Contributed by Sai Ram Nedunuri
భవిష్యత్తు బావుంటుందని సొంత ఊరు వదిలి, వర్తమానంగా మారుతున్న భవిష్యత్తు అంతా ఇంటికి దూరంగా ఉద్యోగం చేస్తూ గడిపేస్తున్నాను. శనివారం, ఆదివారం ఆఫీస్ స్నేహితులతో అప్పుడప్పుడు సినిమాలకి వెళ్ళినా, ఎక్కువ సమయం మాత్రం నేను ఒక్కడినే అద్దెకు ఉంటున్న సింగిల్ రూమ్ లో గడిపేస్తూ ఉంటాను.
ఒకరోజు రాత్రి భోజనం కోసం వీధి చివర ఉండే షాప్ లో పెరుగు కొనుక్కుని వస్తుంటే, ఒక వీధి కుక్క చిరిగిపోయిన కవర్లో ఆత్రుతగా తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతకడం గమనించాను. నేను రోజూ తిరిగే వీధిలోనే ఆ కుక్క తిరుగుతూ ఉన్నా పెద్దగా పట్టించుకోని నేను, ఆ రోజు మాత్రం నా దగ్గర మిగిలిన చిల్లరతో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని మొత్తం ఆ కుక్కకి తినడానికి ఇచ్చేసాను. నేను భోజనం చేసాక బయటకి వచ్చి నీళ్ళు తాగి, బాటిల్ లోని నీళ్ళని ఒక కప్ లో ఆ కుక్కకి పోసాను. ఆకలి తీరాక తన కళ్ళలో మొదటిసారి చూసిన ఆనందం ఎందుకో ఎప్పటికీ గుర్తుండిపోయింది. నాకు పెరుగు లేకుండా భోజనం చేయలేకపోవడం ఎలాగైతే అలవాటో, ఆ రోజు నుంచి పెరుగు తో పాటు ఆ కుక్కకి తినడానికి ఏదన్నా కొనడం కూడా అలవాటైపోయింది.
జంతువులకి, కొందరి మనుషులు లాగ, ఆకలి - అవసరం తీరగానే అనుబంధాలని వదిలేయడం చేతకాదనుకుంట. రోజూ నేను ఆఫీస్కి వెళ్ళేటపుడు వీధి చివర దాకా ఆ కుక్క నా వెంటే వచ్చేేేేది. నేను కొన్ని సాయంత్రాలు ఆఫీస్ పని వలన చిరాకు గా ఉండేవాడిని కానీ, తను మాత్రం రోజూ సాయంత్రం నన్ను చూడగానే ఆనందంతో గంతులు వేసేది.
నేను కిరాణా కొట్టుకి వెళ్ళినా నా వెంటే వచ్చేది. ఇంటి బయట పాటలు వింటూ కూర్చున్నా, నా ముందే కూర్చునేది. నేను బయట గడిపే సమయంలో దాదాపు ప్రతి నిమిషం నాతో పాటే తన సమయం గడిపేది.
వేసవి కాలం కావడం తో అందరి ఇళ్ళలో AC లు కూలర్ లు నిర్విరామంగా నడుస్తున్నాయి. రాత్రి భోజనం చేసి నాతో పాటు నడవడం అయిపోయాక, పడుకోవడానికి చల్లదనం కోసం రోడ్డు మీద ఎక్కడన్నా నిలిచిపోయిన నీళ్ళు కోసం ఆ కుక్క వెతకడం గమనించాను. దేవుడు ఎందుకో మనుషులకి జంతువులకి మధ్య తెలివిలో వ్యత్యాసం పెట్టాడు ..!! బహుశా ఆ తెలివితో వేేరే ప్రాణులకి సైతం మనిషి సహాయం చేస్తాడులే అని దేవుడు పొరపాటు పడి ఉంటాడు. నా లాంటి మనిషులు మాత్రం ఇతర జీవాలను తోటి ప్రాణులుగా కూడా గుర్తించడం మానేసారేమో. ఆ రోజు నుంచి నా రూమ్ లో ఉండే కూలర్ ని గుమ్మం దగ్గరకి జరిపి పడుకోవడం మొదలుపెట్టాను. గుమ్మం బయట ఆ గాలి తగిలేటట్టు పడుకుని ఆ కుక్క కూడా గాఢ నిద్రపోయేది.
ఇంతలో ఒక శనివారం నా రూమ్ లో నేను ఫోన్ లో నిమగ్నం అయిపోయి ఉండగా, ఇంటి బయట ఆపకుండా ఆరుస్తున్న కుక్క వలన ఆ ఫోన్ ప్రపంచం లో నుంచి బయటకి వచ్చాను. ఏం జరిగిందో అని బయటకి వెళ్లి చుసిన నాకు నగరాల్లో వీధి కుక్కల పాలిట శత్రువులు కనిపించారు. వీధి కుక్కలను van లో వేసుకుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్లు. మా వీధి నుంచే పని ఆరంభించారు కాబోలు, ఆ వాన్ లో మా వీధి కుక్క ఒక్కటే ఉంది.
నేను: భయ్యా ఆ కుక్క ని వదిలేయండి.
Van మనిషి: చాలా మంది ఇలాగే అంటారండి, కాని వదిలేస్తే మా పైన అదికారులు ఊరుకోరు.
ఆ van కి ఉన్న ఇనప ఊచలు దగ్గర తన మోహం పెట్టి, దిగాలుగా ఆ కుక్క నన్ను చూడడం బహుశా ఎప్పటికీ నేను మర్చిపోలేనేమో.
మనుషులు కూడా ఎంత వింత స్వభావులో కదా .. ఈ భూమి మొత్తం వాళ్ల కోసమే చేయబడింది అనే భ్రమ లో బ్రతికేసి, తన తోటి ప్రాణులకి కనీసం బ్రతకడానికి చోటు లేకుండా ఆక్రమించేసి, తను బ్రతకడానికి అవే అడ్డు వస్తున్నాయని నిర్ణయించేసి, తనకి ఇష్టమైనవి తప్ప, వేరే ప్రాణులను అడ్డు తొలగించేసుకుంటారు.
నేను: ఈ సారికి వదిలేసేయి భయ్యా. Van మనిషి: సరేలెండి. చాయ్ పైసలు ఏమైనా ఇస్తారా? నేను: తప్పకుండా ..!!
అని జేబులో ఉన్న యాభై రూపాయల నోటు తీసి ఇచ్చేసాను.
ఆ VAN మనిషి, van door తీయగానే ఆ కుక్క పరుగు పరుగున వచ్చి నా వెనకాలకి వచ్చి దాక్కుంది. ఆ VAN వెళ్ళిపోగానే, నా ముందు తన కాళ్లు రెండూ చాపి కుర్చుని, కళ్లలో నీళ్ళతో నా వైపే చుస్తూ ఉండిపోయింది. ఎందుకో ఆ రోజు నా కళ్లలో నీళ్ళు తిరిగాయి.
భావాలని పంచుకోగలిగినప్పుడు, కొన్ని బంధాలకి భాష తో పని లేదనుకుంట.
ఆ కుక్క, తనకి నా మీద ఉండే ఆప్యాయత ఎవరికీ చెప్పలేదు. నాకు, ఇంకొకళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో కొన్ని బంధాలు బహుశా ఇలాగే ఉంటాయేమో.
రోజూ లాగే పెరుగు తీసుకోవడానికి నేను, ఆ కుక్క బయల్దేరాము.