"నా భార్య పిల్లలు ఆరోజు కెనడా నుండి కాకినాడకు బయలుదేరారు, ఉగ్రవాదులు దాడిచేసి ఆ విమానంలో నావాళ్ళతో పాటు 329మంది చావుకు కారణం అయ్యారు ఈ విషయాన్ని నా స్నేహితులు నాకు వివరించారు గుండెలు పగిలేలా ఏడిచాను ఒకేసారి మూడుసార్లు చనిపోయాను." - డా.చంద్రశేఖర్.. చంద్రశేఖర్ గారు మిగితా వారందరికన్నా భిన్నమైన వారు.. ప్రాణాంగా ప్రేమించిన భార్య, పిల్లలు చనిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించి ఆనందాన్ని వెతుక్కోలేదు. భార్య బ్రతికున్నప్పుడు చేయాలనుకున్న సేవచేస్తు తన ఆశయాలను బ్రతికిస్తు, నెరవేర్చుతు ప్రపంచ ఖ్యాతిని గడించిన మన తెలుగువాడి ఘనతను తెలుసుకుందాం.
చంద్రశేఖర్ పుట్టింది ప్రకాశం జిల్లా సింగరాయకొండలో. రాజమండ్రి, విశాఖపట్నంలో చదువు పూర్తిచేశారు. ఆంధ్రయూనివర్సిటిలో ఎమ్.ఎస్.సి, ఆ తర్వాత కెనడా యూనివర్సిటీలో పి.హెచ్.డి(1965) పూర్తిచేసి అక్కడే ఉద్యోగం సంపాదించారు. కెనడాలో ఉన్నా కూడా తల్లిదండ్రుల మీద గౌరవంతో పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని అంగీకరించారు.. అలా మంజరి తన జీవితంలోకి అడుగుపెట్టింది(1975). ఇక అప్పటినుండి తన జీవితం మరింత ఆనందంగా మారింది ప్రపంచం అంతా మరింత అందంగా కనిపించింది వారి ప్రేమకు కానుకగా శ్రీ కిరణ్, శారద పిల్లలు కలిగారు. కాని భార్య మంజరికి మాత్రం ఇవ్వేమి అంత ఆనందం కలిగించడం లేదు.. మన తెలుగు నేలకు వెళ్ళాలి అక్కడి పేదవారికి సహాయం చేయాలి వారి ధీన బ్రతుకులు బాగుచేయాలి అందుకోసం ఇలా చేయాలి అంటూ ప్రతిరోజు చంద్రశేఖర్ కు వివరించేది.
కాని తన ఆశయం నెరవేరకముందే చనిపోవడం డా. చంద్రశేఖర్ ను మరింత కలిచివేసింది. స్నేహితులు ఎంత వారించిన లెక్కచేయకుండా కెనడాలోని ఉద్యోగానికి రాజీనామా చేసి తన భార్య మంజరి స్వగ్రామం కాకినాడకు చేరుకున్నారు. అక్కడ 'మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్' అనే సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. మొదట కాకినాడ తిమ్మవరంలో ఒక మామిడి తోటను కొనుగోలు చేసి అక్కడ అనాధాశ్రమం ప్రారంభించారు.. ఆ అనాధాశ్రమ నిర్మాణంలో కొంతమంది పిల్లలు పనిచేస్తుండటం చూసి కలత చెంది వారికోసం కుతురు పేరు మీద శారదా విద్యాలయం స్థాపించి ఎంతో మంది పిల్లలకు ఉచిత విధ్యను మాత్రమే కాదు ఉచిత భోజనం, ఉచిత వైద్యం కూడా అందిస్తున్నారు.
ఆ పిల్లలపై ఎంత మమకారం పెంచుకున్నారంటే వేసవి సెలవులకు వారింటికి వెలితే అక్కడ సరైన పౌష్టిక ఆహారం లభించదని వేసవిలో కూడా వారిని తన సొంత పిల్లలులా వారి ఆలనా పాలన చూసుకుంటున్నారు. సరైన వైద్యం అందక ఎంతోమంది పేదల బాధను చూసి తట్టుకోలేక అంధులకోసం తన కొడుకు పేరు మీద శ్రీకిరణ్ కంటి హాస్పిటల్ ను స్థాపించి ఎన్నో లక్షలమందికి చూపు తెప్పిస్తున్నారు. ఇలా ఒక్క ప్రాంతంలో మాత్రమే కాదు దాదాపు ఆ చుట్టు పక్కల నాలుగు జిల్లాల వరకు చంద్రశేఖర్ సేవలు విస్తరించాయి. 30 సంవత్సరాలకు పైగా చేస్తున్న ఈ సేవవలకు గాను దేశ విదేశాలలో ఎన్నో అవార్డులను అందుకున్నారు.. చనిపోయిన ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహాల్ ను నిర్మిస్తే, చంద్రశేఖర్ మాత్రం మంజరి కోసం నిరుపేదలకు హస్పటల్స్, విద్యాలయాలు నిర్మించి తన ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.