These Musings Of A College Student During Quarantine Times Are Spot On

Updated on
These Musings Of A College Student During Quarantine Times Are Spot On

Contributed By Raghu Agarapu

మనం మళ్ళీ కలవాలోయ్! సెలవులంటే, అన్నం తినిపించేటపుడు, ఉప్పు కోసం అమ్మ వంట గదిలోకి వెళ్తే, అదే అదునుగా పరుగెత్తుకొని నీ దగ్గరికి వచ్చేవాడ్ని, ఆటలాడటానికి. కానీ ఇప్పుడు, మా ఇంటి గేటు కూడా దాటట్లేదు. మన ఆటలు చూడని ఆ మైదానాలు ఏమనుకున్నాయో వినడానికైనా, మనం మళ్ళీ కలవాలోయ్!

కాలేజి అయిపోయాక ఇంటికి వెళ్ళకుండా, బస్టాండులో నిలబడి అమ్మాయిల్ని చుాస్తుంటే మనల్ని తిట్టే, ఎక్కని బస్సులు మనం లేనపుడు ఏమనుకున్నాయో వినడానికైనా, మనం మళ్ళీ కలవాలోయ్!

శుక్రవారాలు సినిమాకని, మైళ్ళు నడిచి, గంటలు నిలిచి, అరిచి, నడవటానికి కూడా ఓపిక లేనపుడు పరుగెత్తించిన కుక్కలు, ఈలల్లేని ఆ సినిమా హాలు భరించిన నిశ్శబ్దం ఎంతో తెలుసుకోడానికైనా, మనం మళ్ళీ కలవాలోయ్!

మనం ప్రపంచ తత్త్వవేత్తల సముాహారంగా పిలుచుకునే ఆ బార్ లో,నిస్సహాయ స్థితిలో మన గాధలన్నీ విన్న ఆ టేబుల్లు,సోఫాలు ఎన్ని కథలకు కొనసాగింపును వినలేకపోయాయో తెలుసుకోడానికైనా, మనం మళ్ళీ కలవాలోయ్!

సాయంత్రాలు.. నడిచాక,మన అనుభవాలు పడే మాటల పోటీలు విన్న ఆ పార్కులోని బల్ల, పుస్తకాలు ఖాళీచేసిన షెల్ఫ్ లాగా ఉందేమో కదా? కొత్త పేజీలు రాయడానికైనా, మనం మళ్ళీ కలవాలోయ్!

అన్నింటికన్నా ముఖ్యంగా.. ప్రసవవేదనలిచ్చే నవ్వులు కాక, ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసే ఈ మహమ్మారి కలిగించే రోదనలు విన్న ఆస్పత్రులు, ముళ్ళున్న విషపు మొక్కలకు అంటుకడుతున్న వైద్యుల ధైర్యాలు కట్టిన కోటలు చూడటానికైనా, మనం మళ్ళీ కలవాలోయ్!

కలవాలంటే, ఆయుధాలు లేకుండా చేసే ఈ యుధ్ధం గెలిచి తీరాలి. అలా కలవడానికి ఇలా దూరంగా ఉండాలి. ఒకరి ఒకరు కలిసి విడిగా పోరాడాలి.