచమంతటికి తన అద్వితీయమైన రుచితో భోజనప్రియులను సమ్మోహన పరుస్తున్నది.
బిజినెస్ బాగా జరగాలి, కస్టమర్స్ నీ తన షాప్ వైపుకు లాగాలి అంటే ఏదైనా కొత్త రుచిని పరిచయం చెయ్యాలనే అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీని దంగేటి ధర్మారావు గారు 1890లోనే ఊహించారు. గుమ్మడికాయ, కొబ్బరికాయ రసం, గోధుమలను మూడు రోజులు నానబెట్టి రుబ్బి దానిలో నుండి వచ్చిన పాలు, స్వచ్చమైన ఆవు పాలు, పంచదార, శ్రేష్టమైన నెయ్యి, జీడిపప్పు, బాదం ఈ పదార్ధాలన్నీటిని తగిన మోతాదులో కలిపి ఈ రుచికరమైన హల్వాను ధర్మారావు గారు మొదటిసారి తయారుచేశారు. ప్రారంభంలో ఈ హల్వాకు ప్రత్యేకంగా ఏ పేరు పెట్టలేదు. హల్వా రుచి అనిర్వచనీయంగా ఉండి పక్క ఊరి వాళ్ళు కూడా కొనుగోలు చేస్తుండడంతో అప్పటి నుండి ఈ హల్వాకు ఆ ఊరి పేరు మీదుగానే "మాడుగుల హల్వా" అని నామకరణం జరిగింది.
సక్సెస్ ఎక్కడుంటుందో దానిని అందుకోవడం కోసం మిగిలిన వారు అదే మార్గాన్ని అనుసరిస్తుంటారు. ధర్మారావు గారు సృష్టించిన ఈ హల్వాను తర్వాతి కాలంలో చాలామంది తయారుచేయడం మొదలుపెట్టారు. అలా మొదలవ్వడం వల్ల ఆ ఊరికి ప్రత్యేకంగా హల్వాను కొనుగోలు చేయడానికే చాలామంది వస్తుంటారు. ఇప్పుడు మాడుగుల హల్వాకు ప్రసిద్ధి చెందింది. మాడుగుల వెళ్ళలేని వారి కోసం అక్కడ తయారుచేసిన హల్వాను వివిధ ప్రాంతాలకు వ్యాన్ లలో తీసుకువచ్చి మరి అమ్ముతుంటారు.
దంగేటి ధర్మారావు గారి నుండి మొదలైన ఈ హల్వా ప్రస్థానం తన కుమారులు, మునిమనవడు ఇలా తర్వాతి వంశస్థులు కూడా కొనసాగిస్తున్నారు. మాడుగులలో పుట్టి ఖండాంతరాలు దాటి శతాబ్ధం పైగా రుచితో ఇంకా తయారు కాబడుతుందంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆ రుచి ఏ స్థాయిలో ఉంటుందోనని.