Contributed by: Vineeth Alladi
నేను మామిడిచెట్టుని . మాదొక అందమైన తోట అందులోనే నా జీవనం. మా తోటలో అన్ని రకాల చెట్లూ ఉంటాయి - పండ్లు ,పూలు,కూరగాయలు మొదలైనవి .మా యజమాని మమ్మల్ని బాగా చూసుకుంటాడు.అతనికి మేమన్నా మేముండే ఈ నేలన్నా ఎంతో మమకారం.
ఈ తోటలోనే ఎప్పుడూ నా పక్కనే నా భార్య మల్లి ఉంటుంది. దాని పూర్తి పేరు మల్లిక. కావలసిన వాళ్ళకి మల్లెపూలు ఇస్తూ ఉంటుంది.
మాదొక చిన్ని సంసారం. మా ఇద్దరిదీ వేరే వేరే జాతులైనా అంటే అదేనండి మీ మనుషులలో కూడా వివిధ జాతులుంటాయటగా మీనుండే మా చెట్లు కూడా జాతిభేదాలు చూడడం మొదలెట్టాయి.నేనేమో పండ్లజాతి అదేమో పూలజాతి. కానీ మా ఇద్దరికీ ఒకరికి ఒకరంటే ప్రాణం.మా వాళ్ళకి ఇష్టం లేకపోయినా మేము పెళ్ళి చేసుకొని ఆనందంగా ఉన్నాము.
మా మధ్య ఎప్పుడూ చిలిపి సరసాలు సరదాలూ సాగుతూనే ఉంటాయి. నేలకింద ఉండే మా వేళ్ళతో మీకెవ్వరికీ కనబడకుండా మేము ముచ్చటించుకుంటాం. అపుడపుడూ గాలివల్ల తన పూలు నా మీద పడి నన్ను ముద్దాడుతాయి.మా పై వాలి సేదతీరే పక్షులతో మా వలపు రాయబారాలను పంపుకుంటూ సంతోషంగా జీవిస్తాం. నేను మా యజమానికి రోజూ ఏమి ఇవ్వలేకపోయినా వేసవి వస్తే మాత్రం చాలా కాయల్ని,పండ్లని ఇచ్చేవాడిని.ఆ పళ్ళని అందరికీ ఉచితంగానే ఇచ్చేవాడు అంత మంచోడు మా యజమాని. ఇంకా ప్రతీ పండుగకీ తోరణాల కోసం నా ఆకులు , ఎవరైనా అలిసి వస్తే చల్లనైన నా నీడనీ ఇస్తూ ఉంటాను. ఆయన ప్రేమగా నాకు నీళ్ళు ,ఇంకా ఏమైనా జబ్బు చేస్తే (పురుగు) మందు ఇస్తూ ఉంటాడు. నా పళ్ళకోసం ఆకతాయిలు అప్పుడప్పుడు రాళ్ళతో కొడతారు.దానికి నేను ఎక్కువగా బాధ పడకపోయినా నొప్పిగా మాత్రం ఉంటుంది. ఇదంతా చూసి మల్లి చాలా బాధపడుతుంది.
పాపం తనేమీ తక్కువ కాదు . పూలకోసం రోజూ తనని అందరూ పీక్కుతింటారు. అప్పుడు కూడా తాను అంతగా బాధపడదు. కానీ అవి తెంపుతుంటే నాకు మాత్రం ఎక్కడలేని కోపం వచ్చేది.మగాళ్ళు తమ భార్యల తలలకి పూలు పెట్టడం కోసం నా భార్య తలలో ఉన్న పూలు తీసుకెళ్ళేవారు. నా మల్లికి ఆ పూవులే అందం . ప్రతీ పువ్వులోనూ తన నవ్వు వికసిస్తుంది. మల్లికి తన పూలు పక్కలోకో,జడలోకో లేదా దేవుడి కోసమో వాడడం కంటే ఒక మంచి మనిషి సమాధిపై ఉండడానికి ఇష్టపడుతుంది. అది చూసి నాకు గర్వంగా ఉంటుంది.
అలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండగా మా యజమాని కూతురు పెళ్ళి కుదిరింది. అమ్మాయి లక్షణంగా ఉంటుంది అయినా కూడా అబ్బాయి వారు కట్నం అడిగారు. అబ్బాయి మంచివాడు కావడం మరియు అమ్మాయికి అబ్బాయి నచ్చడం వల్ల మా యజమాని కూడా కట్నం గురించి ఆలోచించకుండా ఒప్పేసుకున్నారు నిజానికి అంత డబ్బు తన దగ్గర లేదు . వేరే వారి దగ్గర చేయి చాచడం ఇష్టంలేక తన తోటలోని కొంత భాగాన్ని అమ్మి కావలసిన డబ్బు సమకూరుద్దామని అనుకున్నారు.
ఆ తోటలోని కొంత భాగంలో నేను మల్లి కూడా ఉన్నాం. ఆ కొన్నవాడు ఊరికే ఉంటాడా లేఅవుట్ పేరిట తోటలోని చాలా వరకు చెట్లను తీయించేశాడు. నేను పెద్దగా దిట్టంగా ఉండడం మూలానా మరియు నేను దేనికీ అడ్డు రానందువలన నన్ను ముట్టుకోలేదు. కానీ పాపం నా మల్లి వాళ్ళు వేసే రోడ్డుకి అడ్డంగా ఉన్నందుకు దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసారు. నా కళ్ల ముందే మా ఆశలు, మేము కన్న కలలన్నీ మట్టిలో కలిసిపోయాయి అయినా కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా దానికి తోడు నా చేయి( కొమ్మ ) కూడా నరికేశారు.
ఈరోజు నుండి వసంతం మొదలవుతుంది. వసంతకాలం అంటే మా మల్లికి ఎంతో ఇష్టం. అది మాకు పండుగ లాగా . మీరు పండుగలకి కొత్త బట్టలు వేసుకున్నట్టు మేము కూడా మా పాత ఆకులు రాల్చేసి కొత్త చిగురులను తొడుగుతాం. కానీ మల్లి నాతో లేదు అన్న నిజం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాను. పైకి అందరికీ పచ్చగా కనబడుతున్నా నా గుండె మొత్తం ఎడారైపోయింది. తను భౌతికంగా నా పక్కన
లేకపోయినా తన పరిమళం ఇంకా నా నుండి విడిపోలేదు. అందరికీ ప్రాణవాయువుని నేను అందిస్తే నా ప్రాణానికి ప్రేమవాయువుని మాత్రం మల్లి ఇచ్చేది.
కానీ నాకు నమ్మకం ఉంది ఏదో ఒకరోజు నా మల్లి ఏదో ఒక రూపంలో మళ్ళీ నాకోసం మొలకెత్తి నన్ను అక్కున చేర్చుకుంటుంది తన పూలతో పలకరిస్తుంది.
ఇదండి మా ఇంటి కథ. ఒక సినిమా లాగా ఉంది కదూ. కానీ ఇది అక్షరాలా నిజం. మాకు దేవుడు నోరు ఇవ్వనందుకు మీకు నేరుగా చెప్పలేకపోతున్నాం. ఈ నాగరికతో లేదా పారిశ్రమీకరణ వల్లో తెలీదు కానీ నాలాగే చాలా చెట్లు తమ స్నేహితులని , ప్రేమించినవారిని , కావలసినవారిని కోల్పోతున్నాయి. దయచేసి కొత్తగా మీరు చెట్లు నాటకపోయినా పర్వాలేదు కానీ ప్రస్తుతం ఉన్న చెట్లని మాత్రం నాశనం చేయకండి. అర్థం చేసుకోండి మీ కోసమే చెబుతున్నాను.
ఇట్లు మీ శ్రేయోభిలాషి.