ఓరోజు మమతా రఘువీర్ గారి ఇంట్లో పనిచేసే పనిమనిషి తన 12సంవత్సరాల కూతురిని కూడా ఇంటికి తీసుకువచ్చి ఇంటి పనులు చేయిస్తుంది. "ఇదేంటి పాపను స్కూల్ కు వెళ్ళనివ్వకుండా ఇక్కడకు తీసుకువచ్చావు" అని ప్రశ్నించిన తనకు మనసు కలిచివేసే సంఘటన ఎదురయ్యింది. " ఈసారైనా కొడుకు పుడతాడని చెప్పి మా ఆయన నాచేత ముగ్గురు ఆడపిల్లలను కనిచ్చాడు, వారిని పెంచాలంటే నా ఒక్క రెక్క సరిపెట్టడం లేదమ్మ అందుకే నా పెద్దకూతురుని తొలుకొచ్చినా" అని సమధానం ఇచ్చిందట. "మీరు చేసిన తప్పులకు పిల్లలకు కూడా శిక్షపడుతున్నది చూడు ఇంత చిన్న వయసులోనే తనకు ఈ శిక్షపడింది" పాప ఇలా పనిచేయాల్సిన అవసరం లేదు నేను మీ కుటుంబానికి అండగా ఉంటాను అని ఈ మనసును కలిచివేసిన సంఘటనే స్పూర్తిగా "తరుణి" ఏర్పాటుచేశారు.
"తరుణి" స్కూల్: తన ఇంట్లో పనిమనిషి జీవితాలు మరెందరో పిల్లలు అనుభవిస్తున్నారని చెప్పి 2000 వ సంవత్సరంలో కేవలం పనిమనిషుల పిల్లల కోసమే ఈ స్కూల్ ను 45మంది విద్యార్ధులతో స్థాపించారు. ఈ స్కూల్ లో చదువు మాత్రమే కాదు స్కూల్ నుండి బయటకు వెళ్ళాక స్వశక్తితో నిలదొక్కుకోవడానికి టైలరింగ్, కంప్యూటర్ టైనింగ్, డ్రాయింగ్ మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు.
"తరుణి" ఎందుకోసం పనిచేస్తుంది.? కూతురు పుడితే కూతురే వందమంది కొడుకులతో సమానం అని కొడుకుతో పోలుస్తున్నారు గాని కూతురుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇంకా అందడం లేదు. అన్నిరంగాలలో సమానత్వంతోపాటు తల్లిదండ్రుల మదిలో కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావనను చెరిపేయడమే తరుణి లక్ష్యం. మహిళల్లో చాలామంది 18సంవత్సరాలు నిండకుండానే చదువును మధ్యలో ఆపేస్తున్నారు అదికూడా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి చదువుకునే విద్యర్ధులే, దీనివల్ల వారి ఉన్నతికి పెద్ద అడ్డంకి ఏర్పడుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి అందులో చదువుకునే బాలికలతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తుంది తరుణి. ఈ అవేర్ నెస్ మూలంగా ఇప్పటికి వేలసంఖ్యలో బాలికలు తమ క్వాలిఫికేషన్ పెంచుకున్నారు.
బాల్య వివాహాలపై పోరాటం: ఈ పేరా రాస్తుంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం వీరేశలింగం పంతులు గారు, రాజరామ్మోహన్ రాయ్ గారు బాల్యవివాహాలపై పోరాడారు అని చదువుకున్నాం ఇప్పటికి అక్కడక్కడా ఇదే కొనసాగుతున్నది. మమత గారు బాల్య వివాహాలను అరికట్టడానికి బాలికావేదికను ఏర్పాటుచేశారు. బాల్యవివాహాలు ఎక్కడ జరిగినా గాని వీరికి వెంటనే తెలిసేది. సమస్య తెలుసుకుని బాలికావేదిక సభ్యులు పోలీసు సిబ్బందితో వచ్చి అడ్డుకునేవారు. "మా బిడ్డకు మేము పెళ్ళి చేస్తున్నాం మీకెందుకమ్మా నొప్పి" అని ఎంతమంది ఎన్ని రకాల భయందోళనలకు గురిచేసినా బెదరక ముందుకుసాగుతున్నారు.
మహిళలో చట్టాలపై పూర్తి అవగాహన: ఇప్పుడు ఏ కొత్త చట్టాలు అవసరం లేదు ఉన్న చట్టాలనే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు కాని ఆ చట్టలపై సమగ్ర అవగాహన లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇందుకోసం 500 మహిళలతో కలిసి అవగాహన తీసుకువస్తున్నారు. తీసుకురావడం వరకే కాదు వారి సమస్యలపై చట్టపరంగా పోరాడుతున్నారు.
మనం ఆనందంగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటే మనం మాత్రమే సంతోషంగా ఉంటాము సమాజం కూడా ఆనందంగా ఉండాలని పాటుబడితే ఈ విశ్వమంత ఆనందం మనకు అందుతుంది. మమత గారు తనకు నిజంగానే ఎంతోమందికి భగవంతుడు ఇచ్చిన తల్లిగా వారి జీవితాలలోకి వచ్చేశారు