ఎస్.ఐ శ్రీనివాస్ గారు ఈ పాఠశాలను ఎంత నమ్మకంతో ప్రేమిస్తున్నారంటే తన కూతురు వ్రిశాలను కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించారు.. స్కూల్ రూపురేఖల్ని మార్చడం మాత్రమే కాదు తన కూతురిని కూడా ఇదే స్కూల్ లో చదివిస్తున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలండి అతని నిజాయితీని కొలవడానికి.. మనం ఎంతోమంది పోలీసులను చూస్తుంటాం కాని ఒక పోలీస్ అంటే ఎలా ఉండాలి అని మనం కొన్ని లక్షణాలు ఊహించుకుంటాం అందులో ఎక్కువ లక్షణాలున్న పోలీస్ ఆఫీసర్ కె. శ్రీనివాస్ గౌడ్ గారు.
మొదటి సమస్య.. మొదటి అభివృద్ధి: మన తెలంగాణలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్. ఈ జిల్లా వర్షపాతం పరంగా, ఉపాధి పరంగా, బాల్య వివాహాల పరంగా, అక్షరాస్యత పరంగా ఇలాంటి చాలా రంగాలలో వెనుకబడి ఉండడం వల్ల జిల్లాలో వలసలు ఎక్కువ, ప్రాణపదంగా చూసుకున్న సొంత భూములను అమ్ముకుని కూలీలుగా మారుతు వలసలు వెళ్తున్న దయనీయ ప్రాంతమిది. అలాంటి జిల్లాలో ఒక ఊరికి ఎస్.ఐ గా వచ్చిన శ్రీనివాస్ గారు చిన్నతనం నుండి సమాజాన్ని మార్చాలి, పేదరికాన్ని నిర్మూలించాలి అనే బలమైన కాంక్షతో పెరిగారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉన్నతాధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరచాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే శ్రీనివాస్ గారు అడ్డాకల్ మండలంలోని కాటవరం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో ముందుగా బాగు చేయవలసింది ఏంటని చూస్తే పాడుబడిన పాఠశాల కనిపించింది.
మొదట పాఠశాలకు వెళ్ళే మార్గం సరిగ్గా ఉండాలని మట్టిరోడ్డు వేయించారు.. ఇందుకోసం గ్రామ ప్రజలు ట్రాక్టర్ తో మట్టి రోడ్డు వెయ్యడానికి ముందుకొచ్చారు. పాఠశాలలో నీటి సదుపాయం లేకుంటే 250మీటర్ల పైప్ లైన్ ద్వారా పాఠశాల మీద వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేయించారు. శిధిలావస్థలో ఉన్న పాఠశాలను ధృడంగా ఉండేలా బాగుచేశారు. ఎడారిలా ఉండే పాఠశాల ఆవరణంలో దాదాపు 300 చెట్లు నాటించారు. ఎస్.ఐ శ్రీనివాస్ గారి అభ్యర్ధనతో ఇంకా అతని తపనను చూసి దాతలు డబ్బు, వస్తువుల రూపంలో సహాయమందిస్తే, గ్రామస్థులు శ్రమ పడడానికి ముందుకొచ్చారు.
Caring Hands Together: ఆ తర్వాత కొంతకాలం వరకు నిధుల కొరతతో పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి.. కాని రాజ్ కుమార్ గారు స్థాపించిన Caring Hands Together అనే ఆర్గనైజేషన్ వారి సహాయంతో స్కూల్ లో మరిన్ని సదుపాయాలు వచ్చాయి. పిల్లల కోసం డ్రాయింగ్ కిట్స్, డిజిటల్ లైబ్రరీ, బుక్స్ లైబ్రరీ, ఆట వస్తువులు, బ్యాగ్స్, యూనిఫార్మ్స్, ప్రోజెక్టర్ స్క్రీన్ తో పాటు స్కూల్ రూపురేకల్ని మార్చడంలో ఎస్.ఐ శ్రీనివాస్ గారితో కలిసి పనిచేసి ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు ఒక కార్పోరేట్ స్కూల్ అనేంతలా మార్చేశారు. 2016 సంవత్సరానికి ఈ పాఠశాలలో పూర్తిగా 42మంది విద్యార్ధులుంటే ఇప్పుడు ఆ సంఖ్య 87మందికి చేరుకుంది. పిల్లలను ఒక ప్రైవేట్ స్కూల్ కి పంపించడం కన్నా ఇప్పుడు తల్లిదండ్రులు ఈ పాఠశాలకే పంపించడానికి మొగ్గుచూపుతున్నారు. స్వచ్ఛ పాఠశాలగా కొంతకాలం క్రితం అవార్డు అందుకుని మిగిలిన స్కూల్స్ కి ఆదర్శంగా నిలిచారు. మొదట ఈ పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో విద్యార్ధులకు ఇబ్బంది ఉండేది కాని మరొక ఉపాధ్యాయురాలిని కేరింగ్ హాండ్స్ వారే ప్రత్యేకంగా నియమించారు.
ఇది కేవలం దాదాపు సంవత్సర కాలంలో జరిగిన మార్పులు అవును కేవలం సంవత్సర కాలం. ఒక ఎస్.ఐ, మరో ఆర్గనైజేషన్ కలిసి చేసినవి. వీళ్ళే ఇంతలా మార్పులు చేయగలిగితే ఇంకా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ముందుకొస్తే ఇంకెంతలా మార్పు జరుగుతుంది. స్టార్ హీరోలు, మంత్రులు నిజాయితీగా ముందుకొస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని మార్పులు సంభవిస్తాయి.. అలాంటి నిజాయితీ గల రోజులు తొందరగా రావాలి.